సంక్షిప్త వార్తలు(11)

Eenadu icon
By Business News Desk Published : 30 Oct 2025 02:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
6 min read

రష్యా సహా అనువైన ప్రాంతాల నుంచి చమురు కొంటాం: బీపీసీఎల్‌

హైదరాబాద్‌: వాణిజ్య పరంగా అనుకూలంగా ఉంటే రష్యా సహా అనువైన ప్రాంతాల నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తామని ప్రభుత్వరంగ బీపీసీఎల్‌ సీఎండీ సంజయ్‌ ఖన్నా తెలిపారు. ఇతర సంస్థలూ ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయని వివరించారు. రష్యా నుంచి చమురు కొనాలా, వద్దా అనే అంశంపై ప్రభుత్వం నుంచి సూచనలు ఏమీ రాలేదని స్పష్టం చేశారు.


ఎన్‌ఎండీసీ లాభం రూ.1,682 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ గనుల సంస్థ ఎన్‌ఎండీసీ లిమిటెడ్, సెప్టెంబరు త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. రూ.6,761.43 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.1,682 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2024-25 ఇదే కాలంలో ఆదాయం రూ.5,279.68 కోట్లు, నికర లాభం రూ.1,195.63 కోట్లుగా ఉన్నాయి. వీటితో పోలిస్తే ఆదాయం 28.1%, లాభం 40.8% పెరిగాయి. ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఆదాయం రూ.13,800.40 కోట్లు, నికర లాభం రూ.3,650.45 కోట్లుగా నమోదయ్యాయి.


రష్యా చమురు కొనడం లేదు: మిత్తల్‌ జేవీ

రష్యా చమురు సంస్థలపై అమెరికా, ఈయూ, యూకే ఆంక్షల నేపథ్యంలో భారత్‌లో లక్ష్మీమిత్తల్‌కు ఇంధన సంయుక్త సంస్థ హెచ్‌ఎమ్‌ఈఎల్‌ భవిష్యత్‌లో రష్యా చమురు కొనరాదని నిర్ణయించుకుంది. మిత్తల్‌ గ్రూప్, హెచ్‌పీసీఎల్‌ సంయుక్త సంస్థే హెచ్‌ఎమ్‌ఈఎల్‌. ఇప్పటిదాకా డెలివరీ పద్ధతిన రష్యా చమురు కొనుగోలు చేసినట్లు ఈ సంస్థ పేర్కొంది. అంతక్రితం ఆర్డర్లపై భారత పోర్టుల్లోకి వచ్చే నౌకల్లోని రష్యా చమురుపై ఎటువంటి ఆంక్షలూ లేవని స్పష్టం చేసింది. ఆంక్షల అనంతరం రష్యా చమురు కొనుగోళ్లు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించిన తొలి భారత సంస్థ ఇదే. 


నేడు, రేపు స్టార్‌లింక్‌ నమూనా సేవలు 

అమెరికా కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సేవల సంస్థ స్టార్‌లింక్, మనదేశంలో సాంకేతిక, భద్రతా పరమైన సేవల ప్రదర్శనను ఈనెల 30, 31 తేదీల్లో నిర్వహించనుంది. ఇందుకోసం ఇప్పటికే సంస్థకు స్పెక్ట్రమ్‌ను కేటాయించిన సంగతి విదితమే. చట్టాన్ని అమలు చేసే సంస్థల ఎదుట ముంబయిలో తమ నమూనా సేవలను సంస్థ ప్రదర్శిస్తుంది. అధికారులు సంతృప్తి చెందితే, వాణిజ్య సేవలకు సంస్థకు అనుమతులు వస్తాయి.


ప్రయోగాత్మకంగా కాలింగ్‌ నేమ్‌ ప్రెజెంటేషన్‌ సేవలు 

మొబైల్‌లోని మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని వ్యక్తి కాల్‌ చేసినా, ఆ వ్యక్తి అసలు పేరు తప్పనిసరిగా కనిపించేలా చూసే ‘కాలింగ్‌ నేమ్‌ ప్రెజెంటేషన్‌ (సీఎన్‌ఏపీ)’ సేవలను టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలు ప్రయోగాత్మకంగా ప్రారంభించాయి. ప్రస్తుతం ఒక సర్కిల్‌ పరిధిలో ఈ విధానాన్ని ఆయా సంస్థలు అందుబాటులోకి తెస్తున్నాయి. 2026 మార్చి 31 కల్లా దేశవ్యాప్తంగా టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలు ఈ సేవను అమల్లోకి తేవాలని టెలికాం విభాగం నిర్దేశించింది. ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియా, జియో సంస్థలు హరియాణాలో ఈ సేవలను ప్రయోగాత్మకంగా చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.


స్మార్ట్‌ఫోన్‌ నుంచే మహీంద్రా కార్ల లాక్‌!

మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) విద్యుత్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహనాల (ఎస్‌యూవీల) కోసం ‘డిజిటల్‌ కీ’లను అభివృద్ధి చేసేందుకు శామ్‌సంగ్‌తో జట్టు కట్టింది. శామ్‌సంగ్‌ వినియోగదార్లు త్వరలో తమ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా మహీంద్రా విద్యుత్‌ ఎస్‌యూవీలను అన్‌లాక్‌ చేసి, స్టార్ట్‌ చేయొచ్చు. డిజిటల్‌ కార్‌ కీ పేరిట శామ్‌సంగ్‌ ఈ ఫీచర్‌ తీసుకురానుంది. శామ్‌సంగ్‌ వాలెట్‌తో అనుసంధానించడం ద్వారా భౌతిక తాళాల అవసరాన్ని తగ్గించనున్నట్లు శామ్‌సంగ్‌ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌ ఫర్‌ సర్వీసెస్‌ అండ్‌ యాప్స్‌ బిజినెస్‌ మధుర్‌ చతుర్వేది వెల్లడించారు.


తగ్గిన ఎన్‌ఎండీసీ స్టీల్‌ నష్టం

ఈనాడు, హైదరాబాద్‌: ఆదాయాలు మెరుగవ్వడంతో సెప్టెంబరు త్రైమాసికంలో ఎన్‌ఎండీసీ స్టీల్‌ నష్టాలు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో సంస్థ నికర నష్టం రూ.595.37 కోట్లు కాగా, ఈ ఏడాది ఇదే కాలంలో నికర నష్టం రూ.114.78 కోట్లకు పరిమితమైంది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.1,535.46 కోట్ల నుంచి రెట్టింపునకు మించి రూ.3,411.03 కోట్లకు పెరిగింది. ఖర్చులు రూ.2,364.39 కోట్ల నుంచి రూ.3,593 కోట్లకు చేరాయి. ముడిసరకు ధర పెరగడమే ఇందుకు కారణమని సంస్థ వెల్లడించింది.


32% తగ్గిన కోల్‌ ఇండియా లాభం

దిల్లీ: కోల్‌ ఇండియా, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.4,262.64 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.6,274.80 కోట్లతో పోలిస్తే ఇది 32% తక్కువ. అమ్మకాలు తగ్గడం,  వ్యయాలు పెరగడం ఇందుకు కారణమంది. మొత్తం ఏకీకృత విక్రయాలు రూ.27,271.30 కోట్ల నుంచి రూ.26,909.23 కోట్లకు పరిమితమయ్యాయి. మొత్తం వ్యయాలు రూ.24,670.70 కోట్ల నుంచి 7% అధికమై రూ.26,421.86 కోట్లకు చేరాయి. బొగ్గు ఉత్పత్తి 50.94 మి.టన్నుల నుంచి 3.9% తగ్గి 48.97 మి.టన్నులుగా నమోదైంది. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతానికి పైగా వాటా కోల్‌ ఇండియాదే.


ఎల్‌ అండ్‌ టీ లాభంలో 16% వృద్ధి

దిల్లీ: మౌలిక సదుపాయాల కల్పన అగ్రగామి సంస్థ ఎల్‌ అండ్‌ టీ, జులై- సెప్టెంబరు త్రైమాసికానికి  ఏకీకృత ప్రాతిపదికన రూ.3,926.09 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాల లాభం  రూ.3,395.29 కోట్లతో పోలిస్తే ఇది 15.6% అధికం. కార్యకలాపాల ఆదాయం రూ.61,554.58 కోట్ల నుంచి 10% పెరిగి రూ.67,983.53 కోట్లకు చేరింది. 2025 సెప్టెంబరుతో ముగిసిన అర్ధ సంవత్సరంలో రూ.2,10,237 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకున్నట్లు ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో లభించిన ఆర్డర్లతో పోలిస్తే ఈ విలువ 39% ఎక్కువ. అలాగే విదేశీ ఆర్డర్ల విలువ రూ.1,24,236 కోట్లు కాగా.. కంపెనీ మొత్తం ఆర్డర్లలో వీటి వాటా 59%. ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ (హెదరాబాద్‌) లిమిటెడ్‌లో తమ వాటా ఉపసంహరణకు తెలంగాణ ప్రభుత్వంతో సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌ ఎన్‌ సుబ్రమణ్యన్‌ తెలిపారు.


యూఏఈ నుంచి పసిడి దిగుమతికి బిడ్డింగ్‌! 

దిల్లీ: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)తో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అనుసరించి, టారిఫ్‌ రేట్‌ కోటా (టీఆర్‌క్యూ) కింద పసిడి దిగుమతికి బిడ్డింగ్‌/టెండర్‌ ప్రక్రియ అనుసరిస్తామని ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. టీఆర్‌క్యూ కింద సుంకం రాయితీ/ 1% సుంకం   ప్రకారం ఏడాదికి 200 టన్నుల పసిడిని యూఏఈ నుంచి దిగుమతి చేసుకునేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకోసం ఎగుమతిదార్లు బిడ్డింగ్‌/టెండర్‌ ప్రక్రియలో పాల్గొనాలి. ఇందుకు అర్హత పొందిన ఎగుమతిదారు హాల్‌మార్కింగ్‌ కోసం భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) వద్ద, జీఎస్‌టీ వద్ద నమోదవ్వాలి. వీరు ఆన్‌లైన్‌లోనే డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. బిడ్డింగ్‌/టెండర్‌ ప్రక్రియ కూడా ఆన్‌లైన్‌లోనే జరుపుతారు.


అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లలో 0.25% కోత

వాషింగ్టన్‌: అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌.. అంచనాలకు అనుగుణంగానే కీలక రేట్లలో 0.25% కోత విధించింది. దీంతో అమెరికాలో వడ్డీ రేట్లు 3.75-4 శాతానికి పరిమితమయ్యాయి. ఈ ఏడాదిలో ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గించడం ఇది రెండోసారి. ప్రభుత్వ షట్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న ఆర్థిక వ్యవస్థకు ఇది ఉపశమనం ఇవ్వనుంది. డిసెంబరు 1 నుంచి ఆస్తుల కొనుగోళ్ల ప్రక్రియను ముగించనున్నట్లు భారత కాలమాన ప్రకారం బుధవారం రాత్రి 11:30 గంటలకు ఫెడ్‌ ప్రకటించింది. కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీలో వడ్డీ రేట్ల కోతకు 10-2 ఓట్లతో ఆమోదం లభించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ రెండోసారి పగ్గాలు చేపట్టాక, సెప్టెంబరులో తొలిసారి రేట్లను తగ్గించిన ఫెడ్, నెల రోజుల్లోనే మరోసారి కోతను ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని