logo

గిరిజనులు చింత తీరేనా?

అల్లూరి జిల్లాలో ఈ ఏడాది చింతపండు దిగుబడులు గిరిజన రైతులను పూర్తిగా నిరాశపరిచాయి.

Published : 23 Apr 2024 02:40 IST

ధరల ప్రకటనలకే పరిమితమైన జీసీసీ

చింతపండు సేకరణలో గిరిజన మహిళ

చింతపల్లి, న్యూస్‌టుడే: అల్లూరి జిల్లాలో ఈ ఏడాది చింతపండు దిగుబడులు గిరిజన రైతులను పూర్తిగా నిరాశపరిచాయి. సహజంగా దిగుబడులు తగ్గితే ఏ పంటకైనా గిరాకీ ఏర్పడి ధరలు పెరుగుతాయి. కానీ చింతపండు విషయంలో భిన్నమైన పరిస్థితి. స్థానికంగా ఉన్న వ్యాపారులపైనే ధరలు ఆధారపడి ఉన్నాయి. గిరిజనులు పండించే పంటలు, సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకే తామున్నామంటూ భరోసా ఇచ్చే జీసీసీ (గిరిజన సహకార సంస్థ) నామమాత్రంగా మారింది. గతంలో చింతపండు విషయంలో గిరిజన సహకార సంస్థకు గుత్తాధిపత్యం ఉండేది. ఆ అధికారాలను కేంద్రం కొన్నేళ్ల కిందటే తొలగించింది. గిరిజన రైతులు పండించిన ఈ పంటను ఎవరికైనా అమ్ముకునే వెసులుబాటు కలిగింది. తేనె, నరమామిడిచెక్క, నల్ల జీడిపిక్కలు, కరక్కాయలు వంటి ఇతర అటవీ ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు చేస్తోంది. వాటితోపాటే చింతపండుకూ గిట్టుబాటు ధరను నిర్ధారించింది. కిలో పిక్క తీయనిది రూ.32.40, పిక్క తీసినది రూ.63గా మద్దతు ధరలు ప్రకటించింది.

వ్యాపారులే నయం

గిరిజన సహకార సంస్థ గిరిజన రైతుల నుంచి చింతపండును కొనుగోలు చేస్తామని ప్రకటనలు గుప్పించడం తప్ప కొనుగోళ్లను ఇప్పటివరకు ప్రారంభించలేదు. కేవలం గిట్టుబాటు ధరలను ప్రకటించి ఊరుకుంది. జీసీసీ ప్రకటించిన ధరలకు మించి బయట వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం వ్యాపారులు కిలో పిక్కతీయనిది కిలో రూ.40 వరకూ కొంటున్నారు. భవిష్యత్తులో దీని ధర మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో జీసీసీ నామమాత్రంగా మారింది. గిట్టుబాటు ధరలు కల్పించి జీసీసీ ద్వారా  పంట కొనుగోలు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.

గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నాం

గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిరిజన సహకార సంస్థ ద్వారా ఈ ఏడాది మెరుగైన గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నాం. గతంలో కిలో రూ.200 ఉండే తేనె ధర ప్రస్తుతం రూ.250కి పెంచాం. ఎండిన ఉసిరిపప్పును కిలో రూ.80కి కొనుగోలు చేస్తున్నాం. నల్లజీడి గింజలు, కరక్కాయలు కిలో రూ.18కు కొంటున్నాం. శీకాయ కిలో రూ.55, కుంకుడు కాయలు కిలో రూ.35కి కొంటున్నాం. చింతపండు విషయంలో మా సిబ్బందిపై ఒత్తిడి చేయడం లేదు. జీసీసీ ప్రకటించిన ధర కంటే ఎక్కువకు వ్యాపారులు కొంటే మాకు ఎటువంటి ఇబ్బందీ లేదు. అంతకు మించి తక్కువకు కొంటే అభ్యంతరం చెబుతాం. చెక్‌పోస్టుల్లో తగిన బిల్లులు చూపించి చింతపండును మైదాన ప్రాంతాలకు తరలించుకోవచ్చు. దళారుల వలలో చిక్కుకోవద్దని గిరిజనులకు సూచిస్తున్నాం.

దేవరాజు, జీసీసీ డీఎం, చింతపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని