Gold Bonds: త్వరలో పసిడి బాండ్ల సబ్‌స్క్రిప్షన్‌.. ఆన్‌లైన్‌లో ఎలా కొనాలి?

Sovereign Gold Bond: సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఫిబ్రవరి 12న ప్రారంభం కానుంది. ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు.

Updated : 06 Feb 2024 17:47 IST

Sovereign Gold Bond | ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగారంలో మదుపు చేయాలనుకునే వారి కోసం కేంద్రం తీసుకొచ్చిన సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ (Sovereign Gold Bond) సబ్‌స్క్రిప్షన్‌ త్వరలో ప్రారంభం కానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సబ్‌స్క్రిప్షన్‌ (2023-24 సిరీస్‌ IV) ఫిబ్రవరి 12న ప్రారంభమై.. 16 వరకు అందుబాటులో ఉంటుంది. బంగారం ధరను త్వరలో ఆర్‌బీఐ ఖరారు చేయనుంది.

సబ్‌స్క్రిప్షన్‌ ముందు వారం చివరి మూడు పనిదినాల్లో 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ నిర్ణయించిన సగటు ధర ఆధారంగా గ్రాము రేటును ఆర్‌బీఐ నిర్ణయిస్తుంది. కనీసం 1 గ్రాము ఒక యూనిట్‌ కింద కొనుగోలు చేయాల్సిఉంటుంది. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్ఛేంజీల (NSE, BSE) ద్వారా SGB కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ కొనుగోలుపై రూ.50 డిస్కౌంట్‌ లభిస్తుంది.

Explained: పేటీఎంకు ఏమైంది?

సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను నివాసితులు, ట్రస్ట్‌లు, హెచ్‌యూఎఫ్‌లు, స్వచ్ఛందసంస్థలు కొనుగోలు చేయొచ్చు. మైనర్ల తరఫున ఒక వ్యక్తి లేదా ఇతర వ్యక్తులతో జాయింట్‌గా కూడా కొనొచ్చు. బాండ్‌ నామమాత్రపు విలువపై సంవత్సరానికి 2.50% ఫిక్స్‌డ్‌ రేటుతో అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. బాండ్ల కాలవ్యవధి 8 ఏళ్లు. బాండ్ల మెచ్యూరిటీపై వచ్చే మూలధన లాభాలపై SGB పన్ను మినహాయింపును అందిస్తుంది. మూడేళ్ల ముందు బాండ్లను విక్రయిస్తే.. స్వల్పకాలిక మూలధన లాభాల కింద మీకు వర్తించే శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బంగారంలో పెట్టుబడి పెట్టేవారు గోల్డ్‌ బాండ్లను పరిశీలించొచ్చు.

ఆన్‌లైన్‌లో కొనుగోలు ఎలా?

  • మీ నెట్‌బ్యాంకింగ్‌కు (ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంక్‌) లాగిన్‌ అవ్వండి.
  • మెనూలో ఈ సర్వీసెస్/ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే సెక్షన్‌లో ‘సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌’ ఆప్షన్‌ ఎంచుకోండి. (స్కీమ్‌ అందుబాటులో ఉన్నప్పుడు ఈ విండో తెరుచుకుంటుంది)
  • టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ చదివి తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్‌ చేయండి.
  • సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌కు అవరమైన వివరాలు ఇచ్చి డిపాజటరీ పార్టిసిపేట్‌ (ఎన్‌ఎస్‌డీఎల్‌ లేదా సీడీఎస్‌ఎల్‌)ను ఎంచుకోండి.
  • తర్వాత రిజిస్ట్రేషన్‌ ఫారాన్ని సమర్పించండి. 
  • రిజిస్ట్రేషన్‌ తర్వాత పర్చేజ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది.
  • మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న యూనిట్లు, నామినీ వివరాలు ఇవ్వాలి.
  • మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయడం ద్వారా ప్రక్రియ పూర్తవుతుంది. 

ఇలా కూడా చేయొచ్చు..

నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా మాత్రమే కాకుండా ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ వెబ్‌సైట్‌, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (SHCIL), స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయలేనివారు దగ్గర్లోని బ్యాంక్‌ శాఖ, ఎంపిక చేసిన పోస్టాఫీసుకు వెళ్లి ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. మీకు కావాల్సిన యూనిట్లను అందులో పొందుపరిచి చెక్‌, డీడీ రూపంలో పేమెంట్‌ పూర్తి చేయాలి. ఆధార్‌, పాన్‌ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని