Yes bank stake sale: యెస్‌ బ్యాంకులో వాటాల విక్రయం.. 13% వదులుకోనున్న ఎస్‌బీఐ

Eenadu icon
By Business News Team Updated : 09 May 2025 20:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Yes bank stake sale | దిల్లీ: ప్రైవేటు రంగానికి చెందిన యెస్‌ బ్యాంకులో (Yes bank) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో (SBI) పాటు మరో ఏడు బ్యాంకులు తమ వాటాల్ని వదులుకోనున్నాయి. జపాన్‌కు చెందిన సుమిటోమో మిట్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC)కి రూ.13,483 కోట్లకు తమ వాటాను విక్రయించనున్నాయి. ఈ విక్రయం ద్వారా యెస్‌ బ్యాంకులో ఎస్‌ఎంబీసీ అతిపెద్ద వాటాదారుగా నిలవనుంది. భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఇదే కానుంది.

సంక్షోభంలోకి వెళ్లిన యెస్‌ బ్యాంకును 2020లో ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల బృందం అందులోని వాటాలు కొనుగోలు చేశాయి. 24 శాతం వాటాతో ఎస్‌బీఐ అతిపెద్ద వాటాదారుగా నిలిచింది. అందులో 13.19 శాతం వాటాలను తాజాగా రూ.8,888.97 కోట్లకు విక్రయించనుంది. ఇంకా 10 శాతం వాటా మిగిలి ఉంటుంది. ఎస్‌బీఐతో పాటు అప్పట్లో వాటాలు కొనుగోలు చేసిన వాటిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (2.75%), ఐసీఐసీఐ బ్యాంక్‌ (2.39%), కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ (1.21%), యాక్సిస్‌ బ్యాంక్‌ (1.01%), ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ (0.92%), ఫెడరల్‌ బ్యాంక్‌ (0.76%), బంధన్‌ బ్యాంక్‌ (0.70%) ఉన్నాయి. ఇప్పుడు ఆయా బ్యాంకులన్నీ కలిసి 6.81 శాతం మేర వాటాను రూ.4,594 కోట్లకు విక్రయించనున్నాయి. 

ఒక్కో ఈక్విటీ షేరును రూ.21.50 శాతం ధరకు విక్రయించనున్నట్లు ఎస్‌బీఐ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. రిజర్వ్‌ బ్యాంక్‌, కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదానికి లోబడి ఈ లావాదేవీ పూర్తి కానుంది. ఈ డీల్‌ పూర్తయితే యెస్‌ బ్యాంక్‌ మరింత వృద్ధి దిశగా పయనించే అవకాశం ఉంటుందని యెస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ప్రశాంత్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఎస్‌ఎంబీసీ వంటి అంతర్జాతీయ బ్యాంకింగ్‌ దిగ్గజం నుంచి ప్రపంచస్థాయి నైపుణ్యాలు, పాలనా ప్రమాణాలు తమకు ప్రయోజనం చేకూరుస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఎంబీసీ మాతృ సంస్థ అయిన సుమిటోమో మిట్సుయ్ ఫైనాన్షియ్‌ గ్రూప్‌ (SMFG) జపాన్‌లో రెండో అతిపెద్ద బ్యాంకింగ్‌ గ్రూప్‌. ఎస్‌ఎంబీసీతో పాటు, ఎస్‌ఎంఎఫ్‌జీ ఇండియా క్రెడిట్‌ కంపెనీ లిమిటెడ్‌ ఇప్పటికే దేశీయంగా సేవలందిస్తున్నాయి.

Tags :
Published : 09 May 2025 20:01 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని