logo

ఐదేళ్లు.. రూపాయి విదిల్చితే ఒట్టు!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శరవేగంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ వేలు నిర్మితమవుతున్నాయి. తక్కువ సమయంలో మహా నగరాలకు చేరుకుంటున్నాం.

Updated : 19 May 2024 07:50 IST

ముగ్గురు ఎంపీలూ శ్రద్ధచూపని వైనం
రైల్వే ప్రాజెక్టులకు సహకరించని రాష్ట్ర ప్రభుత్వం

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శరవేగంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ వేలు నిర్మితమవుతున్నాయి. తక్కువ సమయంలో మహా నగరాలకు చేరుకుంటున్నాం. సమర్థమంతమైన మానవ వనరులు, సరిపడా భూమి, తక్కువ దూరంలోనే చెన్నై, బెంగళూరు వంటి నగరాలున్నందున భవిష్యత్తులో పారిశ్రామికంగా పురోగమిస్తుంది. రైల్వే ప్రాజెక్టులు పూర్తయితే పారిశ్రామికవేత్తలు మరింతగా ముందుకు వస్తారు. కానీ జగన్‌ ప్రభుత్వం మాత్రం ఇది తమకు ప్రాధాన్య అంశం కాదన్నట్టుగా వ్యవహరించడం జిల్లా ప్రజలకు శాపంగా మారింది. కేంద్రం స్పందించి తన వాటా నిధులు ఇస్తామని.. జగన్‌ సర్కార్‌ స్పందించాలని పార్లమెంటులో పదేపదే కోరినా పట్టించుకోలేదు. ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు ఎంపీలున్నా ముఖ్యమంత్రిని ఒప్పించడంలో విఫలమయ్యారు. రాజంపేట, చిత్తూరు,  తిరుపతి ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, గురుమూర్తిలు రైల్వే ప్రాజెక్టుల అంశంలో ఐదేళ్ల కాలంలో ఏం సాధించలేకపోయారు.  

 

శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్‌

ఈనాడు, చిత్తూరు: రాష్ట్ర విభజనకు ముందు 2010-11లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నడికుడి- శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ను మంజూరు చేసింది. ఇది అందుబాటులోకి వస్తే అటు సికింద్రాబాద్‌- గుంటూరు, గూడూరు- కాట్పాడి లైన్లు కలుస్తాయి. ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించడంతోపాటు సరకు రవాణా వేగవంతమవుతుందని భావించారు. 308.7 కి.మీ మేర సాగే ఈ మార్గానికి రూ.2,643.35 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. అందులో 50 శాతం నిధులు అంటే రూ.1,321.67 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని రైల్వేశాఖ అప్పట్లోనే సూచించింది. భూసేకరణ ఖర్చు మొత్తాన్నీ భరించాలని స్పష్టం చేయగా అందుకూ అంగీకరించింది. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే మార్గం ప్రస్తుత తిరుపతి జిల్లాలోని వెంకటగిరి మీదుగా శ్రీకాళహస్తి వరకు వస్తుంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద కేవలం రూ.6 కోట్లు మాత్రమే ఇచ్చింది. రూ.1,315.50 కోట్లు ఇంకా చెల్లించాలి. భూసేకరణపై కూడా ఎటువంటి శ్రద్ధ చూపలేదు. దీంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ముగ్గురు ఎంపీలు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేసి ఉంటే అయిదేళ్లలో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు సాగేవి.

చిత్తూరు- కాట్పాడి  మధ్య రైల్వేట్రాక్‌  

పులివెందుల మీదుగా మళ్లించాలని కొర్రీ

ఈ మార్గం పనుల పూర్తికి రూ.3,038 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. భూసేకరణ వ్యయాన్ని పూర్తిగా, నిర్మాణ ఖర్చులో 50 శాతం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వానికి వరకు రూ.2,849 కోట్ల వ్యయమవుతుండగా అందులో రూ.1,425 కోట్లు వాటాగా ఇవ్వాలి. విడుదల చేసింది రూ.190 కోట్లే. ఇది పూర్తయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు వేగంగా బెంగళూరు నగరానికి చేరుకోవచ్చు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఈ మార్గాన్ని పులివెందుల మీదుగా మళ్లించాలని కేంద్రానికి లేఖ రాశారు. జిల్లా ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతున్నా ముగ్గురు ఎంపీలు నోరు మెదపలేదు.

మార్గం: కడప- బెంగళూరు
మంజూరు: 2008-09లో
విస్తీర్ణం: 268 కి.మీ

రూ.40 కోట్లతో డబుల్‌ లైన్‌ సాధ్యమా?

ధర్మవరం- పాకాల- కాట్పాడి రైల్వేలైన్‌ను డబుల్‌ లైన్‌గా మార్చాలన్నది చిత్తూరు జిల్లా ప్రజల ఆకాంక్ష. 2020 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సర్వే కోసం రూ.3.62 కోట్లు మంజూరు చేశారు. అనంతరం 290 కి.మీ మేర ఉన్న ఈ మార్గంలో డబ్లింగ్‌ చేపట్టేందుకు రూ.2,900 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. 2023- 24 బడ్జెట్‌లో కేవలం రూ.40 కోట్లు ఇచ్చారు. ఇలా అరకొరగా నిధులు విదిల్చితే డబుల్‌ లైన్‌ పనులు ఎప్పుడు పూర్తవుతాయనే ప్రశ్న ప్రయాణికుల నుంచి వస్తోంది. ఎంపీలు చొరవ చూపింటే నిధులు వచ్చేవన్నది ప్రజల అభిప్రాయం.

పరిహారం జమకాక..

చెన్నై- బెంగళూరు ప్రధాన రైల్వేలైన్‌లో కుప్పం- మారికుప్పం మధ్య 23.7 కి.మీ. మేర కొత్త ట్రాక్‌ నిర్మాణానికి 2011లో రైల్వేశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కర్ణాటకలో జరిగినట్లుగా మన జిల్లాలో పరిహారం జమ చేయకపోవడంతో నెమ్మదిగా పనులు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు