TTD: తితిదే ఈవో పోస్టు... పార్ట్‌టైం ఉద్యోగమా?

తితిదే కేవలం శ్రీవారి ఆలయం మాత్రమే కాదు. అదో పెద్ద వ్యవస్థ. ఆదాయం, భక్తుల రాకపోకల దృష్ట్యా ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ఆలయం. రూ.3,096 కోట్ల వార్షిక బడ్జెట్‌. 11 వేల మందికి పైగా సిబ్బంది.. రోజూ వేల సంఖ్యలో తరలి వచ్చే భక్తులు.. శ్రీవారి దర్శనం కోసం క్యూ కట్టే ప్రముఖులు.

Published : 13 Apr 2022 06:52 IST

ఈనాడు, అమరావతి: తితిదే కేవలం శ్రీవారి ఆలయం మాత్రమే కాదు. అదో పెద్ద వ్యవస్థ. ఆదాయం, భక్తుల రాకపోకల దృష్ట్యా ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ఆలయం. రూ.3,096 కోట్ల వార్షిక బడ్జెట్‌. 11 వేల మందికి పైగా సిబ్బంది.. రోజూ వేల సంఖ్యలో తరలి వచ్చే భక్తులు.. శ్రీవారి దర్శనం కోసం క్యూ కట్టే ప్రముఖులు.. వీరంతా ఉంటారు. అలాంటి పెద్ద వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న ఐఏఎస్‌ అధికారిని కార్యనిర్వహణాధికారిగా ప్రభుత్వం నియమిస్తుంది. ఆ అధికారి నిత్యం తిరుపతిలోనే ఉండి, మొత్తం వ్యవస్థను పర్యవేక్షించాలి. కానీ కొన్నాళ్లుగా అలా జరగడం లేదు. వైకాపా అధికారంలోకి వచ్చాక 2020 అక్టోబరులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జవహర్‌రెడ్డిని తితిదే ఈవోగా నియమించింది. తర్వాత ఆయనను ఆ పోస్టులో కొనసాగిస్తూనే... మరిన్ని కీలక బాధ్యతలు అప్పగిస్తోంది. అవి అమరావతిలో ఉండి నిర్వహించాల్సిన బాధ్యతలు. దీంతో తితిదే ఈవోగా ఆయన పూర్తి సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొంది. కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతంగా ఉన్నప్పుడు.. 2021 ఏప్రిల్‌లో ఆయనను తితిదే ఈవోగా కొనసాగిస్తూనే, విజయవాడలోని రాష్ట్రస్థాయి కొవిడ్‌ కంట్రోల్‌ కేంద్రానికి ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఆ సమయంలో కొద్దిరోజులు మాత్రం తితిదే ఈవో బాధ్యతల్ని అదనపు ఈఓ ధర్మారెడ్డికి అప్పగించింది. తర్వాత మళ్లీ తితిదే ఈవోగా జవహర్‌రెడ్డి పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తుండగా... ఆయనను జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ ప్రభుత్వం నియమించింది. తర్వాత ఆయనను ఈవోగా కొనసాగిస్తూనే, జలవనరులశాఖ నుంచి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టు అత్యంత కీలకమైంది. రోజువారీ పాలనా వ్యవహారాల్లో మునిగి తేలాల్సి ఉంటుంది. తితిదే లాంటి పెద్ద వ్యవస్థకు ఈవోగా ఉన్న అధికారికి.. ఏకకాలంలో వేరే కీలకమైన బాధ్యతలూ అప్పగిస్తే ఎలా న్యాయం చేయగలరన్న విమర్శలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని