Crime: థ్రిల్‌ కోసం డ్రగ్స్‌ వినియోగం.. ఓవర్‌ డోస్‌ కావడంతో యువతి మృతి

డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌ కారణంగా ఓ 18 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన లఖ్‌నవూలోని తివారీగంజ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Published : 10 Apr 2024 16:37 IST

లఖ్‌నవూ: డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌ కారణంగా 18 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన లఖ్‌నవూలోని తివారీగంజ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసే ఓ యువతి(18)  ఏప్రిల్ 3న లఖ్‌నవూలోని తన ఇంటికి వెళ్లింది. అనంతరం ఏప్రిల్ 7న ఆమె బెంగళూరుకు తిరుగు ప్రయాణమైన సమయంలో తన స్నేహితుడు వివేక్ మౌర్యను కలిసింది.  వారు ఓ ఖాళీ ప్లాట్‌కు వెళ్లారు. డ్రగ్స్‌ తీసుకుంటే థ్రిల్‌ వస్తుందని వివేక్‌ ఆ యువతికి ఓ సిరంజిని ఇంజెక్ట్‌ చేశాడు. డ్రగ్స్‌ మోతాదు ఎక్కువ కావడంతో కొంతసేపటికి ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకుంది. దీంతో భయపడిన యువకుడు తానూ మత్తులో ఉండడంతో పోలీసులకు ఫోన్‌ చేసి సహాయం కోరాడు. వారు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు.

ఈ విషయం తెలియగానే యువకుడు భయాందోళనకు గురై ఆసుపత్రి నుంచి పారిపోగా పోలీసులు అతడిని ఇందిరా కెనాల్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. విచారణలో గతంలో లఖ్‌నవూలోని న్యూ హైదరాబాద్ ప్రాంతంలోని వివేక్ ఇంట్లో ఆ యువతి కుటుంబం అద్దెకు ఉండేదని పోలీసులు గుర్తించారు. వివేక్‌ డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడని, ఆమెను కూడా మాదకద్రవ్యాలు తీసుకునేలా ప్రోత్సహించేవాడన్నారు.

యువకుడు ఉద్దేశపూర్వకంగా తమ కుమార్తెను హత్య చేసి ఉండవచ్చని యువతి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేశారు. కాగా నిందితుడు తన స్నేహితురాలే తనకు ఫోన్‌ చేసి డ్రగ్స్‌ తీసుకుందామని అడిగిందని తెలిపాడు. దాంతో తాను ఆమెను తివారీగంజ్‌లోని మరో స్నేహితుడి ఖాళీ ప్లాట్‌కి తీసుకెళ్లానన్నాడు. థ్రిల్‌ కోసం ఎక్కువ మోతాదు ఉన్న డ్రగ్‌ను మొదట తాను వేసుకుని, ఆ తర్వాత ఆ యువతికి ఇంజెక్ట్‌ చేశానన్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని