logo

జిల్లాలో 30 పోలింగ్‌ కేంద్రాల మార్పు!

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.

Published : 19 Apr 2024 01:55 IST

మావోయిస్టుల ప్రభావంతో నిర్ణయం

ఈనాడు, పాడేరు - న్యూస్‌టుడే, సీలేరు, పాడేరు: సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడ దెబ్బతిన్న మావోయిస్టులు షెల్టర్‌ జోన్‌ ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో (ఏఓబీ) అడుగుపెట్టే ఆస్కారముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని అంచనా వేశాయి. ఇప్పటికే ఎన్నికలను బహిష్కరించమని మావోయిస్టులు పిలుపునిచ్చారు. మావోయిస్టు అగ్రనేత, సీనియర్‌ నాయకుడి ఆధ్వర్యంలో మారుమూల గ్రామాల్లో చాపకింద నీరులా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు నిఘా విభాగానికి సమాచారం అందడంతో ఏఓబీపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించారు. సరిహద్దు ప్రాంతాలన్నింటిపై నిఘా పెట్టారు. పెద్ద ఎత్తున గ్రేహౌండ్స్‌, స్పెషల్‌ పార్టీ బలగాలతో గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. ఒడిశా పోలీసులు, నిఘా విభాగం అధికారులతో సమన్వయం చేసుకుంటూ అల్లూరి జిల్లా పోలీసులు మావోయిస్టుల కదలికలపై దృష్టి సారించారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అభ్యర్థులు మావోయిస్టు ప్రభావిత గ్రామాలకు వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని పార్టీల నేతలకు సమాచారం ఇచ్చారు. సరిహద్దుల్లో ఉన్న వై.రామవరం-గూడెంకొత్తవీధి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు హెలికాప్టర్లు వాడాలని నిర్ణయించినట్లు తెలిసింది. జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 30 పోలింగ్‌ కేంద్రాలను సమీప గ్రామాలకు మార్చడానికి ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అల్లూరి జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా ‘ఈనాడు’తో చెప్పారు. పొరుగు రాష్ట్రంలో దెబ్బతిన్నారు కాబట్టి ఏఓబీలో ఆశ్రయానికి మావోయిస్టులు వచ్చే అవకాశం లేకపోలేదన్నారు. పోలీసు బలగాలతో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దులో అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలనే మార్పు చేశామని, వాటిపై స్థానిక ఓటర్లకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని