Vodafone Idea: వొడాఫోన్‌ ఐడియాకు భారీ ఊరట!

Eenadu icon
By Business News Desk Published : 28 Oct 2025 07:22 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఏజీఆర్‌ బకాయిల పునః పరిశీలనకు కేంద్రానికి సుప్రీంకోర్టు అనుమతి

దిల్లీ: వొడాఫోన్‌ ఐడియాకు సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి పెండింగ్‌లో ఉన్న సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ (ఏజీఆర్‌) బకాయిలు రూ.5,606 కోట్ల విషయంలో పునఃపరిశీలనకు, రాజీకి కేంద్ర ప్రభుత్వానికి కోర్టు అనుమతినిచ్చింది. టెలికాం విభాగం (డాట్‌) తాజాగా జారీ చేసిన ఏజీఆర్‌ డిమాండ్‌లను సవాలు చేస్తూ, వొడాఫోన్‌ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, న్యాయమూర్తి జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశం ప్రభుత్వ విధానాల పరిధిలోకి వస్తుందని పేర్కొంది. టెలికాం సంస్థలు కేంద్రానికి చెల్లించాల్సిన లైసెన్సు ఫీజు, స్పెక్ట్రమ్‌ ఛార్జీలను లెక్కవేసేందుకు పరిగణించే ఆదాయాన్నే ఏజీఆర్‌గా పేర్కొంటున్నారు. 2019 నాటి సుప్రీం తీర్పులోనే ఈ బకాయిలు ప్రతిబింబించినందున, అదనపు క్లెయిములు చెల్లవని వొడాఫోన్‌ వాదించింది. ప్రభుత్వానికి వొడాఫోన్‌ ఐడియాలో 49% వాటా ఉందని, 20 కోట్ల మంది చందాదార్లు ఈ కంపెనీ సేవలపై ఆధారపడి ఉన్నారని కేంద్రం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు సమాచారమిచ్చారు. అందువల్ల కంపెనీ లేవనెత్తిన అంశాలను పరిశీలించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆ మేరకు కేంద్రానికి ధర్మాసనం అనుమతులిచ్చింది.

డాట్‌తో కలిసి పరిష్కరించుకుంటాం: 20 కోట్ల మంది వినియోగదార్ల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని డాట్‌తో కలిసి పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కోర్టు తీర్పు అనంతరం వొడాఫోన్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని