Reward Points vs Cash Back: క్రెడిట్‌ కార్డ్‌ రివార్డ్‌ పాయింట్లు vs క్యాష్‌బ్యాక్‌.. ఏది మేలు?

Eenadu icon
By Business News Team Updated : 06 Aug 2025 12:46 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

Reward Points vs Cash Back | ఇంటర్నెట్ డెస్క్: క్రెడిట్‌ కార్డు తీసుకునేటప్పుడు అది అందించే ప్రయోజనాలను ఎక్కువమంది పరిగణనలోకి తీసుకుంటారు. జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజుతో పాటు ఇతరత్రాలను బేరీజు వేసుకుంటారు. చివరికి తమకు ఎక్కువ ప్రయోజనాలు, ప్రోత్సాహకాలను అందించే కార్డులకే మొగ్గు చూపుతారు. కొన్ని క్రెడిట్ కార్డులు రివార్డు పాయింట్లు ఇస్తే..  మరికొన్ని కార్డులు క్యాష్‌బ్యాక్‌ ప్రయోజనాలను అందిస్తాయి. మరి రివార్డ్‌ పాయింట్లతో ఎక్కువ ప్రయోజనమా? క్యాష్‌ బ్యాక్‌తోనా? ఏ తరహా కార్డు ఎంపిక చేసుకోవాలి?

క్రెడిట్‌ కార్డుతో చేసిన కొనుగోళ్లపై మనకు రివార్డు పాయింట్లు అందుతాయి. ఈ పాయింట్లను విమాన టికెట్లు, హోటల్‌ బుకింగ్స్‌, గిఫ్ట్‌ వోచర్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, గ్యాడ్జెట్లు వంటివి కొనుగోలు చేయడానికి ఉపయోగించొచ్చు. కొన్ని కార్డులు నెలంతా ఖర్చు చేసిన మొత్తంలో కొంత శాతం తిరిగి క్యాష్‌బ్యాక్‌ రూపంలో చెల్లిస్తాయి. ఈ మొత్తాన్ని మీ కార్డు బాకీపై సర్దుబాటు చేయొచ్చు. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో మీరు రూ.10 వేలు ఖర్చు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్‌ కింద రూ.500 మీ కార్డు ఖాతాకు తిరిగి జమవుతుంది. ఆ మొత్తం మినహాయించి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించొచ్చు. మరికొన్ని వాలెట్‌లో నగదు రూపంలో జమ చేస్తాయి.

రివార్డు పాయింట్లా? క్యాష్‌బ్యాకా?

  • క్యాష్‌బ్యాక్‌ చాలా సౌలభ్యంగా ఉంటుంది. నగదు నేరుగా ఖాతాల్లోకి రావడం వల్ల కేటలాగ్‌లు, గడువు తేదీల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అదే రివార్డు పాయింట్లయితే.. ప్రయాణం నుంచి  గ్యాడ్జెట్‌ల వరకు దేనికోసమైనా వాడొచ్చు. పాయింట్ల విలువ ఒక్కో ప్రొడక్ట్‌కు ఒక్కోలా ఉంటుంది.
  • క్యాష్‌బ్యాక్‌ అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. నగదు నేరుగా మన ఖాతాల్లోకి వస్తుంది. లేదంటే వోచర్‌గా జారీ అవుతుంది. దీనికి గడువు తేదీ అంటూ ఉండదు. రివార్డ్‌ పాయింట్ల విషయానికొస్తే.. అర్థం చేసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. రివార్డ్ పోర్టళ్లు, కనీస పాయింట్‌ థ్రెషోల్డ్‌లు, స్పెసిఫిక్‌ పార్ట్‌నర్‌లు వంటివి ఉంటాయి. రివార్డు పాయింట్లను గడువు తేదీలోపు వాడకపోతే అవి పనికిరావు.
  • ఆకర్షణీయమైన రివార్డ్ ఆఫర్లు ఉన్న కార్డులకు వార్షిక ఫీజు ఎక్కువగా ఉంటుంది. నిర్దేశిత ఖర్చు పరిమితులను చేరుకున్నట్లయితే ఈ ఫీజుల నుంచి మినహాయింపు పొందొచ్చు. క్యాష్‌బ్యాక్‌ కార్డులకు తక్కువ  వార్షిక రుసుములు ఉంటాయి. క్యాష్‌బ్యాక్‌కు సంబంధించి కొన్ని కార్డులకు అసలు వార్షిక ఫీజులుండవు. బడ్జెట్‌ను దృష్టిలోపెట్టుకొని ఖర్చు చేసే వారికి క్యాష్‌బ్యాక్‌ కార్డులు అనుకూలంగా ఉంటాయి.
  • రివార్డ్‌ పాయింట్లు ఆఫర్‌ చేసే కార్డులు ఎక్కువగా ప్రయాణించే వారికి, అధిక మొత్తం ఖర్చు చేసే వారికి, ఆన్‌లైన్‌ షాపింగ్‌ వంటివి ఆసక్తి ఉన్నవారికి అనుకూలంగా ఉంటాయి. క్యాష్‌బ్యాక్‌ కార్డులు మాత్రం రోజువారీ వినియోగానికి, తక్షణ పొదుపునకు ఉత్తమం.
  • క్యాష్‌బ్యాక్‌ ఎస్‌బీఐ, స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌, ఎయిర్‌టెల్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ వంటివి క్యాష్‌ బ్యాక్‌ అందించే కార్డులకు ఉదాహరణగా చెప్పొచ్చు. చాలావరకు మిగిలిన క్రెడిట్ కార్డులు రివార్డు పాయింట్లను ఆఫర్‌ చేస్తుంటాయి.

చివరిగా: రివార్డ్‌ పాయింట్లను ఆఫర్‌ చేసే కార్డులు, క్యాష్‌బ్యాక్‌ ఇచ్చే కార్డులు.. రెండింటికీ వాటి ప్రయోజనాలు, పరిమితులు ఉంటాయి. మీరు క్రెడిట్‌ కార్డు తీసుకునే ముందు వాటికి సంబంధించిన నిబంధనలు, షరతులను పూర్తిగా చదవాలి. మీ అవసరాలకు అనుగుణంగా సరైన కార్డును ఎంచుకోవడం ముఖ్యం.

Tags :
Published : 06 Aug 2025 12:43 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని