Health insurance: ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు

ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్‌డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది.

Updated : 20 Apr 2024 20:10 IST

Health insurance | దిల్లీ: ఆరోగ్య బీమాకు (Health insurance) సంబంధించి బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) కీలక మార్పులు చేసింది. పాలసీల కొనుగోలుకు ఉన్న వయోపరిమితిని తొలగించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పు అమల్లోకి వచ్చింది. ఇంతకుముందు కొత్త ఇన్సూరెన్స్‌ పాలసీ కొనుగోలు చేయాలంటే గరిష్ఠ వయోపరిమితి 65 ఏళ్లుగా ఉండేది. ఇకపై వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఆరోగ్య బీమా పొందొచ్చు. ఇక అన్ని వయసుల వారికీ బీమా సంస్థలు పాలసీలను జారీ చేయొచ్చు.

‘‘ఇకపై అన్ని వయసుల వారికీ ఆరోగ్య బీమాను ఇన్సూరెన్స్‌ సంస్థలు జారీ చేయొచ్చు. సీనియర్‌ సిటిజన్లు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణులలు సహా కాంపిటెంట్‌ అథారిటీ పేర్కొన్న అన్ని వయసుల వారికి అనుగుణంగా బీమా సంస్థలు తమ ప్రొడక్టులను డిజైన్‌ చేయొచ్చు’’ అని ఐఆర్‌డీఏఐ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల మరింత మందికి ఆరోగ్య సంరక్షణ అందించడంతో పాటు, కంపెనీలు తమ ఉత్పత్తులను వివిధీకరించుకోవడానికి వీలు పడుతుంది. సీనియర్‌ సిటిజన్లు వంటి నిర్దిష్ట వయసుల వారికి ప్రత్యేక పాలసీలు తీసుకురావాలని, వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ఛానెల్‌ను ఏర్పాటు చేయాలని బీమా సంస్థలకు సూచించింది. ఐఆర్‌డీఏఐ తాజా నిర్ణయాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి.

ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా

దీంతో పాటు ఆరోగ్య బీమాకు సంబంధించి ఐఆర్‌డీఏఐ మరికొన్ని మార్పులు సైతం చేసింది. ముందస్తు వ్యాధుల వెయిటింగ్‌ పీరియడ్‌, మారటోరియం పీరియడ్‌లను తగ్గించింది.  ఇంతకుముందు నాలుగేళ్లుగా ఉన్న వెయిటింగ్‌ పీరియడ్‌ను ఇప్పుడు 3 సంవత్సరాలకు కుదించింది. ఈ నిబంధన వల్ల ఒకవేళ మూడేళ్లు నిరంతరం ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తే.. ముందస్తు వ్యాధులను కారణంగా చూపి క్లెయిమ్‌లను బీమా సంస్థలు తిరస్కరించడానికి వీలుండదు. మారటోరియం వ్యవధిని 8 సంవత్సరాల నుంచి 5 ఏళ్లకు తగ్గించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని