logo

మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది

వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్‌.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.

Updated : 19 Apr 2024 04:53 IST

బుచ్చెయ్యపేటలో రాజీనామా లేఖలు చూపుతున్న వాలంటీర్లు

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్‌.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఎన్నికల విధులతోపాటు తాత్కాలికంగా పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి వీరిని ఎన్నికల సంఘం పక్కన పెట్టింది. ఎన్నికల్లో తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవడానికి వైకాపా నాయకులు వాలంటీర్లతో రాజీనామా చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తెదేపా అధికారంలోకి వస్తే గ్రామ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ప్రకటించడం, వాలంటీర్లకు రూ.పది వేల గౌరవ వేతనం ఇస్తామని చెప్పడంతో కొంతమంది రాజీనామాలకు వెనుకాడుతున్నారు. ఈ క్రమంలో బుచ్చెయ్యపేట మండలంలో ఇప్పటివరకు ఎవరూ రాజీనామా చేయలేదు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో గురువారం కొందరు రాజీమానాలు చేశారు. మరికొన్ని గ్రామాలకు చెందిన వాలంటీర్లు శుక్రవారం చేయనున్నట్లు సమాచారం.

48 మంది వాలంటీర్ల రాజీనామా

కె.కోటపాడు: మండలంలో 48 మంది వాలంటీర్లు గురువారం రాజీనామా చేశారని ఎంపీడీఓ అప్పలరాజు పేర్కొన్నారు. లంకవానిపాలెంలో 4, చౌడువాడలో 31, సూదివలసలో 5, రొంగలినాయుడుపాలెం, పైడమ్మపేట గ్రామాలకు చెందిన ఇద్దరు, గొట్లాంలో ఆరు గురు రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారని చెప్పారు.

చీడికాడ, దేవరాపల్లి: చీడికాడ మండలం కోనాం సచివాలయ పరిధిలోని గ్రామ వాలంటీర్లు రాజీనామా చేశారు. వీరంతా ఎంపీడీఓ ఉమామహేశ్వరి, కార్యాలయ సూపరింటెండెంట్‌ కామేశ్వరరావుకు రాజీనామా లేఖలు అందజేశారు. దేవరాపల్లి మండలం కలిగొట్ల, వెంకటరాజుపురం, తామరబ్బ పంచాయతీలకు చెందిన 32 మంది గ్రామ వాలంటీర్లు రాజీనామా చేస్తూ ఆయా పంచాయతీ కార్యదర్శులకు లేఖలు ఇచ్చారు.

అచ్యుతాపురం: వైకాపా నాయకులు ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నా రాజీనామా చేయడానికి వాలంటీర్లు ససేమిరా అంటున్నారు. మండలంలో 467 మంది ఉండగా ఇప్పటివరకు సగం మంది కూడా రాజీనామాకు ముందుకు రాలేదు. మార్టూరు నుంచి అతికష్టం మీద గురువారం రాజీనామా పత్రాలను ఎంపీడీఓ కార్యాలయం ఏఓ కృష్ణకు అందించారు. వాలంటీర్లు వైకాపా నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నా అందుకు అంగీకరించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని