Insurance policy: ధీమా భరోసానిచ్చేలా..

ఆర్థిక లక్ష్యాలను సాధించాలంటే క్రమం తప్పకుండా మదుపు చేయాల్సిందే. కొన్ని బాధ్యతలకు పెట్టుబడులు ఒక్కటే సరిపోవు. అందుకు సరైన మొత్తానికి తీసుకునే బీమా పాలసీలే సహాయపడతాయి.

Updated : 12 Jan 2024 05:45 IST

ఎప్పుడో పదేళ్ల క్రితం తీసుకున్న బీమా పాలసీ.. అప్పటితో పోలిస్తే ఇప్పుడు మారిన ఆదాయం.. బాధ్యతలు.. మరి అందుకు అనుగుణంగా ఆర్థిక రక్షణ పెరగాలి కదా.. అనుకోని కష్టం వచ్చినప్పుడు కుటుంబానికి ఆర్థికంగా భరోసానిచ్చే బీమా.. మీకు ఎంత మేరకు ఉందో ఒకసారి చూసుకున్నారా?

ర్థిక లక్ష్యాలను సాధించాలంటే క్రమం తప్పకుండా మదుపు చేయాల్సిందే. కొన్ని బాధ్యతలకు పెట్టుబడులు ఒక్కటే సరిపోవు. అందుకు సరైన మొత్తానికి తీసుకునే బీమా పాలసీలే సహాయపడతాయి. అందుకే, వీటిని ఎప్పటికప్పడు సమీక్షిస్తూ ఉండాలి. అవసరానికి తగినట్లుగా భరోసాను పెంచుకోవాలి.

సరిపోతుందా? : మీ ప్రస్తుత జీవిత బీమా మొత్తాన్ని ఒకసారి అంచనా వేయండి. మీ కుటుంబ జీవన శైలి, ఆదాయం, కొత్తగా వచ్చిన ఆస్తులు, అదనపు బాధ్యతలు, అప్పులు తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోండి. మీ ఆర్థిక స్థితిని క్షుణ్నంగా విశ్లేషించండి. ఇప్పటికిప్పుడు మీపై ఆధారపడిన వారికి ఎలాంటి ఆర్థిక రక్షణ లభించాలి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు నిజంగా మీకు ఎంత బీమా మొత్తం అవసరం అన్నది కచ్చితమైన అంచనా వస్తుంది. దానికి అనుగుణంగా బీమా పాలసీలను తీసుకునేందుకు ప్రయత్నించండి.  
నిబంధనలు చూడండి.. : ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు మీ బీమా పాలసీ ఎంత మేరకు రక్షణ కల్పిస్తుందో అవగాహన పెంచుకోండి. ఎవరు క్లెయిం చేయాలి, నామినీగా ఎవరున్నారు అనేది చూసుకోండి. పాలసీలో ఉన్న నిర్ణీత నిబంధనలు, మినహాయింపులు, పరిమితులు, షరతులను జాగ్రత్తగా చూడండి. క్లెయిం పరిష్కారాల్లో వివాదాలు రావడానికి ప్రధాన కారణం పాలసీకి సంబంధించిన నిబంధనలను సరిగా అర్థం చేసుకోకపోవడమే. పాలసీ తీసుకునేటప్పుడు అన్ని అంశాలనూ అర్థం చేసుకోండి. మీ కొత్త లక్ష్యాలకు అనుగుణంగా పాలసీ ఉండేలా చూసుకోండి. ప్రీమియం చెల్లించాల్సిన తేదీలపై దృష్టి పెట్టండి. సందేహాలుంటే బీమా సంస్థ సలహా కేంద్రాన్ని సంప్రదించాలి.
అదనపు రక్షణ అవసరమా? : జీవితంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆర్థిక ప్రాధాన్యతలు మారిపోతాయి. దానికి అనుగుణంగా మీ పెట్టుబడుల తీరు, బీమా పాలసీ మొత్తం సర్దుబాటు చేయాలి. ఆర్థిక ప్రణాళికలను మరోసారి పరిశీలించాలి. లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు, బీమాకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. మీ జీవనశైలి, భవిష్యత్‌ అవసరాలను అర్థం చేసుకొని ఎంత మేరకు బీమా మొత్తం పెంచుకోవాలన్నది చూసుకోవాలి.  
ఆర్థిక పరీక్ష చేసుకున్నారా? : క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎప్పుడూ మంచిదే. ఇదే మాదిరిగా కనీసం ఏడాదికోసారి ఆర్థిక పరీక్ష చేసుకోవడమూ ఉత్తమం. దీనివల్ల మీ ప్రస్తుత అప్పులు, ఆస్తుల గురించి మీకు ఒక కచ్చితమైన అంచనా వస్తుంది. భవిష్యత్‌ ఆర్థిక వ్యూహాలను నిర్ణయించుకోవడానికి దోహదం చేస్తుంది. బలమైన ఆర్థిక పునాదులు నిర్మించినప్పుడే కుటుంబానికి పూర్తి భద్రత ఉంటుందని మర్చిపోవద్దు.
మార్పులకు అనుగుణంగా : జీవితంలో వివిధ దశలకు చేరుకున్నప్పుడల్లా ఆర్థికంగానూ, ఆరోగ్యంగానూ పలు మార్పులు వస్తుంటాయి. కొత్త అప్పులు తీసుకుంటే.. దానికి అనుబంధంగా ఒక బీమా పాలసీ తప్పనిసరిగా ఉండాలి. గృహరుణానికి తోడుగా లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీ తీసుకోవాలి. కొన్ని బీమా సంస్థలు ఆరోగ్యాన్ని కాపాడుకునే వారికి ప్రీమియంలో రాయితీలు ఇస్తున్నాయి. లాయల్టీ ప్రయోజనాలు, అదనపు తగ్గింపులనూ వర్తింపజేస్తున్నాయి. జీవిత బీమా పాలసీని తీసుకునేటప్పుడు ఈ వివరాలూ పరిగణనలోకి తీసుకోండి.


ధీరజ్‌ సెహగల్‌ చీఫ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బిజినెస్‌ ఆఫీసర్‌, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని