logo

రైతు భరోసా.. సేవల్లో నిరాశ

చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉండదనే విషయం వైకాపా పాలన ప్రారంభంలోనే రైతులకు అర్థమైపోయింది.. ఆర్‌బీకేల ద్వారా సాగు సలహాలు, సేవలందకపోయినా అన్ని రకాల ఎరువులు, విత్తనాలు అందుబాటులో లేకపోయినా.. ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉత్పత్తుల రక్షణకు ముఖం చాటేసినా పంటి బిగువున భరించారు.. నష్టాలు చూడని రైతులు లేరు..

Updated : 20 May 2024 04:38 IST

అంతా ఆర్భాటమే
కానరాని పురుగు మందులు, సాగు సలహాలు
నిద్రపోతున్న వ్యవసాయ శాఖ
 న్యూస్‌టుడే, చిత్తూరు (వ్యవసాయం)

చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉండదనే విషయం వైకాపా పాలన ప్రారంభంలోనే రైతులకు అర్థమైపోయింది.. ఆర్‌బీకేల ద్వారా సాగు సలహాలు, సేవలందకపోయినా అన్ని రకాల ఎరువులు, విత్తనాలు అందుబాటులో లేకపోయినా.. ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉత్పత్తుల రక్షణకు ముఖం చాటేసినా పంటి బిగువున భరించారు.. నష్టాలు చూడని రైతులు లేరు.. త్వరలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానుంది.. ఇప్పటివరకు వ్యవసాయశాఖ అధికారులకు సరైన ప్రణాళికలు లేకపోవడం, సాగు ప్రోత్సాహకాల్లో కోతపడటం తదితర చర్యలతో ఇప్పుడెన్ని అవస్థలు పడాల్సి వస్తుందోనన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.

అన్నదాతకు అవసరమైన అన్ని సేవలు ‘రైతు భరోసా’ కేంద్రాల్లోనే అందిస్తాం. ఆ పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఎరువులు, పురుగు మందుల విక్రయాలు మొదలు అన్ని పంట ఉత్పత్తుల కొనుగోళ్లు వరకు
అన్ని సేవలు ఇక్కడే.

వైకాపా ప్రభుత్వం ఆర్‌బీకేలపై ఆర్భాటంగా చెప్పిన మాటలివి

పర్యవేక్షించే నాథుడే లేరు

జిల్లాలో సుమారు 270 రైతు బృందాలకు ఈ పథకం ద్వారా యంత్రాలు, పరికరాలు అందించారు. యంత్రాలు తీసుకున్న రైతులు వారి వ్యవసాయ అవసరాలకు వినియోగించుకుని.. ఆపై స్థానిక రైతులకు నామమాత్రపు నగదు తీసుకుని సాగు పనులు చేయాలి. క్షేత్రస్థాయిలో ఇది ఎక్కడా జరగడం లేదు. యంత్రాలు తీసుకున్న రైతులు వారు చేసిన పనికి నగదు తగ్గించి తీసుకున్న దాఖలాలు లేవు. ఆర్‌బీకే పరిధిలో ఎన్ని యంత్రాలు ఉన్నాయి..వాటిని ఎంత మంది వినియోగించాలి.., ఏఏ పనులకు ఎంత నగదు వసూలు చేయాలి అనే అంశాలను అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో రైతులందరికీ ఉపయోగపడాల్సిన పథక లక్ష్యం పూర్తిగా దారితప్పింది. సాగు పరికరాలు దక్కించుకున్న ఐదుగురికి మినహా మిగిలిన కర్షకులకు ఉపయోగపడటం లేదనే రైతులు ఆరోపిస్తున్నారు.

వైకాపా కార్యకర్తలకే లబ్ధి..

యంత్రసేవ పథకంలో ఆర్‌బీకే పరిధిలో ఉన్న రైతుల్లో ఐదుగురు చొప్పున బృందాలుగా ఏర్పడాలి. ఈ బృందం అవసరాలకు అనుగుణంగా ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్లు, రొటోవేటర్లు, దుక్కి యంత్రాలు, వరినాట్లు, కోత, నూర్పిడి యంత్రాలు తదితర సాగు పరికరాలు అందజేశారు. యంత్రం విలువలో 10 శాతం రైతులు చెల్లించాలి. 50శాతం బ్యాంకు రుణం, 40 శాతం రాయితీ ప్రభుత్వం భరించింది. ఈ పథకంపై అవగాహన కల్పించి అందరు రైతులకు ఉపయోగపడేలా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. యంత్ర సేవా పథకం కేవలం వైకాపా కార్యకర్తలకే పరిమితమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రైతు భరోసా కేంద్రం

సమాధానం ఎక్కడ..?

జిల్లాలో 502 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. పూర్తిస్థాయిలో వాటిలో సిబ్బంది లేరు. ఒకవేళ వారు బయటకు వెళితే తాళాలు వేయాల్సిందే. కొన్ని ప్రాంతాల్లో ఆర్‌బీకే భవనాల నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోయగా.. కొన్ని పూర్తయినప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. రైతులకు సకాలంలో సాగు సలహాలు, సూచనలపై సరైన సమాధానం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఆర్‌బీకేల్లో కేవలం యూరియా తప్ప.. మిగిలిన ఎరువులు, పురుగులు మందులు, విత్తనాలు అందుబాటులో ఉండటం లేదు. తద్వారా ప్రైవేటు దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

గిట్టుబాటు ధరలేవీ?

పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కీలకంగా పనిచేయాల్సిన కేంద్రాలు మొక్కుబడిగా మారిపోయాయి. దళారీ వ్యవస్థ పాత్ర పెరగడం తోడు తరుగు పేరుతో కోత విధించడం, రైతులపై రవాణా భారం మోపడం తోడు చెల్లింపులు ప్రభుత్వం నుంచి సకాలంలో చెల్లించకపోవడం వంటి కారణాలతో రైతులు తీవ్రంగా నషపోతున్నారు. చివరకు బయటి వ్యాపారులనే ఆశ్రయిస్తూ అందినంత సొమ్ము తీసుకుని ఉసూరుమంటూ ఇంటి బాట పట్టాల్సి వస్తోంది.

ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 91 వేల హెక్టార్లు
జిల్లాలోని కేంద్రాలు 502
సాగయ్యే పంటలు : వేరుసెనగ, వరి, చెరకు, ఉద్యాన పంటలు, ఇతర అన్ని రకాల పంటలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని