Kolusu parthasarathy: గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం.. ఆంధ్రప్రదేశ్‌లో నవశకం: మంత్రి పార్థసారథి

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 15 Oct 2025 14:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

అమరావతి: గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చరిత్రాత్మకమని మంత్రి పార్థసారథి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నవశకం ఆరంభమైందని చెప్పారు. ఏపీలో డేటా సెంటర్‌ రావడం యువతకు ఎంతో అదృష్టమని పేర్కొన్నారు. ఇది యువనేత, మంత్రి లోకేశ్‌ అకుంఠిత దీక్షకు నిదర్శనమని వివరించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే లోకేశ్ లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధికి అవకాశం లభిస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం యువత కలలు నిజం చేయడానికి నిరంతరం కృషి చేస్తోందని వివరించారు.

పెద్ద కంపెనీలను జగన్ తరిమేశారు: డీబీవీ స్వామి

కూటమి పాలనలో భారీ పెట్టుబడులు, దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖ నగరానికి క్యూ కడుతున్నాయని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ దేశానికే తలమానికమన్నారు. ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో విద్య, వైద్యం వ్యవసాయం సహా అనేక రంగాల్లో కీలక మార్పులు వస్తాయని చెప్పారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కృషి, శ్రమతో విశాఖ నగరం డేటా సెంటర్ హబ్‌గా ఎదుగుతోందని వెల్లడించారు. 16 నెలల్లోనే విశాఖకు 6.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఒప్పందాలు, భూ కేటాయింపులు పూర్తయిన సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. వైకాపా హయాంలో ఐటీ కంపెనీలకు ఇవ్వాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలు ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. పెద్ద కంపెనీలను విశాఖ నుంచి జగన్ తరిమేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదేళ్లలో విశాఖ కేంద్రంగా యువతకు భారీగా ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మంత్రి లోకేశ్‌ శ్రమిస్తున్నారని వెల్లడించారు.  

అసలైన వికేంద్రీకరణ సాధకుడు చంద్రబాబు: ఎమ్మెల్సీ పంచుమర్తి

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ కృషి వల్లే రాష్ట్రానికి గూగుల్ క్లౌడ్ వచ్చిందని, ఇది చరిత్రాత్మక విజయమని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలిపారు. గూగుల్ సంస్థ రాష్ట్రానికి రావడంతో లక్షకు పైగా ఉద్యోగావకాశాలు రానున్నాయన్నారు. చంద్రబాబు బ్రాండ్‌తోనే ఏపీకి భారీ పెట్టుబడులు వస్తున్నాయని, ‘స్వర్ణాంధ్ర 2047’కు గూగుల్ క్లౌడ్ ఓ మైలురాయి అని అభివర్ణించారు. తండ్రి మైక్రోసాఫ్ట్, తనయుడు గూగుల్ సంస్థను తీసుకొచ్చి అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. అసలైన వికేంద్రీకరణ సాధకుడు చంద్రబాబు అని కొనియాడారు. (Andhra Pradesh News)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని