Andhra News: అరెస్టుల రాజ్యం

అర్ధరాత్రీ... అపరాత్రీ చూడరు.. పోలీసులం అన్న విషయం మర్చిపోయి గోడలు దూకుతారు.. ఇళ్లలోకి చొరబడతారు.. లేదా తలుపులు విరగ్గొట్టి మరీ దూసుకొస్తారు.

Updated : 05 Nov 2022 07:07 IST

వైకాపా పాలనలో తెదేపా నేతలపై వేధింపుల పర్వం
శ్రుతి మించుతున్న పోలీసు హింస
విపక్ష నేతలే టార్గెట్‌గా కేసులు.. అరెస్టులు

- ఈనాడు, అమరావతి

అర్ధరాత్రీ... అపరాత్రీ చూడరు.. పోలీసులం అన్న విషయం మర్చిపోయి గోడలు దూకుతారు.. ఇళ్లలోకి చొరబడతారు.. లేదా తలుపులు విరగ్గొట్టి మరీ దూసుకొస్తారు. బాత్‌రూమ్‌లో ఉన్నా తలుపులు కొట్టి బయటకు రమ్మని గద్దిస్తారు.. ముందస్తు నోటీసులివ్వరు.. అప్పటికప్పుడు ఒక కాగితం చేతిలో పెట్టి అరెస్టు చేశామని చెప్పి పట్టుకుపోతారు..! అనారోగ్యంతో ఉన్నామన్నా.. ఆపరేషన్‌ చేయించుకున్నామన్నా చెవికెక్కించుకోరు!
ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చిందే తడవు.. సీఐడీ, ఏసీబీ, సివిల్‌ పోలీసులు ఆగమేఘాల మీద కదులుతారు..! ఏ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరంపైనో సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసినట్టుగా విరుచుకుపడతారు! మిలిటరీ ఆపరేషన్‌ను తలపిస్తారు!

అలాగని వారు అరెస్టు చేసేది ఏ కరడుగట్టిన నేరస్తుల్నో, ప్రాణాంతకులైన ఉగ్రవాదుల్నో కాదు! నిత్యం ప్రజల్లో ఉండే విపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధుల్ని, మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేల్ని, సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న నాయకుల్ని!

ఏదో ఘోరమైన నేరాలు చేసినవాళ్లలా క్షణాల్లో అరెస్టు చేసి తీసుకుపోతారు..

అరెస్టు చేశాక విపక్ష నేతలకు చుక్కలు చూపిస్తారు! కనీస మర్యాదా ఇవ్వరు!

ఎక్కడెక్కడో తిప్పుతారు. వీలైనంత ఆలస్యంగా కోర్టులో ప్రవేశపెడతారు.

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రతిపక్ష నాయకులపై జరుగుతున్న దమనకాండ ఇది. వారిపై చిన్న ఫిర్యాదు వచ్చినా శరవేగంగా స్పందించే పోలీసులు, అదే అధికార పార్టీ నాయకులపై ఎంత తీవ్రమైన ఫిర్యాదులొచ్చినా పట్టించుకోరు. సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తుల్నే బెదిరించేలా, కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన, అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టిన అధికార పార్టీకి చెందినవారిపై స్వయంగా హైకోర్టే చర్యలు తీసుకోమని ఆదేశించినా.. పోలీసుల్లో ఎలాంటి స్పందనా ఉండదు. సీఐడీ విభాగం తీరుతో విసుగు చెందిన హైకోర్టు చివరకు దర్యాప్తును సీబీఐకి అప్పగించాల్సి వచ్చిందంటే రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి ఎంతగా కొమ్ముకాస్తోందో అర్థమవుతుంది.

వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ముఖ్యనేతలతో పాటు, వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసులు అరెస్టు చేసిన విధానం, ఆ సమయంలో వారు ప్రదర్శించిన దూకుడు, ప్రవర్తన అందరికీ తెలిసిందే!


మొలల శస్త్ర చికిత్స చేయించుకున్నా..  రక్తస్రావం అవుతున్నా..

కె.అచ్చెన్నాయుడు, మాజీమంత్రి, తెదేపా శాసనసభాపక్ష ఉపనేత.

* ఎప్పుడు అరెస్టు చేశారు: 2020 జూన్‌ 12న

* ఏ సమయంలో: ఉదయం 7.10 గంటలకు శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలోని అచ్చెన్న ఇంట్లో

అభియోగం: ఆయన మంత్రిగా ఉండగా ఈఎస్‌ఐ ఆసుపత్రులకు మందులు, వైద్యపరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ కేసు

ఉగ్రవాదులపై దాడి చేసినట్టుగా: కశ్మీర్‌లో ఉగ్రవాదుల్ని మట్టుపెట్టేందుకు సైనికులు వారున్న ఇంటిని చుట్టుముట్టడాన్ని టీవీల్లో చూస్తుంటాం. అంతకుమించిన దృశ్యాల్ని ఆ రోజు నిమ్మాడ ప్రజలు చూశారు. తెల్లవారుతుండగానే వందల సంఖ్యలో పోలీసులు దిగిపోయారు. 40-50 మంది అచ్చెన్న ఇంటిని చుట్టుముట్టారు. కొందరు ఆయన ఇంటి ప్రహరీ, ప్రధాన గేటు దాటి లోపలికి చొరబడ్డారు. సెక్యూరిటీ గార్డు సెల్‌ఫోన్‌ లాగేసుకున్నారు. రెండో అంతస్తులోని అచ్చెన్న పడకగది వద్దకు పదిమంది పోలీసులు చేరుకున్నారు. ఎవరూ పైకి రాకుండా కొందరు మెట్లపై కాపలా కాశారు. తనకు ఇటీవలే మొలల శస్త్రచికిత్స జరిగిందని, అల్పాహారం తీసుకుని, మందులు వేసుకుని వస్తానన్నా పోలీసులు వినలేదు. రోడ్డుమార్గాన విజయవాడకు తరలించారు. ఆ క్రమంలో ఆయనకు తీవ్రంగా రక్తస్రావమైంది. అర్ధరాత్రి దాటాక 1.20 గంటల సమయంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారనే: ప్రభుత్వ అరాచకాలు, ప్రజావ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో, బయటా గట్టిగా గళమెత్తుతున్నందుకు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారన్న అక్కసుతోనే అచ్చెన్నపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని తెదేపా తీవ్రంగా మండిపడింది.


కుమారుడి వర్ధంతి కార్యక్రమం ముగించుకుని వస్తానన్నా వినలేదు

పి.నారాయణ, మాజీమంత్రి

* అరెస్టు ఎప్పుడు: 2022 మే 10న హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.

* ఏ సమయంలో: ఉదయం 10.30- 11 గంటల మధ్య.

అభియోగం: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌ కేసులో నారాయణ పాత్ర ఉందని కేసు.

కిడ్నాప్‌ చేసినట్టుగా: చిత్తూరు నుంచి మూడు బృందాలుగా హైదరాబాద్‌ వెళ్లిన పోలీసులు నార్సింగి, కేపీహెచ్‌బీ కాలనీ, కొండాపూర్‌లలోని నారాయణ నివాసాల వద్ద మాటు వేశారు.

కుమారుడు నిషిత్‌ వర్ధంతి కార్యక్రమానికి వెళ్లేందుకు ఉదయం 10.30-11 గంటల మధ్య నారాయణ దంపతులు కొండాపూర్‌లోని నివాసం నుంచి బయటకు వచ్చారు. మాదాపూర్‌ ఐకియా కూడలి వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులు వారి వాహనాన్ని ఆపి, నారాయణ సతీమణిని కిందకు దించేసి, అదే కారులో ఆయనను తీసుకుని వెళ్లిపోయారు. నారాయణను ఎవరో కిడ్నాప్‌ చేశారేమోనని ఆయన సతీమణి భయపడ్డారు. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఆ కారును కొత్తూరు వద్ద అడ్డుకున్నారు. ఏపీ పోలీసులు వారి గుర్తింపు కార్డులు చూపించి, నారాయణను తీసుకుని వెళ్లిపోయారు. కుమారుడి వర్ధంతి కార్యక్రమం ముగించుకుని వస్తానని నారాయణ చెప్పినా పోలీసులు అంగీకరించలేదు.

రాజకీయ కక్షతోనే అరెస్టు: ‘నారాయణపై కక్ష సాధించేందుకే వైకాపా ప్రభుత్వం ఆయనను అక్రమంగా అరెస్టు చేసింది. పదోతరగతి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణను ఇరికించేందుకు ప్రభుత్వం తప్పుడు సాక్ష్యాలు సృష్టించింది’ అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.


నోటీసు కూడా ఇవ్వకుండానే అరెస్టు

కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి

* ఎప్పుడు అరెస్టు చేశారు: 2020 జులై 3న హత్యానేరం అభియోగాలపై ఒకసారి, మచిలీపట్నం మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై 2021 మార్చి 11న మరోసారి.

* ఏ సమయంలో: మొదటి కేసులో సాయంత్రం 7 గంటలకు, రెండో కేసులో ఉదయం 7 గంటలకు.

అభియోగం: వైకాపా నాయకుడు, మచిలీపట్నం మార్కెట్‌యార్డు మాజీ ఛైర్మన్‌ మోకా భాస్కర్‌రావు హత్య కేసులో నిందితుడిగా పేర్కొంటూ కేసు.

వెంటాడి.. వెంబడించి: మొదటిసారి మచిలీపట్నంలోని రవీంద్ర ఇల్లు, కార్యాలయానికి వెళ్లిన పోలీసులు ఆయన అక్కడ లేకపోవడంతో ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. విశాఖ వెళుతున్నారన్న సమాచారంతో వెంబడించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

నిబంధనలు తుంగలో తొక్కి: రెండోదఫా 2021 మార్చి 11న తెల్లవారుజామున 5 గంటలకే పోలీసులు మచిలీపట్నంలోని రవీంద్ర ఇంటికి చేరుకున్నారు. తలుపు కొట్టినా తీయకపోవడంతో ఉదయం 7 గంటల వరకు అక్కడే వేచి ఉన్నారు. 7 గంటలకు ఇంటి నుంచి బయటకు రాగానే అరెస్టు చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం ఆయనను జిల్లా కోర్టులో హాజరు పరచగా.. పోలీసులు నిబంధనలు పాటించలేదని, నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేశారన్న కారణంతో జడ్జి బెయిల్‌ మంజూరు చేశారు.

బీసీలను అణగదొక్కేందుకే: ‘వైకాపా ప్రభుత్వం పథకం ప్రకారం బీసీ నాయకులను అణగదొక్కాలని చూస్తోంది. నాపై ఇప్పటి వరకు ఐదు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, బెదిరించాలని చూసినా భయపడను. సమస్యల పరిష్కారానికి పోరాటం కొనసాగిస్తాను’ అని రవీంద్ర ధ్వజమెత్తారు.

 


అంతర్జాతీయ నేరస్తుడిలా..

మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌ రవి), ఎమ్మెల్సీ

* ఎప్పుడు అరెస్టు చేశారు: 2021 ఏప్రిల్‌ 3న 

* ఏ సమయంలో: మధ్యాహ్నం.

అభియోగం: 2018లో పులివెందులలో జరిగిన ఘర్షణ కేసులో ఆయన ప్రమేయం ఉందని కేసు
విమానాశ్రయానికి వెళ్లి మరీ: వైయస్సార్‌ జిల్లా పోలీసులు చెన్నై విమానాశ్రయంలో ఆయనను అరెస్టు చేశారు. లింగాల మండలం పెద్ద కుడాల గ్రామంలో నాగమ్మ అనే దళిత మహిళపై హత్యాచారం ఘటనపై నిరసన తెలిపిన బీటెక్‌ రవిపై అంతకుముందే పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కానీ అరెస్టు చేసింది మాత్రం 2018 నాటి తెదేపా, వైకాపా వర్గాల ఘర్షణ కేసుకు సంబంధించిందని తెలిపారు.

నేనేమైనా దేశం విడిచి పారిపోతున్నానా: ‘ఒక అంతర్జాతీయ నేరస్తుడిలా నన్ను అదుపులోకి తీసుకున్నారు. నేనేదో దేశం విడిచి పారిపోతున్నట్టుగా రన్‌వే పైకి వచ్చి అరెస్టు చేశారు. ఎస్సీ మహిళ హత్యాచారానికి నిరసనగా చలో పులివెందుల కార్యక్రమం నిర్వహించినందుకు నాపైనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు పెట్టారు. కనీసం 41సీ నోటీసులూ ఇవ్వలేదు’ అని బీటెక్‌ రవి ధ్వజమెత్తారు.


వయసునీ పట్టించుకోకుండా..

కిమిడి కళా వెంకటరావు, మాజీమంత్రి

* ఎప్పుడు అరెస్టు చేశారు: 2021 జనవరి 20న

* ఏ సమయంలో: రాత్రి 9 గంటలకు

అభియోగం: విజయనగరం జిల్లా రామతీర్థంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్లు వేయించారని అభియోగం

బలవంతంగా జీపులోకి నెట్టేసి: రాజాంలోని తన నివాసంలో రాత్రి 8.30 గంటల సమయంలో పదుల సంఖ్యలో పోలీసులు ఆయన ముట్టడించారు. బలవంతంగా జీపులోకి నేట్టేశారు. ఇంట్లో ఆయన తప్ప కుటుంబ సభ్యులెవరూ లేరు. 69 ఏళ్ల కళావెంకటరావు రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నారు. మందులు వేసుకుంటానని బతిమాలితే.. అంగీకరించిన పోలీసులు, ఆ వెంటనే చీపురుపల్లి స్టేషన్‌కు తరలించారు. 41ఏ నోటీసిచ్చి 11.15 గంటలకు విడిచిపెట్టారు.

ప్రశ్నిస్తే అరెస్టు చేశారు: ‘ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తున్నారు. కానీ అసలు దొంగలు మీ దగ్గరే ఉన్నారు’ అని కళావెంకటరావు ధ్వజమెత్తారు.


 సొంత పార్టీ ఎంపీపైనా కక్ష!

రఘురామకృష్ణరాజు, వైకాపా ఎంపీ

* ఎప్పుడు అరెస్టు చేశారు: 2021 మే 14న హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు

* ఏ సమయంలో: సాయంత్రం 4 గంటలకు

అభియోగం: కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగిస్తున్నారని, ప్రభుత్వంపై అవిధేయతను ప్రోత్సహిస్తున్నారని కేసు

బైపాస్‌ సర్జరీ చేసుకున్నారని చెప్పినా: రఘురామకృష్ణరాజుని ఆయన పుట్టినరోజునే ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని రఘురామకృష్ణరాజు నివాసానికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే బైపాస్‌ సర్జరీ చేసుకున్నారని కుటుంబ సభ్యులు చెప్పినా వినకుండా.. సాయంత్రం 4 గంటలకు వాహనంలో విజయవాడ తరలించారు. రాత్రి 9.50 గంటలకు గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. రాత్రంతా స్టేషన్‌లోనే ఉంచారు.18 గంటలపాటు కస్టడీలో విచారించారు.

స్టేషన్‌లో కొట్టారు: సీఐడీ పోలీసులు రబ్బరు బెల్ట్‌, కర్రలతో తనను కొట్టారని జడ్జికి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. కస్టడీలో ఉన్న ఎంపీని ఎలా కొడతారని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.

సీఎం బెయిల్‌ రద్దు చేయమన్నందుకే: సీబీఐ, ఈడీ కేసుల్లో సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయమని కోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్‌ వేసినందుకే కక్ష కట్టారని ఆయన న్యాయవాదులు కోర్టులో వాదించారు.


వంటగది తలుపులు పగలగొట్టి

- కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, తెదేపా అధికార ప్రతినిధి

* ఎప్పుడు అరెస్టు చేశారు: 2021 అక్టోబరు 20న

* ఏ సమయంలో: రాత్రి 9 గంటల తర్వాత

అభియోగం:  ముఖ్యమంత్రి జగన్‌ని పరుష పదజాలంతో దూషించి గొడవలకు కారకులయ్యారని విజయవాడకు చెందిన వ్యాపారి షేక్‌ మస్తాన్‌ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు

ఉగ్రవాదిని అరెస్టు చేసినట్టుగా: ఉదయం నుంచి ఇంటి వద్ద పెద్దఎత్తున పోలీసులు మొహరించారు. తనను అరెస్ట్‌ చేయబోతున్నారని గ్రహించిన పట్టాభి నిక్కర్‌, టీ షర్ట్‌ వేసుకుని తన ఒంటిపై ఎలాంటి గాయాలూ లేవంటూ ఒక వీడియో విడుదల చేశారు. తనను పోలీసులు కొట్టే అవకాశం ఉందన్న అనుమానంతోనే ఆ వీడియో రిలీజ్‌ చేస్తున్నానని, అరెస్ట్‌ తర్వాత తన ఒంటిపై చిన్న గాయం ఉన్నా వారిదే బాధ్యతని ఆయన తెలిపారు. రాత్రి 8.30 గంటల సమయంలో పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. ఇంటి వెనక ఉన్న వంటగది తలుపులు పగలగొట్టి 30 మందికి పైగా లోపలకి ప్రవేశించి పట్టాభిని అరెస్టు చేశారు.

కుట్ర పూరితంగా అరెస్టు: ‘కుట్రపూరితంగా, కక్షపూరితంగా అరెస్టు చేశారు. నా మాటలకు లేని అర్థాలు ఆపాదించారు. మేం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మూడుసార్లు దాడి చేశారు. ఇంట్లో ఉన్న ఎనిమిదేళ్ల నా కుమార్తెను భయకంపితురాల్ని చేశారు. షాక్‌కు గురి చేశారు’


దాడికి గురైనవారిపైనే ఎదురు కేసు..

- దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీమంత్రి

* ఎప్పుడు అరెస్టు చేశారు: 2021 జులై 28న

* ఏ సమయంలో: అర్ధరాత్రి దాటాక 1.45 గంటలకు.

అభియోగం: హత్యాయత్నం, ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని కులం పేరుతో దూషించారని కేసు నమోదు

ఫిర్యాదు చేస్తానన్న వ్యక్తిపైనే కేసు: దేవినేని ఉమా 2021 జులై 28న పార్టీ కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో అక్రమంగా తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, మీడియాతో మాట్లాడారు. ఇది తెలిసిన వైకాపా కార్యకర్తలు గడ్డమణుగు వద్ద కాపలా కాశారు. ఉమాను పోలీసులు డొంక రోడ్డులో జి.కొండూరు తీసుకెళ్లారు. అక్కడ ఉమా సహా తెదేపా నాయకుల కార్లపై వైకాపా వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. తెదేపా నాయకుల వాహనాల్ని జి.కొండూరు పోలీసు స్టేషన్‌ సమీపానికి తరలించారు. అక్కడ మళ్లీ తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఉమాను పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పగా.. తాను స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాకే వెళతానని ఆయన పట్టుబట్టారు. సాయంత్రం 7 నుంచి రాత్రి 1.45 గంటల వరకు కారులోనే ఉండిపోయారు. పోలీసులు ఆయనపైనే కేసు పెట్టి, అరెస్టు చేసి మొదట నందివాడ, హనుమాన్‌ జంక్షన్‌ పోలీసు స్టేషన్లను తిప్పారు.

ప్రశ్నిస్తే చంపేస్తామంటున్నారు: ‘‘కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో రూ.కోట్ల విలువైన గ్రావెల్‌ దోపిడీ జరిగింది. దానిపై ప్రశ్నిస్తే చంపేస్తామంటున్నారు. పెద్ద సంఖ్యలో వైకాపా కార్యకర్తలు వచ్చి మాపై రాళ్లు రువ్వారు. వైకాపా నాయకుల అరాచకాల్ని ప్రశ్నించినందుకు తిరిగి మాపైనే కేసులు పెట్టారు’’ అని ఉమా ధ్వజమెత్తారు.


మఫ్టీలో వచ్చి అరెస్టు

పరుచూరి అశోక్‌బాబు, ఎమ్మెల్సీ, తెదేపా

* ఎప్పుడు అరెస్టు చేశారు: 2022 ఫిబ్రవరి 11న

* ఏ సమయంలో: పెళ్లికి వెళ్లి ఇంటికి వచ్చిన అశోక్‌బాబును.. అప్పటికే అక్కడ మఫ్టీలో ఉన్న సీఐడీ పోలీసులు అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో అరెస్టు చేసి గుంటూరు తీసుకెళ్లారు.

అభియోగం: ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నపుడు విద్యార్హతకు సంబంధించి తప్పుడు ధ్రువపత్రం సమర్పించి పదోన్నతి పొందారని ఆరోపణ.

రాత్రి వరకు అదుపులో ఉంచుకుని: నోటీసు ఇవ్వకుండా రాత్రి 7 గంటల వరకు ఆయనను తమ అదుపులోనే ఉంచుకున్నారు. తర్వాత కోర్టులో ప్రవేశ పెట్టారు.

అక్రమంగా కేసు: ‘సీఐడీని పావుగా వాడుకుంటున్న ప్రభుత్వం నాపై అక్రమ కేసు బనాయించింది. నమోదైన కేసు గురించి కాకుండా.. ‘పీఆర్‌సీపై ఉద్యోగుల ఆందోళనలో మీ పాత్ర ఏమిటి? ఎవరెవరు పాల్గొన్నారనే పోలీసులు ప్రశ్నించారు’ అని ఆయన ధ్వజమెత్తారు.


యుద్ధానికి వచ్చినట్టుగా ఇంటిని ముట్టడించి..

- ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, మాజీ ఎమ్మెల్యే

 * అరెస్టు ఎప్పుడు: 2021 ఏప్రిల్‌ 23న

* ఏ సమయంలో: ఉదయం 6.30 గంటలకు గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని చింతలపూడిలో నరేంద్ర ఇంట్లో.

అభియోగం: సంగం డెయిరీ ఛైర్మన్‌గా పలు ఆర్థిక, పరిపాలనాపరమైన అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణ.
మూత్రశాలలో ఉన్నా గద్దించి పిలిచి: నరేంద్ర అరెస్టు చేసినప్పుడు పోలీసులు ఆయన ఇంటి వద్ద యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకే చింతలపూడికి భారీగా బలగాలు చేరుకున్నాయి. కరోనా తీవ్రంగా ఉన్న కాలంలో 300 మంది పోలీసులు నరేంద్ర ఇంటిని, ఆ పరిసరాలను దిగ్బంధించారు. ఉదయం 6.30 గంటలకు ఇంట్లోకి ప్రవేశించి, సెక్యూరిటీగార్డు దగ్గరున్న సెల్‌ఫోన్‌ తీసేసుకున్నారు. మఫ్టీలో ఉన్న మహిళా పోలీసులు కాలింగ్‌ బెల్‌ కొట్టారు. నరేంద్ర సతీమణి జ్యోతిర్మయి తలుపు తీయగానే.. లోపలికి చొరబడ్డారు. నరేంద్ర కాలకృత్యాలు తీసుకోవడానికి బాత్‌రూమ్‌కు వెళ్లగా.. పోలీసులు తలుపు కొట్టి బయటకు రమ్మని గద్దించారు. ఆయన రాగానే అరెస్టు చేసినట్టు ప్రకటించి, ఆయన భార్య జ్యోతిర్మయికి నోటీసు ఇచ్చారు. అక్కడి నుంచి నరేంద్రను తరలించారు. రాత్రి ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరచగా.. ఆయనకు రిమాండ్‌ విధిస్తూ రాత్రి 12.45కి కోర్టు ఆదేశాలిచ్చింది.

కక్షసాధింపుతోనే: ‘‘డెయిరీలో ఎలాంటి అవకతవకలు లేవు. ప్రతి పైసాకు లెక్క ఉంది. ప్రభుత్వ అరాచక విధానాల్ని ఎండగడుతున్నామన్న కక్షతోనే నాపై అక్రమ కేసులు పెట్టారు.’ అని నరేంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

నేరం చేసినట్లు అంగీకరించమని ఒత్తిడి

సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ పలాస నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గౌతు శిరీషను సీఐడీ పోలీసులు ఈ ఏడాది జూన్‌ 6న విచారణకు పిలిచారు. 2022 సంవత్సరంలో లబ్ధిదారులకు పథకాలు అందవని ప్రభుత్వ చిహ్నంతో ఉన్న నకిలీ ప్రకటనను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారని ఆమెకు నోటీసు ఇచ్చారు. 7 గంటల పాటు విచారించారు. ‘నాకు కనీసం భోజనం కూడా పెట్టలేదు. న్యాయవాదిని అనుమతించలేదు. పోలీసు కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటా’ అని విచారణ అనంతరం ఆమె పేర్కొన్నారు. నేరం చేసినట్లు అంగీకరించాలని పోలీసులు ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.


తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కేసు మీద కేసు పెట్టి అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను అర్ధరాత్రి నిద్రలేపి పట్టుకుపోయారు. గుంటూరు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ను ఉదయం నుంచి   స్టేషన్లన్నీ తిప్పి గోళ్లతో రక్కి సూదులతో గుచ్చి హింసించారు. అలాగే ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను అరెస్టు చేశారు. మరెందరో నేతలను అరెస్టుల పేరుతో పోలీసులు వేధించారు.

 


కేసు మీద కేసు.. అరెస్టు మీద అరెస్టు

చింతమనేని ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే

* ఎప్పుడు అరెస్టు చేశారు: వైకాపా అధికారంలోకి వచ్చాక చింతమనేని ప్రభాకర్‌పై పెట్టినన్ని కేసులు మరే నాయకుడిపైనా పెట్టి ఉండరేమో. కేసు తర్వాత కేసు, ఒక కేసులో రిమాండ్‌లో ఉండగానే, పీటీ వారెంట్‌ తీసుకుని మరో కేసులో అరెస్టు.. ఇలా ఇప్పటికి పలుసార్లు ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

*  ఏ సమయంలో: ఒక ఎస్సీ, ఎస్టీ కేసులో 2019 సెప్టెంబరు 11న చింతమనేనిని ఉదయం ఆయన ఇంటి వద్దే అరెస్టు చేశారు.

కరడుగట్టిన నేరస్తుడిని అరెస్టు చేసినట్టుగా: ఒక కేసులో అంతకుముందే బెయిల్‌పై బయటకు వచ్చిన చింతమనేనిపై.. మరో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తర్వాత చింతమనేని బాధితులమంటూ పలువురు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఆయన ఇంటివద్దే మోహరించి అరెస్టు చేశారు. జైల్లో ఉన్న చింతమనేనిని సెప్టెంబరు 25న రెండు కేసుల్లో, అదే ఏడాది అక్టోబరు7న మరో రెండు కేసుల్లో అరెస్టు చేశారు. ఆయన జైల్లో ఉండగానే కోడిపందేలు కేసులో అక్టోబరు 16న త్రీటౌన్‌ పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు.

పోలీసులు జగన్‌కి తొత్తులు: ‘‘పోలీసులకు మంచీ చెడ్డా లేదు. జగన్‌కు తొత్తుల్లా పనిచేస్తూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. నాపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినవాళ్లను నేను ఎప్పుడూ కనీసం చూడనైనా లేదు. నాపై వరసగా 10 కేసులు పెటారు. జగన్‌ వికృత చేష్టలకు ఇది పరాకాష్ట. ఈ రోజు కాకపోయినా రేపైనా నేనేంటో తెలుస్తుంది. నేను ఏ తప్పూ చేయలేదు’’ అని చింతమనేని అప్పట్లో ధ్వజమెత్తారు.


అర్ధరాత్రి నిద్రలేపి..

కూన రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే

* ఎప్పుడు అరెస్టు చేశారు: 2021 నవంబరు 21న

* ఏ సమయంలో: అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో

అభియోగం: తనను దూషించారంటూ సీఐ ఈశ్వర్‌ ప్రసాద్‌ చేసిన ఫిర్యాదుపై

మొదట గృహ నిర్బంధం, ఆ తర్వాత అరెస్టు: పార్టీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లకుండా పోలీసులు రవికుమార్‌ను గృహ నిర్బంధం చేశారు. ఆ సందర్భంగా ఆయన తనను దూషించారంటూ సీఐ ఇచ్చిన ఫిర్యాదుపై శ్రీకాకుళంలోని రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. శ్రీకాకుళంలోని శాంతినగర్‌ కాలనీలో సోదరుడి ఇంట్లో నిద్రిస్తున్న రవికుమార్‌ను రాత్రి ఒంటి గంటకు అరెస్టు చేసి, రాత్రంతా ఎచ్చెర్ల స్టేషన్‌లో ఉంచారు. ఆ మర్నాడు ఉదయం కోర్టులో హాజరు పరచగా, షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది.


గోళ్లతో రక్కి.. ఉదయం నుంచి స్టేషన్లన్నీ తిప్పి

గల్లా జయదేవ్‌, గుంటూరు ఎంపీ, తెదేపా 

* ఎప్పుడు అరెస్టు చేశారు: 2020 జనవరి 20న

* ఏ సమయంలో: మధ్యాహ్నం 11 గంటలకు

అభియోగం: అసెంబ్లీ ముట్టడికి గుంపులుగా రైతులను తీసుకొచ్చారని, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని

స్టేషన్లన్నీ తిప్పుతూ: తొలుత రొంపిచర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తర్వాత వివిధ స్టేషన్లకు తిప్పారు. అర్ధరాత్రి మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు. జయదేవ్‌ చొక్కా చిరిగింది. గాయాలయ్యాయి.

వాళ్లు లాఠీఛార్జి చేసి మాపై కేసులా?: ‘రైతులు, మహిళలతో కలిసి శాంతియుత ఆందోళనకు బయల్దేరాం. ఎలాంటి హింసా కార్యక్రమాలు చేపట్టలేదు. అయినా వేలాదిమంది పోలీసుల్ని మోహరించారు. నన్ను అరెస్టు చేశాక సూదులతో గుచ్చారు. గోళ్లతో రక్కారు. మూడు గంటల పాటు వాహనంలో తిప్పారు’ అని జయదేవ్‌ ధ్వజమెత్తారు.


ప్రశ్నించినందుకు అరెస్టు

బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్సీ, తెదేపా 

* అరెస్టు: 2022 జనవరి 24న

* సమయం: మధ్యాహ్నం 2 గంటలకు

విచారణ కోసమని చెప్పి: మధ్యాహ్నం 2 గంటలకు భారీగా పోలీసులు ఆయన ఇంటికి చేరుకుని విచారణ నిమిత్తం తీసుకెళ్తున్నట్లు చెప్పారు. నోటీసు కూడా ఇవ్వలేదు.

అభియోగం: గుడివాడ క్యాసినో వ్యవహారంలో రూ.250 కోట్లు చేతులు మారాయని, అందులో డీజీపీ వాటా ఎంత? అని వెంకన్న విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. డీజీపీ అంటే డైరెక్టర్‌ ఆఫ్‌ జగన్‌ పార్టీ అని ధ్వజమెత్తారు.

వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: ‘నేను అబద్ధాలు చెప్పలేదు. నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను’ అని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.


బావ హత్యతో ప్రమేయం ఉందంటూ..

నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే

అరెస్టు: 2021 మార్చి 12న

* అభియోగం: బావ తేతలి సత్తిరాజురెడ్డి మృతికి రామకృష్ణారెడ్డి కారకుడని కేసు

కారణం కూడా చెప్పకుండా: స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా రామవరంలో హైకోర్టు న్యాయవాది శివారెడ్డి ఇంటివద్ద రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎందుకు తీసుకెళ్తున్నారో కారణాలు చెప్పలేదు.

మాకు ఎలాంటి సంబంధం లేదు: తేతలి సత్తిరాజుకు, తమ కుటుంబానికి 15 ఏళ్లుగా సంబంధాల్లేవని, హత్యలో తన ప్రమేయం లేదని తేలినా, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో రిపోర్టు మార్చేసి కేసులో అన్యాయంగా ఇరికించారని రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.


దాడికి ప్రయత్నించిన వారిని వదిలేసి..

బీసీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, తెదేపా

* అరెస్టు: 2021 మే 23న

* ఏ సమయంలో: అర్ధరాత్రి

అభియోగం: వైకాపా కార్యకర్తల ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు

మాపై దాడికి వచ్చినవారిని వదిలేసి: ‘బనగానపల్లెలోని మా ఇంటి వద్దకు వైకాపా వర్గీయులు వచ్చి మమ్మల్ని దూషించారు. మేం ఎంతో సహనంగా ఉన్నా మాపై దాడికి ప్రయత్నించారు. వారిని వదిలిపెట్టి.. మాపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం అన్యాయం’ అని జనార్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు.


పోలీసు స్టేషన్లన్నీ తిప్పుతూ

నాదెండ్ల బ్రహ్మం చౌదరి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

* అరెస్టు: 2021 అక్టోబరు 20న

అభియోగం: తెదేపా కేంద్ర కార్యాలయంలో గొడవ జరుగుతోందని తెలిసి వెళ్లిన తనను కులం పేరుతో దూషించారని, చంపేందుకు ప్రయత్నించారని డీజీపీ కార్యాలయంలో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే జి.సక్రూనాయక్‌ ఫిర్యాదు

పలు స్టేషన్లు తిప్పుతూ: ఉండవల్లిలో అదుపులోకి తీసుకుని మొదట మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌కు, అక్కడి నుంచి విజయపురిసౌత్‌ స్టేషన్‌కు, ఇతర ఠాణాలకు తిప్పారు.

అక్రమంగా కేసు పెట్టారు: ‘నాపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. పోలీసులు వైకాపా కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. మేడికొండూరు సీఐ మారుతీ కృష్ణ అకారణంగా నాపై చేయి చేసుకున్నారు. నాగార్జునసాగర్‌కు తీసుకెళ్లి అక్కడి స్టేషన్‌లో రాత్రంతా నిర్బంధించారు’

హైకోర్టు జోక్యం: పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి అకారణంగా కొట్టారని రిమాండు సమయంలో మేజిస్ట్రేట్‌కు చెప్పినా.. వైద్యపరీక్షకు పంపకపోవడం, రిమాండ్‌ విధించడంపై హైకోర్టు నివేదిక కోరింది. మంగళగిరి అదనపు జ్యుడిషియల్‌ మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించారో లేదో విచారించి నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా ప్రధాన జడ్జిని హైకోర్టు ఆదేశించింది.


 ఇంటిపై రాళ్లదాడి.. ఆయనపైనే కేసు

జి.వి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వైయస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి

* అరెస్టు: 2022 అక్టోబరు 14న

* ఏ సమయంలో: వేకువజామున

అభియోగం: కొందరు వైకాపా నేతలు, వారి అనుచరులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఇంటిపై రాళ్ల దాడి చేశారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి రెచ్చగొట్టడం వల్లే ఆ దాడి జరిగిందని పోలీసులు తిరిగి ఆయనపైనే కేసు పెట్టారు.

నిద్రపోతుండగా: ఇంట్లో నిద్రపోతున్న వ్యక్తిని తెల్లవారుజామున  అరెస్టు చేశారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. ఇటీవల ప్రొద్దుటూరు కోర్డు ప్రవీణ్‌కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించింది. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కానీ పోలీసులు కేసు డైరీని సమర్పించకుండా జాప్యం చేస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భార్య మౌనికారెడ్డి జిల్లా ఎస్పీని కలసి హైకోర్టుకు కేస్‌ డైరీ పంపించాలని కోరారు.


సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఫార్వార్డ్‌ చేశారంటూ

దారపనేని నరేంద్ర, తెదేపా మీడియా సమన్వయకర్త

* ఎప్పుడు అరెస్టు చేశారు: 2022 అక్టోబరు 12న

* ఏ సమయంలో: రాత్రి 8.30 గంటల సమయంలో

అభియోగం: గన్నవరం విమానాశ్రయంలో బయటపడిన బంగారం స్మగ్లింగ్‌ కేసులో ముఖ్యమంత్రి కార్యాలయంలోని కీలక అధికారికి సంబంధం ఉందంటూ వాట్సప్‌ గ్రూపులో పోస్టులు ఫార్వర్డు చేశారని

బలవంతంగా లాక్కెళ్లారు: గుంటూరు అరండళ్‌పేటలోని నరేంద్ర ఇంటికి సాయంత్రం 6.30 గంటల సమయంలో ఏడుగురు వ్యక్తులు వచ్చి తాము సీఐడీ పోలీసులమంటూ సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 2 గంటల పాటు ప్రశ్నించారు. రాత్రి 8.30 గంటల సమయంలో అరెస్టు చేస్తున్నామని చెప్పి నరేంద్ర భార్య సౌభాగ్యమ్మకు నోటీసు అందజేశారు.. నరేంద్రను బలవంతంగా తీసుకెళ్లారు.

నరేంద్రను హింసించారు: ‘నరేంద్రను గోడ కుర్చీ వేయించారు. కొట్టారు. హింసించారు. అదనపు ఎస్పీ, డీఎస్పీ ర్యాంకులో ఉండే వ్యక్తి దుర్మార్గంగా వ్యవహరించారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టం’ అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 


సీఐడీ వేధింపులు... మనో వేదనతో మృతి?

అధికార పార్టీ నాయకుల్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఫార్వర్డు చేశారని మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరుడైన 70 ఏళ్ల నలంద కిశోర్‌ను 2020 జూన్‌ 23న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరోగ్యం సరిగా లేదని, ఉదయం వస్తానని చెప్పినా వినకుండా తీసుకెళ్లారు. కరోనా సమయంలోనూ విశాఖ నుంచి కర్నూలుకు తరలించారు. విచారించి అక్కడే వదిలేశారు. తర్వాత ఆయనకు జ్వరం వచ్చింది. పరీక్ష చేయించుకోగా కరోనా అని తేలింది. రెండు రోజులకు ఆయన మరణించారు. ‘పోలీసుల వేధింపులు తట్టుకోలేక కిశోర్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆయన మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని