APSRTC: ఆర్టీసీ బస్సులో మర్చిపోయినా మళ్లీ పొందొచ్చు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 28 Oct 2025 18:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ప్రయాణ హడావుడిలో బస్సులో మర్చిపోయిన విలువైన వస్తువులపై.. పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందేనా? కండక్టర్‌ వద్ద చిల్లర తీసుకోవటం మర్చిపోయి.. దిగేశారా...కంగారొద్దు.. వీటిని తిరిగి పొందే అవకాశం ఉంది!! ఆర్టీసీ అమలు చేస్తున్న ‘లాస్ట్‌ ప్రాపర్టీ హ్యాండోవర్‌’ విధానం ద్వారా!

  • తిరువూరుకు చెందిన అంజమ్మ ఇటీవల మైలవరం వెళ్లేందుకు తిరువూరు నుంచి విజయవాడ వెళుతున్న బస్సు ఎక్కారు. మైలవరంలో దిగిన కొద్ది సేపటికి చూసుకుంటే ఓ బ్యాగ్‌ కనిపించలేదు. కంగారు పడి ఇక బ్యాగ్‌ దొరుకుతుందన్న ఆశలు వదులుకున్నారు. చివరి ప్రయత్నంగా తెలిసిన వారి ద్వారా ఆర్టీసీలో లాస్ట్‌ ప్రాపర్టీ హ్యాండోవర్‌ విధానంలో ప్రయత్నించారు. కండక్టర్‌ నంబరు తెలుసుకుని ఫోన్‌ చేసి విచారించగా ఆయన బస్సులో వెతికి తాను కూర్చున్న చోటే కింద ఉన్న బ్యాగును భద్రంగా ఆమెకు అందించారు.
  • ఇలా... కొన్నిసార్లు బస్సు ప్రయాణాల్లో సర్టిఫికెట్లు, ఆస్తి పత్రాలు, పర్సులు, విలువైన వస్తువులున్న బ్యాగులు మర్చిపోతుంటాం. అయితే బస్సుల్లో ప్రయాణికులు మర్చిపోయిన వస్తువులను తిరిగి అందించేందుకు ‘లాస్ట్‌ ప్రాపర్టీ హ్యాండోవర్‌’ విధానాన్ని ఆర్టీసీ అమలు చేస్తోంది. 

  • బస్సులో మర్చిపోయినవి తిరిగి పొందేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ అయితే 08662570005, టీజీఆర్టీసీ అయితే 040 69440000 నంబర్‌కు ఫోన్‌ చేసి టికెట్‌పై ఉన్న కండక్టర్, లేదా డ్రైవర్‌ కోడ్‌ చెబితే నేరుగా వారి నంబర్లు ఇస్తారు. వారికి ఫోన్‌ చేసి సామాన్ల వివరాలు చెబితే మర్చిపోయినవాటి జాడ తెలుసుకోవచ్చు. 
  • టికెట్‌ తీసుకుని మిగిలిన చిల్లర దిగేటప్పుడు మర్చిపోయినా ఇదే నంబర్లకు ఫోన్‌ చేస్తే కండక్టర్‌ నంబరు చెబుతారు. వారికి కాల్‌ చేస్తే యూపీఐ విధానంలో మీ చిల్లర తిరిగి పంపుతారు. ఇవేవి తెలియకపోయినా ఆ బస్సు ఏ డిపో పరిధిలోనిదో తెలుసుకుని మేనేజర్‌కు ఫోన్‌ చేసి టికెట్‌పై ఉన్న నంబరు చెబితే కండక్టర్, డ్రైవర్‌ ఫోన్‌ నంబరు, వివరాలు చెబుతారు. 

ఇదో మార్గం

నిబంధనల ప్రకారం డ్రైవర్, కండక్టర్లు ట్రిప్‌ పూర్తి కాగానే బస్సులో సామాన్లు ఎవరైనా మర్చిపోతే వాటిని డిపోలోని ఎర్నింగ్‌ సెక్షన్‌లోని డీపీ క్లర్క్‌కు అప్పగించాల్సి ఉంటుంది. పోగొట్టుకున్న వారు నేరుగా ఆ క్లర్క్‌ను సంప్రదించినా దొరకడానికి అవకాశం ఉంది. పోగొట్టుకున్న వస్తువుల వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుని వారివే అని నిర్ధారించుకున్న తర్వాతే అప్పగిస్తారు.


బాధ్యత లేకుంటే ఫలితం లేదు 

నం మర్చిపోయిన వస్తువులు తోటి ప్రయాణికులు తీసుకుని తదుపరి స్టాప్‌లో దిగిపోతే ఎవరు ఏం చేయలేరు. ప్రయాణికులు ఎవరు వస్తువులు తీయకున్నా బస్సు డ్రైవర్, కండక్టర్‌ బాధ్యతగా లేకుంటే ఫలితం ఉండదు. ఈ విధానం ఫలవంతంగా సాగాలంటే ఇటు తోటి ప్రయాణికులకు, సిబ్బందికి ఇద్దరికీ బాధ్యత ఉండాలి.

ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని