logo

పదోతరగతి ఫలితాల్లో జిల్లాల ర్యాంకులు కిందికి!

పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే పెరిగినా రాష్ట్రస్థాయిలో విశాఖ, అనకాపల్లి జిల్లాల స్థానాలు మాత్రం దిగజారిపోయాయి.

Published : 23 Apr 2024 02:59 IST

ఈనాడు, అనకాపల్లి

దోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే పెరిగినా రాష్ట్రస్థాయిలో విశాఖ, అనకాపల్లి జిల్లాల స్థానాలు మాత్రం దిగజారిపోయాయి. అల్లూరి జిల్లాలో విద్యార్థులు సత్తా చాటడంతో ఆ జిల్లా స్థానం కాస్త మెరుగుపడింది. గతేడాది 82.68 శాతం ఉత్తీర్ణతతో విశాఖ జిల్లా మూడోస్థానంలో నిలవగా, ఈ ఏడాది ఉతీర్ణత 91.15 శాతానికి పెరిగినా జిల్లా ర్యాంకు ఎనిమిదో స్థానానికి పడిపోయింది. అనకాపల్లి జిల్లా గతేడాది 77.74 శాతం ఉత్తీర్ణతతో అయిదో స్థానంలో నిలిస్తే ఈ ఏడాది 89.04 శాతం ఉత్తీర్ణత నమోదు చేసినా, రాష్ట్ర స్థాయిలో జిల్లా ర్యాంకు 12వ స్థానానికి దిగజారిపోయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా గతేడాది 61.41 శాతం ఉత్తీర్ణతతో 24వ నిలవగా ఈసారి 90.95 శాతంతో తొమ్మిదో స్థానానికి ఎగబాకింది. మార్చి 18 నుంచి 28 వరకు జరిగిన పరీక్షలకు ఈ మూడు జిల్లాల నుంచి మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులు 60,291 మంది పరీక్షలకు హాజరైతే 54,485 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు.

  • 2019-20, 20-21 వరుస రెండేళ్లు పదోతరగతి పరీక్షలను కొవిడ్‌ కారణంగా నిర్వహించలేదు.. అందరు విద్యార్థులనూ ఉత్తీర్ణులు చేశారు.
  • గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రథమ శ్రేణిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
  • సబ్జెక్టు టీచర్ల కొరత, ఏడాది పొడవునా సిఫార్సు బదిలీలు చేపట్టడం, నాడు నేడు పనులపై చూపిన శ్రద్ధ బోధనపై అధికారులు చూపకపోవడంతో జిల్లా ర్యాంకులు పడిపోయినట్లు విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు.

పరీక్ష నాడే తండ్రి మృతి.. దిగమింగుకుని కుమారుడి ప్రతిభ

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: రాజవొమ్మంగి అల్లూరి సీతారామరాజు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి పరిశిక చరణ్‌ తేజ పబ్లిక్‌ పరీక్షల్లో జీవశాస్త్రం పరీక్ష రోజున తండ్రి బాలరాజు మృతి చెందాడు. అయినా పుట్టెడు దుఃఖంలో పరీక్షలు రాశాడు. సోమవారం విడుదలైన పరీక్ష ఫలితాల్లో చరణ్‌ ఉత్తీర్ణుడయ్యాడు. చరణ్‌ను ప్రధానోపాధ్యాయుడు గోపాలకృష్ణ, పీఎంసీ ఛైర్మన్‌ వీరబాబు, ఉపాధ్యాయులు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని