Home Loan: ఇల్లు కొంటున్నారా?

Eenadu icon
By Business News Desk Updated : 14 Mar 2025 03:02 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

సొంతిల్లు.. అందరి కల. గృహరుణం వడ్డీ రేట్లు కాస్త అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో చాలామంది ఈ కలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఇంటి కొనుగోలు కోసం రుణం తీసుకోవడం ఇప్పుడు సులభమే. ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు పరిశీలించాల్సిన అంశాలు చాలానే ఉంటాయి. చిన్న పొరపాటు చేసినా.. మీ ఇతర ఆర్థిక లక్ష్యాలన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే, సొంతిల్లు కొనాలనే ఆలోచన ఉన్న వారు ముందుగానే కొన్ని ప్రణాళికలతో సిద్ధం కావాలి. 

కొన్నింటిని సాధించాలంటే.. మరికొన్ని త్యాగం చేయాలి. ఇల్లు తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ఈ సూత్రం మర్చిపోవద్దు. పెరుగుతున్న ఆర్థిక బాధ్యతల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 
ఖర్చులు తగ్గాలి: ఇల్లు కొనాలనే ఆలోచన వచ్చిన క్షణం నుంచీ ఖర్చుల మీద నియంత్రణ సాధించేందుకు ప్రయత్నించాలి. గృహరుణం తీసుకున్న తర్వాత ఒక్కసారిగా నెలవారీ వాయిదాల భారం వచ్చి చేరుతుంది. దీన్ని తట్టుకోవాలంటే.. ఇప్పుడు మీరు చేస్తున్న ఖర్చును కనీసం 25-40 శాతం వరకూ తగ్గించుకునే విధంగా ప్రణాళిక ఉండాలి. ఇప్పటికే ఒక జీవనశైలి అలవాటు ఉంటుంది. కొత్తగా మార్చుకోవాలంటే అంత సులభం కాదు. భవిష్యత్తులో వచ్చే ఆర్థిక లోటును తీర్చేందుకు కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపోయే మొత్తం అందుబాటులో ఉంచుకోవడం చాలా అవసరం. మీ కుటుంబం ఖర్చులు తగ్గించుకునే కొత్త జీవన శైలికి సర్దుబాటయ్యే వరకూ ఇది తోడ్పడుతుంది.
రుణ మొత్తం: ప్రస్తుతం బ్యాంకులు ఆస్తి విలువలో 80 శాతం వరకూ రుణం అందిస్తున్నాయి. రుణం తీసుకునేటప్పుడు ఆస్తి విలువలో 20 శాతం చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలి. నిపుణుల సూచన ప్రకారం కనీసం 40 శాతం డౌన్‌ పేమెంట్‌ చెల్లిస్తే ఎంతో మేలు. మిగతా మొత్తాన్నే రుణంగా తీసుకోవాలి. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఖర్చులను పరిగణనలోకి తీసుకోవడం మర్చిపోవద్దు. ఇవి మొత్తం ఇంటి వ్యయంలో 5-10 శాతం వరకూ ఉంటాయి.
6 నెలల వరకూ: పిల్లల ట్యూషన్‌ ఫీజులు, బీమా ప్రీమియాలవంటి చెల్లింపుల జాబితాను తయారు  చేసుకోండి. కనీసం ఆరు నెలల ఆర్థిక బాధ్యతలను తీర్చేలా మీ దగ్గర తగిన మొత్తం అందుబాటులో ఉండాలి. సొంతిల్లు కొనుగోలు చేసిన తర్వాత ఇది ఒక తప్పనిసరి అవసరం. 
ఇప్పటికే ఉన్న అప్పులు: గృహరుణం తీసుకునే ముందు ఇప్పటికే ఉన్న అప్పులను ఒక చోట రాయండి. కారు, వ్యక్తిగత రుణాలు, కార్డు బిల్లులు, ఇతర చిన్న అప్పులవంటివి ఎన్ని ఉన్నాయో లెక్క తీయండి. గృహరుణం పెద్ద అప్పు. ఇది తీసుకున్నాక ఇతర రుణాలకు వాయిదాలు చెల్లించడం కష్టం కావొచ్చు. హామీ లేని వ్యక్తిగత రుణాలను తీర్చేయడం ద్వారా గృహరుణ అర్హత పెరుగుతుంది. సిబిల్‌ స్కోరు బాగుంటే వడ్డీ మొత్తం తగ్గుతుంది.
మూడు నెలల ఈఎంఐ: ఇంటి రుణానికి చెల్లించాల్సిన మూడు నెలల ఈఎంఐ మొత్తం ఎప్పుడూ బ్యాంకు ఖాతాలో ఉండేలా చూసుకోవాలి. సకాలంలో వాయిదాలు చెల్లించకపోతే అపరాధ రుసుముల భారం మోయాల్సి ఉంటుంది. అందుకే ఈ ఏర్పాటు. 
గృహోపకరణాలు: ఇల్లు కొన్న తర్వాత ఇంటీరియర్స్, ఫర్నిచర్‌లాంటి ఖర్చులూ ఉంటాయి. వీటికోసం ముందుగానే తగిన బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవాలి. 
ఆదాయ పరిస్థితి: గృహరుణం తీసుకున్న తర్వాత క్రమం తప్పని ఆదాయ వనరు ఉండేలా చూసుకోవాలి. ఉద్యోగ స్థిరత్వం లేని వారు 
కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అవసరమైతే కొనుగోలు నిర్ణయాన్ని కొన్నాళ్లు వాయిదా వేసుకోవాలి. 
అత్యవసర నిధి: జీవితం అంటేనే అనిశ్చితి. కాబట్టి, అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు ఆదుకునేలా కనీసం ఆరు నెలల అత్యవసర నిధిని అందుబాటులో పెట్టుకోవాలి. ఇందుకోసం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్లలో లిక్విడ్‌ ఫండ్లలాంటివి ఎంచుకోవాలి.

Tags :
Published : 14 Mar 2025 02:58 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు