అక్టోబరులో వర్షాలు.. ఈసారే అధికం!

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 01 Nov 2025 05:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈశాన్య రుతుపవనాల పరిధిలో విరివిగా వానలు

ఈనాడు, విశాఖపట్నం: దేశంలో ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల సీజన్‌లోనూ నైరుతి స్థాయిలో వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాన్లు, వాయుగుండాల ప్రభావంతో అక్టోబర్‌లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. అక్టోబర్‌లో సగటున 112.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2001 తర్వాత ఈ స్థాయిలో వానలు కురవడం ఇదే తొలిసారని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) పేర్కొంది. 1901 తర్వాత ఇది 16వ సారి. 

ఇక, ఈశాన్య రుతుపవన ప్రాంతం (కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, మాహె, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌ సబ్‌ డివిజన్లు)లో అక్టోబర్‌లో సగటున 245.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. 2019లో అత్యధికంగా 250.9 మి.మీ. నమోదు కాగా, తర్వాత ఈసారే అత్యధికం. 2001 తర్వాత ఇది మూడో గరిష్ఠం. దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈసారి అక్టోబర్‌లో 236 ప్రాంతాల్లో అతి భారీ (115.6 మి.మీ-204.5 మి.మీ.), 45 చోట్ల అత్యంత భారీ (204.5 మి.మీ.కు మించి) వర్షాలు కురిశాయి. 

రాష్ట్రంలో సాధారణం కంటే 79% ఎక్కువ

రాష్ట్రంలో అక్టోబరులో సాధారణ సగటు వర్షపాతం 161.5 మి.మీ. కాగా, మొంథా తుపాను, వాయుగుండం ప్రభావంతో 288.3 మి.మీ.గా నమోదైంది. ఇది సాధారణం కంటే 79% ఎక్కువ అని ఐఎండీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. 19 జిల్లాల్లో సాధారణం కంటే 40% ఎక్కువ వర్షం కురిసింది. ప్రకాశం జిల్లాలో 140%, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు-131%, విజయనగరం-124%, పల్నాడు-119%, గుంటూరు జిల్లాలో 109% అధికంగా నమోదైంది. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో సాధారణ వర్షాలు కురవగా, తూర్పుగోదావరి జిల్లాలో లోటు కన్పించింది. 

  • రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ స్టాటస్టిక్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం అక్టోబరులో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో సాధారణానికి మించి వానలు పడ్డాయి. ఏ జిల్లాలోనూ లోటు వర్షపాతం నమోదు కాలేదు.
  • నవంబరులోనూ ఏపీలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణం లేదా అంతకుమించి వర్షపాతం నమోదు కావొచ్చని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చని తెలిపింది.

‘మొంథా’పై 6 కోట్ల మెసేజ్‌లు

‘మొంథా’ తీవ్ర తుపానుపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు అమరావతి వాతావరణ కేంద్రం, విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, ఇతర కార్యాలయాల ద్వారా మొత్తం ఆరు కోట్ల సందేశాలు (ఎస్‌ఎంఎస్‌) వెళ్లాయి. దీనిపై 55 జాతీయ బులెటిన్లు విడుదల చేసినట్లు ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర్‌ తెలిపారు. ‘ఈసారి నైరుతి రుతుపవనాల సీజన్‌లో బంగాళాఖాతంలో రెండు, అరేబియా సముద్రంలో రెండు వాయుగుండాలు ఏర్పడగా వాటిలో ఒకటి తీవ్ర తుపానుగా, మరోటి తుపానుగా బలపడ్డాయి. మొంథా తీవ్ర తుపాన్‌ గమనం అంచనాలకు భిన్నంగా ఉంది. వీటి ట్రాకింగ్‌పై మరింత అధ్యయనం అవసరమ’ని మహాపాత్ర్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు