ఊర్మిళ నిద్ర

ఒక్క రాత్రిలో మహా మార్పు. పట్టాభిషిక్తుడు కానున్న రాముణ్ణి వనవాసానికి పంపేలా, భరతుణ్ణి రాజును చేసేలా వరం పొందింది కైకేయి. విషయం తెలియగానే లక్ష్మణుడు సోదరుడి వెంట తానూ వెళ్లాలనుకున్నాడు.

Updated : 03 Aug 2023 04:46 IST

క్క రాత్రిలో మహా మార్పు. పట్టాభిషిక్తుడు కానున్న రాముణ్ణి వనవాసానికి పంపేలా, భరతుణ్ణి రాజును చేసేలా వరం పొందింది కైకేయి. విషయం తెలియగానే లక్ష్మణుడు సోదరుడి వెంట తానూ వెళ్లాలనుకున్నాడు. ఆ సంగతి భార్యకు చెప్పాడు. విన్న ఊర్మిళ శోకతప్త హృదయంతో స్తంభించిపోయింది. భర్త తనతో రమ్మనలేదు. ఆమె కూడా సీతలా వెంట వస్తాననలేదు. భర్తకు తాను అదనపు భారం కాకూడదనుకుంది. ‘స్వామీ! తమరు అన్నావదినల సేవతో తరించండి. వనవాస కాలంలో నా గురించి ఆలోచనలు వద్దు. అలా చేస్తే మీ మనసు చలిస్తుంది. కర్తవ్యనిర్వహణలో ఆటంకం కలుగుతుంది’ అంది.

ఆ వెంటనే ఊర్మిళ అకుంఠిత దీక్షతో యోగముద్ర పూనింది. దానివల్ల లక్ష్మణుడికి గొప్ప తపోశక్తి లభించింది. ఫలితంగా అన్నావదినల సేవ 14 ఏళ్లు నిరాటంకంగా సాగింది. అంతేతప్ప అందరూ భావిస్తున్నట్లు ఊర్మిళ అన్నేళ్లు నిద్ర పోలేదు. అది కఠోరదీక్ష. రామలక్ష్మణులు అరణ్యవాసం పూర్తిచేసి అయోధ్యకు తిరిగొచ్చే వరకూ ఊర్మిళ యోగధ్యానంలోనే ఉంది. సీతాదేవి ‘చెల్లీ! ఊర్మిళా! నీ భర్త లక్ష్మణుడు వచ్చాడు, చూడు’ అని చెప్పేవరకూ భర్త రాకను గుర్తించనేలేదు.

తులసీదాసు తన రామచరిత మానసలో ‘అమ్మా ఊర్మిళాదేవీ! నాకు నీ ఔదార్యాన్ని వర్ణించే శక్తి లేదు. నీకు వందనం మాత్రం చేయగలను’ అంటూ ఆమెపట్ల గౌరవాన్ని చాటుకున్నాడు.

గోవిందం ఉమామహేశ్వర రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు