Claim Settlement: జీవిత బీమాలో క్లెయిం సెటిల్‌మెంట్‌ ఎలా?

జీవిత బీమా క్లెయిమ్స్‌ సెటిల్‌మెంట్‌ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్‌మెంట్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 20 Apr 2024 17:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవితం అనూహ్యమైంది కాబట్టి.. ఊహించని సంఘటనలు జరిగినప్పడు కుటుంబాన్ని రక్షించుకోవడానికి చాలా మంది బీమాను కొనుగోలు చేస్తారు. పాలసీదారుడు మరణించినప్పుడు, నామినీలకు పరిహారం అందుతుంది. జీవిత బీమా క్లెయిం సెటిల్‌మెంట్‌ అనేది బీమా కంపెనీ తన వినియోగదారులకు అందించే అత్యంత ముఖ్యమైన సేవలలో కీలకమైంది. వినియోగదారుల క్లెయిమ్స్‌ను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత బీమా కంపెనీలకు ఉంటుంది. జీవిత బీమాయే కాకుండా ఏ బీమా విషయంలోనైనా పాలసీని కొనుగోలు చేసే ముందు, అధిక క్లెయిం సెటిల్‌మెంట్‌ రేషియో గల మెరుగైన బీమా సంస్థను ఎంచుకోవాలి.

క్లెయిం

ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే.. నామినీ అన్ని సంబంధిత పత్రాలను జీవిత బీమా సంస్థకు సమర్పించాలి. హామీ మొత్తం నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఒకవేళ బీమా సంస్థ క్లెయిం మొత్తాన్ని పరిష్కరించలేకపోతే రాతపూర్వకంగా పాలసీదారులకు/నామినీలకు తెలియజేస్తుంది. నామినీ.. బీమా సంస్థకు వీలైనంత త్వరగా తెలియజేయాలి. నామినీ జీవిత బీమా సంస్థ సమీప బ్రాంచ్‌ను సందర్శించడం ద్వారా లేదా ఆ సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా క్లెయిం ఫారాన్ని పొందొచ్చు. ప్రస్తుతం అన్ని బీమా సంస్థలు తమ వెబ్‌సైట్లలో ఆన్‌లైన్‌ దరఖాస్తులను కూడా కలిగి ఉంటున్నాయి. నామినీ.. క్లెయిం సమాచార దరఖాస్తులో పాలసీ నంబర్‌, పేరు, మరణించిన తేదీ, స్థలం, క్లెయిం లబ్దిదారుడి పేరు మొదలైన వివరాలను తెలపాలి. మరణ దావాను దాఖలు చేయడానికి అవసరమైన అన్ని పత్రాలను సరిగ్గా సమర్పించడం చాలా అవసరం.

అంతేకాకుండా, పాలసీదారుడి మరణం పోలీసుల విచారణలో ఉన్నట్లయితే.. ఎఫ్‌ఐఆర్‌, అధికారులు జారీచేసిన మరణ ధ్రువీకరణ పత్రం, పాస్ట్‌మార్టం నివేదిక, పంచనామ అవసరం. పాలసీ అమల్లో ఉన్న మూడు ఏళ్లలోపు నామినీ క్లెయిం చేసినప్పుడు, నిజమైన క్లెయిం అవునో కాదో అని నిర్ధరించడానికి బీమా సంస్థ అదనపు విచారణను చేస్తుంది.

క్లెయిం సెటిల్‌మెంట్‌ సమయం..

క్లెయిం సెటిల్‌మెంట్‌ అనేది ఏ పాలసీదారుడు/నామినీకైనా చాలా ముఖ్యమైనది. పత్రాల సమర్పణ, సమాచారానికి సంబంధించిన కచ్చితత్వం, మరణానికి కారణం, క్లెయిం హామీ వంటి వివిధ అంశాల ఆధారంగా బీమా క్లెయింను సెటిల్‌ చేయడానికి పట్టే సమయం 30-180 రోజులు. IRDAI (పాలసీ హోల్డర్స్‌ ఇంట్రెస్ట్‌) రెగ్యులేషన్స్‌, 2002 రెగ్యులేషన్‌ 8 ప్రకారం.. క్లెయిం సెటిల్‌మెంట్‌ విషయంలో బీమా హామీ పొందిన వ్యక్తి/నామినీ నుంచి అన్ని డాక్యుమెంట్‌లను స్వీకరించిన తర్వాత, బీమా సంస్థ 30 రోజుల లోపు క్లెయింను పరిష్కరించాలి. కొన్ని సందర్భాల్లో జీవిత బీమా సంస్థ విచారణ చేయవలసి ఉంటుంది. ఇలాంటప్పుడు రాతపూర్వక క్లెయిం నోటిఫికేషన్‌ను స్వీకరించిన ఆరు నెలలలోపు బీమా సంస్థ మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలి. బీమా ప్రొవైడర్‌ సమయ పరిమితిని పాటించడంలో విఫలమైతే, ఆలస్యమైన కాలానికి క్లెయిం మొత్తంపై తప్పనిసరిగా వడ్డీని చెల్లించాలి. సాధారణంగా పాలసీ కాలవ్యవధిలో మొదటి సంవత్సరంలోపు జరిగే ఆత్మహత్య మరణాలకు జీవిత బీమా వర్తించదు.

చివరిగా: అనేక సందర్భాల్లో ఆలస్యం లేదా సరైన పత్రాలు సమర్పించకపోవడం వల్ల జీవిత బీమా క్లెయిమ్స్‌ తిరస్కరణకు గురవుతాయి. ముఖ్యంగా బీమా సంస్థలు మరణ దావా క్లెయిం ప్రక్రియకు తగిన విచారణ చేయడం వల్ల ఆలస్యమవుతుంది. అందుచేత క్లెయిం ప్రాసెస్‌ గురించి లబ్దిదారుడికి సరైన అవగాహన కలిగి ఉండాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని