logo

ఒక్క అవకాశం కోసం అడుగుతున్నాం : మంత్రి సీతక్క

‘ఆదిలాబాద్‌ నుంచి తొలిసారిగా ఆదివాసీ ఆడబిడ్డ, సామాన్య మహిళను పార్లమెంటుకు పంపిద్దాం.. ఒక్క అవకాశం ఇవ్వండి.. అన్ని జిల్లాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.. అందుకే సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాకు వస్తున్నారని..’ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క అన్నారు.

Published : 02 May 2024 02:48 IST

ఆసిఫాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : ‘ఆదిలాబాద్‌ నుంచి తొలిసారిగా ఆదివాసీ ఆడబిడ్డ, సామాన్య మహిళను పార్లమెంటుకు పంపిద్దాం.. ఒక్క అవకాశం ఇవ్వండి.. అన్ని జిల్లాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.. అందుకే సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాకు వస్తున్నారని..’ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. ఆసిఫాబాద్‌లో సీఎం సభ ఏర్పాట్లను డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, ఇతర నాయకులతో కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొని ప్రజల మద్దతు కోరనున్నారని తెలిపారు. ఆత్రం సుగుణను పార్లమెంటుకు పంపడం ద్వారా ఒక సాధారణ గిరిజన మహిళ, టీచరమ్మకు గౌరవాన్ని అందిద్దామని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మూడు చోట్ల మహిళా అభ్యర్థులకు అవకాశం ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో పార్టీ 14సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాను ఎన్నికల ఇన్‌ఛార్జిగానే కాకుండా ఉమ్మడి జిల్లా అభివృద్ధి పనులకు కూడా ఇన్‌ఛార్జిగా ఉన్నందున ముఖ్యమంత్రి సహకారంతో జిల్లా ప్రజలందరి సమస్యలు తీరుస్తానని హామీనిచ్చారు.

సీఎం సభకు తరలిరావాలి

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రచార సభకు ఆసిఫాబాద్‌, సిర్పూరు నియోజకవర్గాల నుంచి అశేషంగా ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మద్దతు తెలిపే పార్టీలు, ప్రజా సంఘాలు తరలిరావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. 30-35 వేల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నామన్నారు. నిర్మల్‌కు ఈ నెల 5న అగ్రనేత రాహుల్‌ గాంధీ రానున్నట్లు చెప్పారు. ముథోల్‌, బోథ్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల నుంచి కూడా ఆ సభకు తరలివచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్యాంనాయక్‌, నాయకులు మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్‌, అబ్దుల్లా తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని