logo

ప్రజాప్రతినిధుల తీరు.. నాయకుల బేజారు

జిల్లాలో ఇటీవల ఓ ప్రధాన పార్టీ సభ నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జనసమీకరణ బాధ్యతను ఆయా వార్డుల బాధ్యులకు అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్యను లక్ష్యంగా ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు.

Updated : 30 Apr 2024 06:51 IST

  • జిల్లాలో ఇటీవల ఓ ప్రధాన పార్టీ సభ నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జనసమీకరణ బాధ్యతను ఆయా వార్డుల బాధ్యులకు అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్యను లక్ష్యంగా ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ లక్ష్యం పూర్తి చేశారో లేదో తెలుసుకునే బాధ్యతను కిందిస్థాయి నాయకులకు అప్పగించారు. వారు అనుకూలంగా చెబితేనే పార్టీలో గుర్తింపు ఉంటుంది. లేదా మరొకరికి అవకాశం వస్తుందని చెప్పడం ఆయా వార్డు బాధ్యులకు మింగుడు పడటం లేదు.

  • జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి మెప్పు పొందేందుకు.. ఇతర నాయకులు, కార్యకర్తలు, ఇటీవల పార్టీలో చేరిన వారి గురించి నిత్యం చెడుగా చెబుతున్నారు. అదే నిజమంటూ ఆయన నమ్మడం వారికి ఇబ్బందిగా మారింది. అనర్గళంగా మాట్లాడుతున్నాడని, ఒక్క ఓటు కూడా వేయించలేని వ్యక్తి చెప్పే మాటలను పట్టించుకోవడం జీర్ణించుకోలేకపోతున్నారు.

  • జిల్లాలోని మరో నియోజకవర్గంలో ఒకే పార్టీకి చెందిన వారిలోనే అంతర్గతంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. పార్టీలో చేరామా..? లేదా ఒక వ్యక్తికి బానిసగా మారామా..? అనే సందిగ్ధం నెలకొంది. పట్టుబట్టి కండువా వేసుకునే వరకు వెంటపడ్డారు. ఇప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పలువురు పేరుపొందిన నాయకులే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం కనిపిస్తోంది.

  • ఇటీవల ఓ కాలనీకి చెందిన సమస్యతో పలువురు జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధిని సంప్రదించేందుకు వెళ్లగా వారికి చేదు అనుభవం ఎదురైనట్లు తెలిసింది. మీ ప్రాంతం నుంచి సహకారం ఏ మాత్రం లేదని, మరోసారి అనుకూలంగా వ్యవహరిస్తే పరిష్కార దిశగా ఆలోచన చేస్తామనడం వారిని కంగుతినిపించినట్లు సమాచారం. గెలిచిన తర్వాత తన పరిధిలో అభివృద్ధి బాధ్యత ఆయా వ్యక్తికే ఉంటుంది. కానీ ఒక్కో చోటును విడదీస్తూ పాలన కొనసాగించడం విడ్డూరంగా ఉందంటూ తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే: జిల్లాలో కొత్తగా మారిన రాజకీయ పరిణామాలతో ప్రధాన పార్టీల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పాత కొత్త నేతలు, కార్యకర్తల మధ్య వైరుధ్యాలు పొడసూపుతున్నాయి. కొందరు  బహిరంగంగా అసంతృప్తి వ్యక్తపరిస్తే మరికొందరు లోలోపల మదనపడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది సొంతలాభం కోసం పార్టీ వీడి అధికారపక్షం వైపు అడుగులు వేశారు. మరికొందరు తమ వార్డుల పరిధిలో అభివృద్ధి కోసమని చేరారు. చేరినా అంతగా  ప్రయోజనం లేనట్టే కనిపిస్తోంది. ఒక్కసారి కూడా వార్డు సభ్యుడిగా గెలవని వ్యక్తులు.. అనేక సార్లు ప్రజాతీర్పులో విజయం సాధించిన వారిపై పెత్తనం చూపించడం జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆ ఇద్దరినీ ప్రసన్నం చేసుకోవడమే పని..

జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి దగ్గర ఉన్న ఓ ఇద్దరు వ్యక్తులను ప్రసన్నం చేసుకోవడమే ప్రస్తుతం ఆ పార్టీ సీనియర్‌, జూనియర్‌ నాయకులు పనిగా పెట్టుకున్నట్లు సమాచారం. వారిని కాదని ప్రవర్తిస్తే.. అట్టడుగుకు వెళ్లాల్సిందే. ప్రస్తుతం పార్టీలో కొత్తగా చేరినా.. పాతవారు అయినా ముందుగా ఆ ఇద్దరి అనుమతితోనే ముందుకెళ్లాలి. వీరు పాస్‌ మార్కులు ఇస్తేనే ప్రస్తుత పదవికి ఎలాంటి ఆటంకం లేకపోవడంతోపాటు భవిష్యత్తులో అనుకున్న పదవి వస్తుందనే ఆశతో, మెప్పుకోసం కొంతమంది అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు. స్థాయిని మరిచి ప్రవర్తించడం తమతో కాదంటూ మరికొందరు పార్టీకే దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యవహారాలతోనే పార్టీకి, ఆ ప్రజాప్రతినిధికి నష్టం కలుగుతుందనే అభిప్రాయాలు జిల్లావ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని