logo

విచారణకు పిలిచి చితకబాదిన ఎస్సై?

సోదరుల ఘర్షణ కేసులో విచారణకు పిలిచిన ఎస్సై కులం పేరుతో దూషించి.. లాఠీతో చితకబాదారని   రామకుప్పం మండలం వీర్ణమల తండాకు చెందిన వెంకటేశ్‌నాయక్‌ ఆరోపించారు.

Updated : 17 May 2024 06:22 IST

కులం పేరుతో దూషించారని దళితుల ఆరోపణ

రామకుప్పం, న్యూస్‌టుడే: సోదరుల ఘర్షణ కేసులో విచారణకు పిలిచిన ఎస్సై కులం పేరుతో దూషించి.. లాఠీతో చితకబాదారని   రామకుప్పం మండలం వీర్ణమల తండాకు చెందిన వెంకటేశ్‌నాయక్‌ ఆరోపించారు. గురువారం అతనిపై రామకుప్పం స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాల మేరకు.. తండాకు చెందిన ముగ్గురు సోదరులు వెంకటేశ్‌నాయక్‌, షణ్ముక నాయక్‌, లోకేంద్రనాయక్‌ బెంగళూరులో కంప్రెషర్‌ వాహనం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. సోమవారం పోలింగ్‌ సందర్భంగా అందరు ఇంటికి వచ్చారు. ముగ్గురు కుటుంబాలు వారి తండ్రి ఇచ్చిన పొలంలోనే వేర్వేరుగా ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారు. వెంకటేశ్‌నాయక్‌.. బెంగళూరులో వచ్చే పనుల్లో కొన్నింటిని చిన్నవాడైన లోకేంద్రనాయక్‌కు ఇచ్చేవారు. దీన్ని మనసులో పెట్టుకున్న మరో సోదరుడు షణ్ముకనాయక్‌ అన్న వెంకటేశ్‌నాయక్‌పై కక్ష పెంచుకున్నారు. అతనిపై దాడి చేసేందుకు మంగళవారం రాత్రి కత్తులకు సాన పెడుతుండగా సోదరుడు గమనించి ప్రశ్నించారు. నిన్ను చంపడానికే అని సమాధానం చెబుతూ కుటుంబ సభ్యులతో దాడి చేశారు. దాడిలో వెంకటేశ్‌నాయక్‌ కుమారుడు ఠాగూర్‌నాయక్‌ గాయపడ్డారు. దీనిపై  వెంకటేశ్‌నాయక్‌ స్థానిక పోలీసులు ఫిర్యాదు చేయగా ఎస్సై శివకుమార్‌ కేసు నమోదు చేశారు. అనంతరం ముగ్గురు సోదరులను ఎస్సై విచారణ పేరుతో పిలిపించారు. మిగిలిన ఇద్దరు సోదరుల ఎదుటే కులం పేరుతో దూషిస్తూ.. లాఠీతో చితకబాదారని వెంకటేశ్‌నాయక్‌ ఎస్సైపై ఆరోపణలు చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చి ప్రశ్నించిన తెదేపా ఎస్టీ సెల్‌ నాయకుడు కృష్ణానాయక్‌పైనా ఎస్సై దౌర్జన్యం చేసి, ప్రశ్నిస్తే నిన్ను కూడా లోపల వేస్తా అని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరోపణలపై ఎస్సై శివకుమార్‌ను వివరణ కోరగా ఆరోపణలను కొట్టిపారేశారు. కృష్ణానాయక్‌ అనచరులు పలువురు సారా తయారీ చేస్తూ పట్టుబడ్డారని, వారిని విడిచిపెట్టాలని ఒత్తిడి చేశారని వివరించారు. అందుకు మేము ఒప్పుకోకపోవడంతో గిరిజనులతో ఇలా ఆరోపణలు చేయిస్తున్నారని వివరించారు.

చర్యలు తీసుకోకపోతే నిరసన

దళితులు, గిరిజనులపై దాడులు చేస్తున్న రామకుప్పం ఎస్సై శివకుమార్‌పై చర్యలు తీసుకోకపోతే నిరసన చేపడతామని తెదేపా ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునస్వామి, జిల్లా కార్యదర్శి జయశంకర్‌, మాజీ జడ్పీటీసీ సభ్యుడు బాలాజీ నాయక్‌, జిల్లా అద్యక్షుడు కృష్ణానాయక్‌ గురువారం పేర్కొన్నారు. ఆదివారం లోపు చర్యలు తీసుకోవాలని విలేకర్ల సమావేశంలో డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు