ఆంధ్రప్రదేశ్‌లో రిఫైనరీ అభివృద్ధికి ఆయిల్‌ ఇండియాతో బీపీసీఎల్‌ ఒప్పందం

Eenadu icon
By Business News Desk Published : 29 Oct 2025 02:31 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు వాణిజ్య విభాగం: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్ట్‌ సమీపంలో కొత్త రిఫైనరీ, పెట్రోరసాయనాల కాంప్లెక్స్‌ అభివృద్ధి చేసేందుకు ఆయిల్‌ ఇండియా (ఓఐఎల్‌)తో నాన్‌ బైండింగ్‌ అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు బీపీసీఎల్‌ (భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌) వెల్లడించింది. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో తలపెట్టిన ఈ ప్రాజెక్టును 2030 ఆర్థిక సంవత్సరాని కల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యం. 9-12 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో మైనారిటీ వాటా తీసుకోవాలన్నది ఓఐఎల్‌ ప్రణాళిక. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 6,000 ఎకరాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేటాయించగా, ముందస్తు కార్యకలాపాలు జరుగుతున్నాయి. దేశీయంగా ఇంధన భద్రత, స్థిరత్వాన్ని సాధించేందుకు ఈ ఒప్పందం ఉపకరిస్తుందని, ఇంధనం-పెట్రో రసాయనాల్లో స్వయం సమృద్ధికి ఉపయోగ పడుతుందని బీపీసీఎల్‌ సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న రిఫైనరీస్‌ డైరెక్టర్‌ సంజయ్‌ ఖన్నా తెలిపారు. ఇంధన రంగంలో రిఫైనింగ్, నిల్వ, సరఫరా, పంపిణీ కార్యకలాపాలకు ఎంతగా కట్టుబడి ఉన్నామనేందుకు ఈ ఒప్పందం నిదర్శనమని ఓఐఎల్‌ సీఎండీ రంజిత్‌ రథ్‌ వివరించారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా 1.5 మిలియన్‌ టన్నుల ఎథిలిన్‌ క్రాకర్‌ యూనిట్‌ను ఇక్కడ నెలకొల్పనున్నారు. భారీఎత్తున ఉద్యోగాల కల్పనకు ఈ యూనిట్‌ ఉపయోగ పడనుంది. 

దీనితో పాటు నుమాలీఘర్‌ రిఫైనరీ లిమిటెడ్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌), ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ (ఫ్యాక్ట్‌)లతో కూడా ఇతర ప్రాజెక్టుల కోసం ఎంఓయూలు చేసుకున్నట్లు బీపీసీఎల్‌ తెలిపింది. 

విమాన ఇంధన రవాణాకు

 ఎన్‌ఆర్‌ఎల్‌ సామర్థ్యాలను 3 ఎంఎంటీపీఏ నుంచి 9 ఎంఎంటీపీఏకు పెంచిన తర్వాత పెట్రోలియం ఉత్పత్తుల రవాణా కోసం బీపీసీఎల్, ఆయిల్‌ ఇండియా, నుమాలీఘర్‌ రిఫైనరీ త్రైపాక్షిక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం సిలిగురి నుంచి ముజఫర్‌పూర్‌ మీదుగా మొఘల్‌సరాయ్‌ వరకు 700 కి.మీ. క్రాస్‌ కంట్రీ ప్రోడక్ట్‌ పైప్‌లైన్‌ను సంయుక్తంగా నిర్మించనున్నారు. దీని అంచనా వ్యయం రూ.3500 కోట్లు. మోటార్‌ స్పిరిట్, హైస్పీడ్‌ డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్‌)లను రవాణా చేయడానికి రూపొందించిన ఈ పైప్‌లైన్‌లో బీపీసీఎల్‌కు 50% వాటా కలిగి ఉంటుంది. మిగతా 50% వాటా ఆయిల్‌ ఇండియా, ఎన్‌ఆర్‌ఎల్‌ చేతిలో ఉంటాయి. 

హరిత ఇంధనం, వ్యర్థాల నుంచి ఇంధన కార్యక్రమాలను బీపీసీఎల్‌ కొనసాగించనుంది. కోచి రిఫైనరీ సమీపంలోని బ్రహ్మపురం వద్ద రాబోయే బీపీసీఎల్‌ మున్సిపల్‌ ఘన వ్యర్థాల ఆధారిత కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి అయ్యే ఫెర్మెంటెడ్‌ ఆర్గానిక్‌ మాన్యుర్, లిక్విడ్‌ ఫెర్మెంటెడ్‌ ఆర్గానిక్‌ మాన్యుర్‌లను రవాణా చేయడం కోసం ఫ్యాక్ట్‌తో బీపీసీఎల్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని