Insurance: బీమా విషయంలో ఈ తప్పులు చేయొద్దు!

బీమా ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. దీని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూడండి.

Published : 23 Nov 2023 19:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రతి ఒక్కరి జీవితం అనేక ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని దురదృష్టకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు.. అంటే అనారోగ్యం, ప్రమాదాలు, మరణం లాంటివి సంభవించినప్పుడు తోడుగా ఎవరున్నా, లేకపోయినా ఆర్థికంగా బలంగా ఉండాలంటే అన్నింటికీ తగిన కవరేజ్‌ ఉండేలా బీమా అవసరం. బీమా ఎంపికలో సాధారణంగా చేసే తప్పులు చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

యుక్త వయసులోనే బీమా

సాధారణంగా యుక్త వయసువారు ఆరోగ్యం, జీవితంపై చాలా భరోసాతో ఉండి ఈ రెండు బీమాలను తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు బీమా అవసరం ఏముందనేది వారి వాదన. అయితే, వయసు పెరిగే కొద్దీ బీమా ప్రీమియం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం జీవనశైలి మార్పుల వల్ల అనేక రోగాలు ప్రబలుతున్నాయి. అనుకోని ఇబ్బందులు ఏర్పడినప్పుడు బీమా ఆర్థికంగా కాపాడుతుందని యుక్త వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ గమనించాలి. ఆలస్యంగా పాలసీ తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులుంటాయి. చాలా ఆరోగ్య బీమా పాలసీలు పాలసీ ప్రారంభించిన మొదటి రోజు నుంచి ముందుగా ఉన్న వ్యాధులను కవర్‌ చేయవు అనే వాస్తవాన్ని గుర్తుంచుకోండి. కొనుగోలు చేసిన ఆరోగ్య బీమా ప్లాన్‌పై ఆధారపడి, కొన్ని వ్యాధులకు పాలసీ ప్రారంభ తేదీ నుంచి సాధారణంగా 36-48 నెలల వెయిటింగ్‌ పీరియడ్‌ ఉంటుంది. అయితే, యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే ఇలాంటి అనారోగ్యాల బారిన పడక ముందే కవరేజీ ఉంటుంది. అంతేకాకుండా యుక్త వయసువారి క్లెయింలు కూడా తక్కువ ఉంటాయి. క్లెయిం చేయని సందర్భంలో నో-క్లెయిం బోనస్‌ను కూడా అందుకోవచ్చు.

ఆన్‌లైన్‌ కొనుగోలు

ఇంకా చాలా మంది బీమా కోసం బీమా ఆఫీసులు, ఏజెంట్లు, పరిచయమున్న వారి చుట్టూ తిరుగుతారు. దీనివల్ల సమయం వృథా అవ్వడమే కాకుండా మొహమాటానికి ఏదో ఒక పాలసీతో సర్దుకుపోవాల్సి ఉంటుంది. ఇది కూడా పెద్ద తప్పు. ప్రస్తుత కాలంలో ఏ బీమానైనా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం చాలా సులభం. అత్యంత సురక్షితం కూడా. అంతేకాకుండా వివిధ పాలసీల ప్రీమియంలను, క్లెయిం రేషియోను పోల్చి చూసుకోవడం ఆన్‌లైన్‌లో చాలా తేలిక. ఆన్‌లైన్‌ పాలసీలో బీమా ప్రీమియం కూడా తక్కువ.

టర్మ్‌ బీమా

గతంలో ఎక్కువ మంది ఎండోమెంట్‌, మనీబ్యాక్‌ పాలసీలను తీసుకునేవారు. బీమా ఏజెంట్లు కూడా వీటిని బాగా ప్రొత్సహించేవారు. ఇలాంటి పాలసీలను తీసుకోవడం సరికాదు. భవిష్యత్‌లో పాలసీదారుడికి, అతడిపై ఆధారపడినవారికి ఇలాంటి పాలసీలు గరిష్ఠ ఆర్థిక ప్రయోజనాలను అందించలేవు. అందుచేత బీమాను, పెట్టుబ‌డిని క‌ల‌ప‌ని ట‌ర్మ్ జీవిత బీమా పాల‌సీ తీసుకోవ‌డం మంచిది. మిగిలిన‌ డ‌బ్బుని ఇత‌ర ప‌థ‌కాల‌లో మదుపు చేయడం మంచిది. దీనివల్ల బీమా, మదుపు రెండు ప్రయోజనాలు సరిగ్గా నెరవేరతాయి.

తప్పుడు సమాచారం

బీమాను ఎలాగైనా/ తక్కువ ప్రీమియంతో పొందాలనే ఉద్దేశంతో చాలా మంది సమాచారాన్ని దాచి తప్పు చేస్తుంటారు. జీవిత, ఆరోగ్య బీమా కోసం దరఖాస్తు చేసినప్పుడు మొత్తం సమాచారాన్ని కచ్చితంగా వెల్లడించడం చాలా అవసరం. వాస్తవ సమాచారాన్ని వెల్లడించకపోవడం వల్ల క్లెయిం తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. మీ పాలసీ చెల్లుబాటు అయ్యేలా చూసుకోవడానికి మీ వైద్య చరిత్ర, జీవనశైలి, అలవాట్లు, ఇతర సంబంధిత సమాచారాన్ని పారదర్శకంగా, నిజాయతీగా వెల్లడించాలి. 

కవరేజీ మొత్తం

చాలా మంది వ్యక్తులు జీవిత, ఆరోగ్య పాలసీలను తీసుకుంటారు గానీ దానికి తగిన కవరేజీ ఎంచుకోరు. దీనివల్ల అరకొర ప్రయోజనమే మిగులుతుంది. మీ బీమా అవసరాలను అంచనా వేయాలి. జీవిత బీమాలో కుటుంబానికి తగిన కవరేజీని అందించే పాలసీని కొనుగోలు చేయడం చాలా అవసరం. పాలసీదారుడు తన వార్షిక ఆదాయానికి కనీసం 10-12 రెట్లు బీమా హామీ ఉండేలా ప్లాన్‌ చేయాలి. ప్రాథమిక సూత్రం ఏంటంటే, లైఫ్‌ కవర్‌ మీపై ఆధారపడినవారి అవసరాలను తీర్చగలగాలి. ఆరోగ్య బీమా అయితే వైద్య ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసి తగిన మొత్తానికి పాలసీ తీసుకోవాలి. మీ వార్షిక ఆదాయానికి స‌మాన‌మైన మొత్తానికి ఆరోగ్య బీమాని ఖ‌చ్చితంగా తీసుకోవాల‌ని నిపుణులు స‌ల‌హా ఇస్తున్నారు. ప్రీమియం కారణంగా సరిపోని కవరేజీతో ఆరోగ్య బీమా ప్లాన్‌ను ఎంచుకోవడం వల్ల అనారోగ్యం సందర్భంలో అదనపు ఖర్చులను సొంతంగా భరించాల్సి వస్తుంది. అలాగని ఎక్కువ మొత్తానికి పాలసీ తీసుకోకూడదు, దీనివల్ల ఎక్కువ ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. 

నెట్‌వర్క్‌ ఆసుపత్రులు

చాలా ఆరోగ్య బీమా సంస్థలు నిర్దిష్ట నెట్‌వర్క్‌ ఆసుపత్రులను ఏర్పాటు చేసుకుంటాయి. బీమా సంస్థను బట్టి నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఎక్కువ, తక్కువ సంఖ్యలో ఉంటాయి. కొంతమంది బీమాను తీసుకునేటప్పుడు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల జాబితాను చూడరు. బీమా కొనుగోలుకు ముందే తప్పకుండా నెట్‌వర్క్‌ ఆసుపత్రుల జాబితాను తీసుకోవాలి. మీ ఇంటి వద్ద ఉన్న ఆసుపత్రులు ఈ లిస్టులో ఉన్నాయో లేదో చూసుకోవడం మంచిది. ఇతర ఆసుపత్రులలో చికిత్స అవసరం పడితే, సొంత డబ్బులు ఖర్చు పెట్టి, తర్వాత రీయింబర్స్‌ చేసుకోవలసి వస్తుంది. అందుచేత సాధ్యమైనన్ని ఎక్కువ నెట్‌వర్క్‌ ఆసుపత్రులను కలిగి ఉన్న బీమా కంపెనీలోనే ఆరోగ్య బీమాను తీసుకోవడం మంచిది.

గ్రూప్‌ ఇన్సూరెన్స్‌

చాలా మందికి తాము పనిచేసే సంస్థల్లో ఆయా యజమానులు ఆరోగ్య, జీవిత బీమా సౌకర్యాలను కల్పిస్తారు. కానీ, సంస్థలు అందించే గ్రూప్‌ ఇన్సూరెన్స్‌లో చాలా తక్కువ కవరేజీ ఉంటుంది. తీవ్రమైన అనారోగ్యాలు కలిగినప్పుడు అయ్యే ఖర్చులకు ఇవి ఏ మాత్రం సరిపోవు. అంతేకాకుండా పనిచేసే సంస్థను విడిచిపెట్టినప్పుడు కవరేజీ కూడా ముగుస్తుంది. రిటైర్‌మెంట్‌ తర్వాత కొత్తగా పాలసీ తీసుకుంటే నిబంధనలు, షరతులు చాలా ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి, కేవలం గ్రూప్‌ ఇన్సూరెన్స్‌పై ఆధారపడితే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ ఉన్నా సరే సొంతంగా ఆరోగ్య, జీవిత బీమాలను కలిగి ఉండడం మంచిది. కనీసం బేస్ పాలసీపై టాప్-అప్/సూపర్ టాప్-అప్ పాలసీ ఎంచుకోవాలి.

పాలసీ వ్యవధి

టర్మ్‌ ప్లాన్‌ను ఎంచుకున్నప్పుడు పాలసీదారులు చేసే అత్యంత సాధారణ తప్పు తక్కువ కాలవ్యవధికి పాలసీని ఎంపిక చేసుకోవడం. ఉదాహరణకు మీరు 25 ఏళ్ల వయసులో 20 ఏళ్ల కాలవ్యవధితో టర్మ్‌ ప్లాన్‌ తీసుకుంటే అది 45 ఏళ్ల వయసు వరకు వర్తిస్తుంది. ఆ తరువాత పాలసీ ముగుస్తుంది. ఆ సమయంలో ఇంకొక పాలసీని తీసుకుంటే పెరిగిన వయసుకు తగ్గట్టుగా ప్రీమియం ఖర్చును భరించవలసి ఉంటుంది. ఇది ఆర్థికంగా నష్టం చేకూరుస్తుంది. అందుచేత తగిన నిబంధనలతో పదవీ విరమణ పొందేవరకు లేదా 60 ఏళ్ల వయసు వరకు కవర్‌ చేసే పాలసీని తక్కువ వయసులోనే ఎంచుకోవాలి.

చివరిగా: బీమాను ఖర్చుతో కూడిన పథకంగా చూడకూడదు. రక్షణ సాధనంగా చూడాలి. ఇది కూడా ముందు జాగ్రత్త మదుపుతో సమానం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని