మీరు ఫోమోనా.. జోమోనా.. నేమోనా!

రసాయన నామా(పేర్లు)ల మాదిరే... సోషల్‌ నెట్‌వర్క్‌ యూజర్లకూ నామాలు ఉన్నాయ్‌ తెలుసా? ఫోమో... జోమో... ఇప్పుడు కొత్తగా ‘నేమో’. మరి, మీరు దేంట్లోకి వస్తారు? ఏమో... అంటారా? * ‘తింటున్న దోశ చూశారా? టేస్ట్‌ అదిరిపోయింది. మీరూ ట్రై చేస్తారా?’ అంటూ ఎఫ్‌బీలో పోస్ట్‌ పెట్టాడు ఇషాన్‌. అది మొదలు లైక్‌లు ఎన్నొచ్చాయి... ఎవరెలా స్పందించారని పదే పదే చెక్‌ చేసుకోవడం... కామెంట్‌లకు రిప్లైలు ఇవ్వడం... అదో పనిగా చేస్తుంటాడు. ఎవరూ స్పందించకుంటే తెగ ఫీలైపోతాడు. కారణం ఏదైనా ఫోన్‌కి దూరంగా ఉండాల్సివస్తే. ఏదో మిస్‌ అయిపోతున్నట్లు ఫీలవుతాడు. సోషల్‌ మీడియా లైఫ్‌కి దూరంగా ఉండడం అంటే అదేదో నేరంగా భావిస్తుంటాడు. అయితే, ఇషాన్‌కి ఉన్న సోషల్‌ నామం... ‘ఫోమో’ (ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ అవుట్‌)...

Published : 09 Jun 2018 01:53 IST

మీరు ఫోమోనా..  జోమోనా.. నేమోనా!

రసాయన నామా(పేర్లు)ల మాదిరే... సోషల్‌ నెట్‌వర్క్‌ యూజర్లకూ నామాలు ఉన్నాయ్‌ తెలుసా? ఫోమో... జోమో... ఇప్పుడు కొత్తగా ‘నేమో’. మరి, మీరు దేంట్లోకి వస్తారు? ఏమో... అంటారా?

* ‘తింటున్న దోశ చూశారా? టేస్ట్‌ అదిరిపోయింది. మీరూ ట్రై చేస్తారా?’ అంటూ ఎఫ్‌బీలో పోస్ట్‌ పెట్టాడు ఇషాన్‌. అది మొదలు లైక్‌లు ఎన్నొచ్చాయి... ఎవరెలా స్పందించారని పదే పదే చెక్‌ చేసుకోవడం...  కామెంట్‌లకు రిప్లైలు ఇవ్వడం... అదో పనిగా చేస్తుంటాడు. ఎవరూ స్పందించకుంటే తెగ ఫీలైపోతాడు. కారణం ఏదైనా ఫోన్‌కి దూరంగా ఉండాల్సివస్తే. ఏదో మిస్‌ అయిపోతున్నట్లు ఫీలవుతాడు. సోషల్‌ మీడియా లైఫ్‌కి దూరంగా ఉండడం అంటే అదేదో నేరంగా భావిస్తుంటాడు. అయితే, ఇషాన్‌కి ఉన్న సోషల్‌ నామం... ‘ఫోమో’ (ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ అవుట్‌)

* ‘ఏంటీ లైక్‌లు.. పోస్టింగ్‌లు? బాహ్య ప్రపంచానికి దూరమైపోతూ అలా వర్చువల్‌ వరల్డ్‌లో విహరించడం మానవ సంబంధాల్ని దూరం చేసుకున్నట్టే..’ అంటోంది అపూర్వ. ఫేస్‌బుక్‌ని తెరిచేది లేదు. ట్విట్టర్‌ని మాట్టాల్సిన అవసరం లేదు అనే ధోరణి తనది. మరైతే, అపూర్వ నామం.. ‘జోమో’ (జాయ్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ అవుట్‌)

* ‘ఒకప్పుడు ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేయ్యినిదే రోజు ప్రారంభం అయ్యేది కాదు. అన్ని సోషల్‌ నెట్‌వర్క్‌ సర్వీసుల్ని ఫాలో అయ్యేవాడిని. అదో వ్యసనమే. నిద్ర తక్కువైంది... ఒత్తిడి... విసుగు... ఉన్నట్టుండి లావైపోయా. ఫోన్‌ని దూరం పెట్టాలనే నిర్ణయానికొచ్చా. అంతేకాదు.. అన్ని సోషల్‌ నెట్‌వర్క్‌ సర్వీసుల అడ్రస్‌లు మార్చేయమని తమ్ముడికి చెప్పా. ఏదో మిస్‌ అవుతున్నట్లు అనిపించేది. కానీ, నాలో మార్పు కనిపించింది. ఎప్పుడూ షేరింగ్‌లు చేసే నేను చదవడం మొదలుపెట్టా. అప్పుడప్పుడు ఎఫ్‌బీలోకి లాగిన్‌ అయ్యి అప్‌డేట్స్‌ చెక్‌ చేస్తున్నా. నెట్టింట్లో ఇతర అప్లికేషన్స్‌ని వాడుతూ కెరీర్‌కి ప్లస్‌ అయ్యేలా జాగ్రత్త పడుతున్నా’ అంటున్నాడు కార్తిక్‌. అయితే, కార్తిక్‌ నామం.. ‘నేమో’(నియర్లీ... బట్‌ నాట్‌ ఫుల్లీ మిస్సింగ్‌ అవుట్‌)
ప్పుడు చెక్‌ చేసుకోండి. మీరెందులోకి వస్తారో? ఫోమో... జోమో... ఇప్పుడు పుట్టుకొచ్చిన సోషల్‌ నామాలేం కాదు. మిలీనియం మొదట్లోనే వచ్చాయి. అయితే, కొత్తగా పలకరిస్తున్నది మాత్రం ‘నేమో’. సమతూకంగా ఆలోచిస్తున్న మిలీనియల్స్‌ ఆలోచనల నుంచి పుట్టిన సోషల్‌ నామం ఇది. ఫోమో లేదా జోమో... ఏ విధంగా ఉన్న ఇబ్బందేననేది వీరి అభిప్రాయం. అటు వ్యసనం కాకుండా... ఇటు అస్సలు ముట్టకుండా ఉండడం అనేది అభివృద్ధి నిరోధకం అంటున్నారు. కొన్ని సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయ్‌. ప్రపంచ వ్యాప్తంగా 43 శాతం డిజిటల్‌ యూజర్లు ఫ్యామిలీతో కంటే ఫోన్‌ నుంచే కాస్త దూరం అవ్వాలనుకుంటున్నారట. నెల్లో కనీసం రెండు మూడు రోజులైనా ఫోన్‌ని దూరం పెడితే ‘సోషల్‌’ వల నుంచి కాస్తైనా దూరం అవ్వొచ్చని కోరుకుంటున్నారు. 40 కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్లు నెలకోసారైనా ‘ముఖపుస్తకం’ తెరకుండా దూరం పెడుతున్నారు.

స్పృహ ఎక్కువైంది
డేటా ప్యాక్‌లు ఎంత చౌవకైనప్పుటికీ డిజిటల్‌ యూజర్లు సమతూకంతోనే ఆలోచిస్తున్నారు. ‘ఫోమో’గా గడపడంలో చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోందని చెబుతున్నారు. దీంట్లో భాగంగానే ప్రముఖ కంపెనీలు అందించే యాప్‌ సర్వీసుల్ని వాడుకుని ఏయే సోషల్‌ సర్వీసుల్లో ఎంతెంత సమయం గడుపుతున్నారో ట్రాక్‌ చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందే అప్రమత్తమవుతున్నారు. దేశంలోని మెట్రో నగరాల్లోనూ ‘ఇంటర్నెట్‌ డీ-అడిక్షన్‌’ సెంటర్లూ పుట్టుకొస్తున్నాయి. ఇక కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌లు చెబుతున్న ప్రకారం ప్రతి ఐదుగురు యువకుల్లో ఒకరు ‘సోషల్‌’ లైఫ్‌ వల్లే ఆందోళన, ఒత్తిడికి లోనవుతున్నారు. దీనికి పరిష్కారంగా ‘జోమో’గా మారడానికంటే ‘నేమో’ అయ్యేందుకే యూజర్లు మొగ్గుచూపుతున్నారు. పదుల సంఖ్యలో ఉన్న సోషల్‌ యాప్‌లను ఒకటి.. రెండుకి పరిమితం చేసి ఒత్తిడికి చెక్‌ పెడుతున్నారు.

గుర్తింపు కోసమే...

ఇంగ్లిష్‌లో ‘యాంగ్జైటీ’ మాదిరిగానే ‘రింగ్జైటీ’ ఉంది తెలుసా? సోషల్‌ మీడియా నోటిఫికేషన్లు రాకపోయినా వచ్చినట్టుగా ఎలర్ట్‌ రింగ్‌టోన్లు వినిపించడం... ఫోన్‌ రాకపోయినా రింగ్‌ అవుతున్నట్టుగా అనిపించడమే ఈ రింగ్జైట్‌. మానసిక సమస్యలతో వస్తున్న విద్యార్థుల్లో ఐదుగురిలో ఒకరు ఫోన్‌, సోషల్‌ మీడియాని మితిమీరి వాడుతున్నారు. వాస్తవ ప్రపంచంలో కంటే వర్చువల్‌ వరల్డ్‌లో గుర్తింపు తెచ్చుకోవాలనే వీరి తాపత్రయం. అక్కడే ఈ ‘ఫోమో’ పుట్టేది. ఎదురైన అనుభవాలతో వీళ్లు ‘జోమో’గానో... ఇప్పుడు కొత్తగా పరిచయమైన ‘నేమో’గానో మారేందుకు అవకాశం ఉంటుంది. ఫోమోగా మారి సోషల్‌లైఫ్‌లో రెమో అవ్వడం ద్వారా ప్రయోజనం శూన్యం. వాస్తవ జీవనశైలికి దూరం అవుతారు. చుట్టూ ఒక్కరూ ఉండరూ... వర్చువల్‌గా మాత్రం వందల్లో ఉంటారు. దీంతో ఏం సాధించినట్టు? ఈ ప్రశ్న అందరికీ వర్తిస్తుంది. ముఖ్యంగా యువత వారి విలువైన సమయాన్ని ఎంత వృథా చేస్తున్నారో ట్రాక్‌ చేసుకోవాలి. దానిక్కూడా కొన్ని యాప్‌లు ఉన్నాయి. ఫోన్‌ని.. ఎఫ్‌బీని దూరం పెట్టమనికాదు... సరైన సమయానికి సైన్‌అవుట్‌ చేయడం ముఖ్యం అనే విషయం గుర్తుంచుకోవాలి.

- టీఎస్‌ రావు, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్.‌
ద్యోగంలో భాగంగా కస్టమర్లకు దగ్గరయ్యేందుకు సోషల్‌ మీడియా వేదికల్ని యాక్సెస్‌ చేయాల్సిందే. ఇది కెరీర్‌కి సంబంధించింది. ఇప్పుడు అన్ని కంపెనీలు సోషల్‌ ఫ్రొఫైల్స్‌ని చూస్తున్నాయ్‌. వాటి ఆధారంగానూ ఉద్యోగి గుణగణాల్ని, సామర్థ్యాన్ని లెక్కగట్టే పరిస్థితి ఉంది. అలాగే, ఎఫ్‌బీ లాంటి సోషల్‌ వీడియోల్లో ఎక్కువగా ఫేక్‌ అప్‌డేట్స్‌ పెరిగిపోతున్నాయ్‌. దీంతో గతంలో కంటే ఎఫ్‌బీపై ఆసక్తి తగ్గుతోంది. వాట్సాప్‌లాంటి ఇన్స్‌స్టెంట్‌ మెసెంజర్లను ఎక్కువగా వాడుతున్నారు. మేమూ మెసెంజర్లలో గ్రూపులుగా ఏర్పడి బ్యాంకింగ్‌ ఇంటర్నల్‌ వ్యవహారాల్ని షేర్‌ చేసుకుంటాం. అయితే, కాలేజీ చదువుల్లో నేను ‘ఫోమో’నే. ఇప్పుడు మాత్రం కచ్చితంగా ‘నేమో’గానే వ్యవహరిస్తున్నా’ అంటున్నారు ఓ బ్యాంకు మేనేజర్‌ అజయ్‌కుమార్‌.
ఫ్రెండ్స్‌... అవుటింగ్‌లు... హ్యాంగ్‌అవుట్‌లు కాలేజీల్లో జరిగే సందడిని సోషల్‌వాల్స్‌పైకి తేవాలనుకుంటాం. దాంట్లోనే బాగంగానే నేనూ ఎఫ్‌బీ, ట్విట్టర్‌ వాడుతుంటా. అప్పుడప్పుడు ‘ఫోమో’లోకి వస్తుంటా. అదీ ఎగ్జామ్స్‌ టైమ్‌లో. కానీ, అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా చూసుకోవడం కెరీర్‌కి ముఖ్యం. అందుకే నేనూ ‘నేమో’గా ఉండేందుకు ప్రయత్నిస్తా!’ అంటోంది ఇంజినీరింగ్‌ చదువుతున్న నిఖిత.

విడమరిచి చెప్పాలి  

మీడియా ఏదైనా వ్యవస్థని చైతన్య పరిచేందుకే. సోషల్‌ మీడియా ఉద్దేశమూ అదే. ఫేస్‌బుక్‌నే తీసుకుంటే కొందరు ఎన్నో రకాల సమస్యల్ని వాల్‌పై వెలుగులోకి తెస్తున్నారు. నాణేనికి రెండో వైపూ ఉంది.  లైక్‌లు, కామెంట్‌ల కోసం కాలాన్ని ఐస్‌క్రీమ్‌లా కరిగించేస్తున్నారు. రోజులో వారు రిలాక్స్‌ అయ్యేందుకు దొరికే టైం చాలా తక్కువ. ఆ కాస్త సమయాన్ని ‘ఫోమో’లా మారి ఆందోళన, ఒత్తిడిని తెచ్చుకుంటున్నారు. క్లాస్‌ రూంలోనూ ఆలోచన వాటిపైనే. తల్లిదండ్రులు దీన్ని గుర్తించాలి. వాడొద్దని దూరం చేయడం కంటే.. దేనికి ఎంత సమయం వాడాలనే నిబంధన పెట్టాలి. విద్యార్థి కమ్యూనిటీలకు దగ్గర చేసి వారి కెరీర్‌కి హెల్ఫ్‌ అయ్యేలా చూడాలి. ఎందుకంటే నేటి పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా సిద్ధం అయ్యేందుకు సోషల్‌ మీడియా అవసరమే. ఇక ‘జోమో’ల విషయానికొస్తే వారితో పరిమిత ప్రపంచం. దానికి కారణం వారిలోని రుగ్మతలే. ‘నేను చేయలేనేమో... నా వల్ల కాదేమో’అనుకుంటారు. దీంతో పోటీతత్వం తగ్గుతుంది. ఇప్పటి మిలీనియల్స్‌ అంతా చాలా స్మార్ట్‌. వారే ‘నేమో’లు. సమయం విలువ తెలిసి మసులుకుంటారు. అర్జెంట్‌ అంటే కాల్‌ చేస్తారు.. టైమ్‌ ఉంటే మెసెంజర్‌లో పింగ్‌ చేస్తారు.. మరికాస్త సమయం ఉంటే సవివరంగా మెయిల్‌ చేస్తాయి. దీన్నే బ్యాలెన్స్‌డ్‌ పర్సనాలిటీ అంటారు. వీరు దేన్నీ మిస్‌ అవ్వరు... అలాగని దేనికీ బానిసవ్వరు. కచ్చితంగా టీనేజర్లంతా ‘ఫైడింగ్‌ నేమో’ వెతకడం అనివార్యం.

- వేణుగోపాల్‌రెడ్డి.ఎం, సైకాలజిస్ట్‌.

మరికొన్ని...  

* ఫోజీ (ఫియర్‌ ఆఫ్‌ జాయినింగ్‌ ఇన్‌)
సోషల్‌లైఫ్‌లో బిక్కు బిక్కు మంటూ తిరగడం. పంచుకునేది ఏదైనా నెట్‌వర్క్‌లోని మిత్రులకు నచ్చవేమో అనే ఉద్దేశంతో ఉంటారు. షేర్‌ చేసేందుకు సంకోచిస్తుంటారు. పోస్ట్‌ చేసిన తర్వాత ఆశించిన స్థాయిలో లైక్‌లు, కామెంట్‌లు రాకుంటే వాటిని తొలగించేస్తుంటారు.

* మోమో (మిస్టరీ ఆఫ్‌ మిస్సింగ్‌ అవుట్‌)
వీరిని ట్యాగ్‌ చేయకుండా వాల్‌పై ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడమే సమస్య. తమతో కాకుండా మిత్రులంతా మరో గ్రూపుగా ఏర్పడి సోషల్‌ వేదికలపై సందడి చేస్తున్నారేమోనని ఆందోళనకు గురవుతుంటారు.

* ఫోమోమో (ఫియర్‌ ఆఫ్‌ ది మిస్టరీ ఆఫ్‌ మిస్సింగ్‌ అవుట్‌)
అనుకోకుండా సోషల్‌ లైఫ్‌ నుంచి విరమించాల్సివస్తుందేమోననే భయం. మిత్రులతో అనుకోని బ్రేకప్స్‌.. బ్యాటరీ ఛార్జింగ్‌ అయిపోవడం లాంటి వాటి గురించి   ఆలోచించడం.

* స్లోమో (స్లో టు మిస్సింగ్‌ అవుట్‌)
ఏ నిద్రలోనూ ఉండగా మిత్రులేమైనా హ్యాంగ్‌అవుట్స్‌ ప్లాన్‌ చేస్తారనే ఆలోచన. పొద్దునే లేచే సరికి వారి టైమ్‌లైన్‌పై ఫొటోలు, ఇతర అప్‌డేట్స్‌ని చూసి మిస్‌ అయ్యానని చింతించడం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని