logo

మినీ భారతం.. పారిశ్రామిక ప్రాంతం

ఒక వైపు ప్రాణహిత.. మరో వైపు పెద్దవాగు జీవనదుల పరవళ్లు.. సిర్పూరు కాగితం మిల్లు(ఎస్పీఎం), సర్‌సిల్క్‌ మిల్లులతో పారిశ్రామిక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది సిర్పూరు- కాగజ్‌నగర్‌ నియోజకవర్గం.

Updated : 31 Oct 2023 06:38 IST

న్యూస్‌టుడే, కాగజ్‌నగర్‌

ఎస్పీఎం

ఒక వైపు ప్రాణహిత.. మరో వైపు పెద్దవాగు జీవనదుల పరవళ్లు.. సిర్పూరు కాగితం మిల్లు(ఎస్పీఎం), సర్‌సిల్క్‌ మిల్లులతో పారిశ్రామిక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది సిర్పూరు- కాగజ్‌నగర్‌ నియోజకవర్గం. ఉపాధి, వ్యాపారాల నిమిత్తం వివిధ రాష్ట్రాలకు చెందినవారు కాగజ్‌నగర్‌లో స్థిరపడ్డారు. భిన్న మతాల వారు ఉన్నప్పటికీ పండగలు, సాంస్కృతిక కార్యక్రమాలు కలిసిమెలసి జరుపుకొంటారు. భిన్న సంస్కృతి.. సంప్రదాయాలకు నిలయమైన కాగజ్‌నగర్‌ను మినీ భారత్‌గా పిలుస్తుంటారు. నియోజకవర్గం కేంద్రం సిర్పూర్‌(టి) అయినప్పటికీ అక్కడ కేవలం అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే స్వీకరిస్తారు. మిగతా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని పనులు కాగజ్‌నగర్‌లోనే కొనసాగుతున్నాయి.

1952లో నియోజకవర్గం ఆవిర్భవించింది. రాజకీయాలకు అతీతంగా ఏ ప్రాంతానికి చెందిన నేతలైనా ఆదరిస్తుంటారు ఇక్కడి ప్రజలు. పార్టీల కంటే వ్యక్తిత్వానికి ప్రాధాన్యమిస్తారు. శాసనసభ పునర్విభజన అనంతరం సిర్పూర్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. గతంలో 242 క్రమసంఖ్య ఉన్న నియోజకవర్గం నెంబర్‌ వన్‌ సిర్పూర్‌-001గా మారింది.

స్థానికేతరులకే మొగ్గు..

1952 నుంచి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలిసారి సోషలిస్టు పార్టీ నుంచి బుచ్చయ్య విజయం సాధించారు. ఆ తర్వాత ఆరు సార్లు కాంగ్రెస్‌, మూడుసార్లు తెదేపా, మూడుసార్లు భారాస, రెండు పర్యాయాలు స్వతంత్ర, ఒకసారి బీఎస్పీ పార్టీల అభ్యర్థులు గెలిచారు. 1957లో సిర్పూర్‌, చెన్నూరు ఉమ్మడిగా ఉండగా, జి.వెంకటస్వామి(ఎస్సీ) కాంగ్రెస్‌, రాజమల్లు(జనరల్‌) కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు అభ్యర్థులు గెలిచారు. 1962, 1967లో రెండు పర్యాయాలు జి.సంజీవరెడ్డి(హైదరాబాద్‌ నివాసి) విజయం సాధించారు. 1967లో కార్మికశాఖ మంత్రి అయ్యారు. 1972, 1978లో రెండుసార్లు కేవీ.కేశవులు(మంథని) విజయం సాధించగా, 1972లో చేనేత జౌళిశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1983, 1985లో రెండుసార్లు కేవీ నారాయణరావు(విజయవాడ) గెలుపొందారు. 1985లో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా అప్పటి సీఎం ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరుండేది. 1989, 1994 రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా పాల్వాయి పురుషోత్తంరావు(బెజ్జూరు) గెలుపొంది, ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1999లో తెదేపా అభ్యర్థిగా పాల్వాయి పురుషోత్తంరావు పోటీ చేయగా.. ఎన్నికలకు రెండురోజుల ముందు మావోయిస్టులు కాల్చి చంపారు. అనంతరం ఆయన సతీమణి పాల్వాయి రాజ్యలక్ష్మి(తెదేపా) నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009, 2010 రెండు సార్లు తెరాస(భారాస) కావేటి సమ్మయ్య విజయం సాధించారు. 2009 మే 16న జరిగిన ఎన్నికల్లో కావేటి సమ్మయ్య గెలుపొందగా, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2010 ఫిబ్రవరి 14న రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. ఆ సమయంలో 273 రోజుల పాటు ఎమ్మెల్యేగా కొనసాగారు. 2004, 2014, 2018లో కోనేరు కోనప్ప విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్‌, 2014లో బీఎస్పీ, 2018లో భారాస నుంచి పోటీ చేసి గెలుపొందారు.

నిజాం కాలంలో 1932లో కాగజ్‌నగర్‌లో రెండు భారీ పరిశ్రమలు సర్‌సిల్క్‌, ఎస్పీఎంలను స్థాపించారు.  నూలు వస్త్ర పరిశ్రమ(సర్‌సిల్క్‌) కొన్నేళ్లపాటు వస్త్రాల ఉత్పత్తిలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద పరిశ్రమగా పేరుండేది. 1982లో విద్యుత్తు, సాంకేతిక సమస్య కారణంగా మిల్లు మూతపడింది. రాష్ట్రంలోనే ఏకైక కాగితం పరిశ్రమ(ఎస్పీఎం). ఎన్నికల్లో ఎస్పీఎం కార్మికుల ఓట్లు కీలకం. మిల్లులో దాదాపు ఏడువేల మంది కార్మికులుండగా, వారి కుటుంబ సభ్యులతో కలిపి దాదాపు 20 వేల మందిపైనే ఉన్నారు.

17 గ్రామాలు.. 20 వేల ఓటర్లు

1965లో బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన కాందిశీకులు నియోజకవర్గంలోని పలు మండలాల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. 17 గ్రామాల్లో దాదాపు 20వేల ఓటర్లున్నారు. ఉపాధి నిమిత్తం ప్రభుత్వం అయిదెకరాల వ్యవసాయభూమి. ఎనిమిది గుంటల నివాస స్థలం కేటాయించింది. నియోజకవర్గంలో రాజకీయ ఫలితాలపై ప్రభావం చూపగలిగే బెంగాలీ ఓటర్లు కీలకం.

నియోజకవర్గ పరిధి:  కాగజ్‌నగర్‌ పురపాలిక,  కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూరు, పెంచికల్‌పేట, దహెగాం మండలాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని