కాళ్ల చిరచిరకు సమర్థ చికిత్స

కాళ్లలో చిరచిర బాగా ఇబ్బంది పెడుతుంది. కాళ్లలో ఏదో పాకుతున్నట్టు అనిపించటం, కదిలించలేకుండా ఉండకపోవటం చాలా చిరాకు కలిగిస్తాయి.

Published : 11 Jun 2024 00:17 IST

కాళ్లలో చిరచిర బాగా ఇబ్బంది పెడుతుంది. కాళ్లలో ఏదో పాకుతున్నట్టు అనిపించటం, కదిలించలేకుండా ఉండకపోవటం చాలా చిరాకు కలిగిస్తాయి. ఈ లక్షణాలు కొందరికి ఎప్పుడో అప్పుడే కనిపిస్తే.. మరికొందరికి రోజూ తలెత్తొచ్చు. ఇవి సాయంత్రం వేళ, రాత్రిపూట ఎక్కువవుతూ ఉంటాయి కూడా. దీంతో నిద్ర సరిగా పట్టక సతమతమవుతుంటారు. ప్రతి పది మందిలో ఒకరు కాళ్ల చిరచిరతో బాధపడుతుంటారు. వీరిలో 2 నుంచి 3% మందిలో సమస్య తీవ్రంగానూ ఉంటుంది. దీనికి కారణమేంటన్నది ఇప్పటికీ కచ్చితంగా తెలియదు. కానీ దీంతో బాధపడేవారిలో కుంగుబాటు, ఆందోళన, గుండెజబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఇతరత్రా సమస్యలూ కనిపిస్తుంటాయి. కాళ్ల చిరచిర ముప్పు పెరగటానికి దోహదం చేసే 22 జన్యు భాగాలను గత అధ్యయనాలు గుర్తించాయి. అయినప్పటికీ దీనికి సంబంధించి జీవసూచికలు మాత్రం బయటపడలేదు. వీటిని గుర్తించగలిగితే కాళ్ల చిరచిర నిర్ధరణకు ఉపయోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పరిశోధకుల బృందం నిర్వహించిన భారీ జన్యు అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇందులో కొత్తగా 140 జన్యు ముప్పు భాగాలు బయట పడ్డాయి. మగవారిలో కన్నా ఆడవారిలో కాళ్ల చిరచిర ఎక్కువే అయినా జన్యు విశ్లేషణలో ఎలాంటి తేడాలూ కనిపించకపోవటం విచిత్రం. జన్యువులే కాకుండా హార్మోన్ల వంటి ఇతరత్రా అంశాలూ ఇందులో పాలు పంచుకుంటుండొచ్చని ఇది సూచిస్తోంది. నాడులు, మెదడు పనితీరులో కీలక పాత్ర పోషించే గ్లుటమేట్‌ రిసెప్టర్‌ 1, 4 అనే జన్యువుల్లో తేడాలు ఉంటున్నట్టూ పరిశోధకులు గుర్తించారు. మూర్ఛను తగ్గించటానికి ప్రస్తుతం వాడుతున్న రెండు మందులతో వీటిని నియంత్రించే అవకాశం ఉండటమూ గమనార్హం. కాళ్ల చిరచిరను ఇవి బాగా తగ్గిస్తున్నట్టు ఇప్పటికే తొలి ప్రయోగ పరీక్షల్లో వెల్లడైంది కూడా. వయసు, లింగ భేదం, జన్యు సూచికల ఆధారంగా కాళ్ల చిరచిర ముప్పు పొంచి ఉన్నవారిని కచ్చితంగా గుర్తించొచ్చనీ పరిశోధకులు చెబుతున్నారు. ఇది విస్తృతంగా అందుబాటులోకి వస్తే చికిత్స తేలిక కాగలదు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని