టెట్‌కు ఇన్‌ సర్వీసు టీచర్ల సన్నద్ధం!

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 30 Oct 2025 06:30 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

3 వేల మందికి పైగా దరఖాస్తు
ఏ హోదాలో ఉంటే ఆ పేపర్‌ రాస్తే సరిపోతుంది
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయులకు అవకాశం కల్పించిన విద్యాశాఖ

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) రాసేందుకు ఇన్‌ సర్వీసు టీచర్లు దరఖాస్తులు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. 2010కి ముందు నియమితులైన టీచర్లకూ టెట్‌ రాసేందుకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది. నవంబరు 23 వరకు దరఖాస్తుల సమర్పణకు గడువిచ్చింది. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలని నిర్ణయించి... మరోపక్క ఆసక్తిగల వారికి టెట్‌ రాసే వెసులుబాటును కల్పించింది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్‌ పాస్‌ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబరు 1న తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి రెండేళ్ల వ్యవధిలో ఉత్తీర్ణులు కావాలని స్పష్టంచేసింది. ఐదేళ్లలో పదవీ విరమణ చేయబోయే వారికి టెట్‌ అవసరం లేదని, వారు పదోన్నతి పొందాలంటే మాత్రం పాసవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇన్‌ సర్వీసు టీచర్లకు టెట్‌ రాసే అవకాశమిస్తూ విద్యాశాఖ ఈ నెల 24న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సాయంత్రం వరకు 28,121 మంది టెట్‌కు దరఖాస్తు చేయగా.. వీరిలో ఇన్‌ సర్వీసు టీచర్లు 3,461 మంది ఉన్నారు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసినా ప్రయోజనం ఉండకపోవచ్చని, కేంద్ర ప్రభుత్వం.. విద్యాహక్కు చట్టంలో సవరణ చేస్తే తప్ప ఉపశమనం కలగదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.  

సైన్సు సబ్జెక్టుల్లో సిలబస్‌ సవాల్‌..

రాష్ట్రంలో 2010కి ముందు డీఎస్సీల ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు ఇప్పుడు సిలబస్‌ సవాల్‌గా మారిందని కొందరు టీచర్లు పేర్కొంటుండగా.. ప్రస్తుతం పాఠశాలల్లో బోధిస్తున్నందున సిలబస్‌ మార్పు పెద్ద సమస్య కాదని మరికొందరు వెల్లడిస్తున్నారు. 

  • స్కూల్‌ అసిస్టెంట్‌లలో ఎక్కువ మంది ఏదో ఒక సబ్జెక్టునే 6-10 తరగతులకు బోధిస్తున్నారు. టెట్‌కు అన్ని సబ్జెక్టులనూ చదవాల్సిన పరిస్థితి. 
  • జీవశాస్త్ర ఉపాధ్యాయులకు వారి సబ్జెక్టు సంబంధించి టెట్‌లో 20 మార్కులకే ప్రశ్నలు ఉంటాయి. వీటితో పాటు మొత్తం 150 మార్కుల్లో పిల్లల అభివృద్ధి, పెడగాజీ 30 మార్కులకు, మాతృభాష 30, ఆంగ్ల భాష 30, గణితం 20, భౌతిక, రసాయన శాస్త్రాల నుంచి 20 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. 
  • గణితం ఉపాధ్యాయులకూ ఇదే మాదిరిగా ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రస్తుతం పాఠశాలల్లో పని చేస్తున్న గణిత ఉపాధ్యాయులు ఆ ఒక్క సబ్జెక్టునే కొన్నేళ్లుగా బోధిస్తున్నారు. ఇప్పుడు భాషలతో పాటు సైన్సు సబ్జెక్టులకూ సన్నద్ధం కావాల్సి ఉంది.  
  • సాంఘికశాస్త్రం, భాషా ఉపాధ్యాయులకు 60 మార్కులకు ఆయా సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇస్తారు. దీంతో వీరు బోధిస్తున్న సబ్జెక్టుల నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. 

పదోన్నతిలో ఉన్నదే..

  • 2010కి ముందు డీఎస్సీల ద్వారా ఉద్యోగాల్లో చేరిన టీచర్లు ప్రస్తుతం ఏ హోదాలో ఉన్నారో ఆ హోదాకు సంబంధించిన టెట్‌ పేపర్‌ రాయాల్సి ఉంటుంది. ఎస్జీటీల నుంచి స్కూల్‌ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందిన వారు వాటికి సంబంధించిన టెట్‌ పేపర్‌ రాస్తే సరిపోతుంది. 
  • ఇన్‌ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు అకడమిక్‌ అర్హత మార్కుల్లో సడలింపునిచ్చింది. 
  • టెట్‌ అర్హతల్లో ఎలాంటి సడలింపులూ లేవు. ఓసీలకు 60%, బీసీలకు 50%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు 40%గా ఎన్‌సీటీఈ నిర్ణయించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని