జగన్‌ హామీ... ఏమాయె సామీ!

ఎదురుమొండి-ఏటిమొగ వారధి నిర్మాణాన్ని చేపట్టి దివివాసుల కష్టాలు తొలగిస్తామంటూ గత ఎన్నికల్లో ప్రతిపక్షనేతగా జగన్‌ ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు.

Published : 29 Sep 2023 06:52 IST

ఎదురుమొండి-ఏటిమొగ వారధి నిర్మాణాన్ని చేపట్టి దివివాసుల కష్టాలు తొలగిస్తామంటూ గత ఎన్నికల్లో ప్రతిపక్షనేతగా జగన్‌ ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. తెదేపా ప్రభుత్వ హయాంలో 2018 డిసెంబరులో ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌(ఏఐఐబీ) సహకారంతో వారధి నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.75 కోట్లు కేటాయించారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. కృష్ణానది సముద్రంలో సంగమించే నాగాయలంక ప్రాంత బ్యాక్‌వాటర్‌ పాయల్లోని దీవుల్లో నివసించే 10 వేలమందికి పైగా ప్రజల దశాబ్దాల నాటి కల... ఈ వారధి. ఎదురుమొండి, నాచుగుంట, ఈలచెట్లదిబ్బ పంచాయతీల వారు గతంలో పడవ ప్రయాణం చేస్తూ 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోవడంతో 2002లో అప్పటి ప్రభుత్వం పంటు ఏర్పాటు చేసింది. ఒక్క పంటు మాత్రమే రాకపోకలు సాగిస్తుండడం, అదికూడా ఒక నిర్దిష్ట సమయాలకే పరిమితం కావడంతో ఈగ్రామాల ప్రజలు సగం జీవితకాలం ఇక్కడ వేచి ఉండడానికే సరిపోతుంది. ఏకైక పంటు కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం మరోసారి హామీలతో మభ్యపెడుతుందని దివివాసులు మండిపడుతున్నారు.  

ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, నాగాయలంక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని