Raghurama: ‘నియోజకవర్గానికి వస్తే తప్పుడు కేసులో అరెస్టు చేసే అవకాశం’

సంక్రాంతి పండుగ నేపథ్యంలో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ప్రజలను కలుసుకోవడానికి రాష్ట్రానికి వస్తున్న తనపై పోలీసులు తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో చట్ట నిబంధనలను పాటించేలా వారిని ఆదేశించాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.

Updated : 12 Jan 2024 12:33 IST

హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ రఘురామ
నేడు తగిన ఉత్తర్వులిస్తామన్న న్యాయమూర్తి

ఈనాడు, అమరావతి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ప్రజలను కలుసుకోవడానికి రాష్ట్రానికి వస్తున్న తనపై పోలీసులు తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో చట్ట నిబంధనలను పాటించేలా వారిని ఆదేశించాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. తగిన ఉత్తర్వులు జారీచేసేందుకు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఎస్‌ భానుమతి గురువారం ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. అంతకు ముందు పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌, న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపించారు. ఇప్పటికే పిటిషనర్‌పై 11 తప్పుడు కేసులు పెట్టారన్నారు. కేసులు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి వేరే పనిలేదన్నారు. ఇదో అరాచక ప్రభుత్వం అన్నారు. పిటిషనర్‌ను ఓ కేసులో అరెస్టు చేసి తీవ్రంగా కొట్టి చావు అంచుల వరకు తీసుకెళ్లారని తెలిపారు. ప్రాథమిక హక్కులకు విఘాతం కలుగుతున్న నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని చట్ట నిబంధనలు పాటించేలా, అర్నేష్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. పోలీసుల తరఫున హోంశాఖ జీపీ మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ది ఆందోళన మాత్రమేనన్నారు. పిటిషనర్‌పై తాజాగా ఎలాంటి కేసూ నమోదు కాలేదన్నారు. కేసు నమోదు కానప్పుడు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నోటీసు ఇవ్వాలని, చట్ట నిబంధనలను పాటించేలా పోలీసులను ఆదేశించాలని పిటిషనర్‌ కోరలేరని చెప్పారు. వ్యాజ్యానికి విచారణ అర్హత లేదన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి.. శుక్రవారం తగిన ఉత్తర్వులిస్తామని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని