logo

కొంత మోదం.. కొంత ఖేదం

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి 18,786 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 17,262 మంది ఉత్తీర్ణులయ్యారు.

Published : 23 Apr 2024 05:05 IST

పదో తరగతి పరీక్షల్లో జిల్లాకు నాలుగో స్థానం

ముమ్మిడివరం, న్యూస్‌టుడే:   డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి 18,786 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 17,262 మంది ఉత్తీర్ణులయ్యారు. 91.88 ఉత్తీర్ణతా శాతంతో రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. గత ఏడాది 13వ స్థానానికి పడిపోయిన జిల్లా ఈ ఏడాది కొంత మెరుగైనా.. ప్రథమ స్థానానికి మాత్రం చేరుకోలేకపోయింది. గతంలో ఉమ్మడి జిల్లా రాష్ట్రస్థాయిలో ఒకటి, రెండు స్థానాల్లో నిలిచేది. విద్యా విధానంలో మార్పులంటూ ప్రభుత్వం రోజుకో ఉత్తర్వులు విడుదల చేయడం.. ఉపాధ్యాయుల బదిలీలు వంటి కారణాలు ఉత్తీర్ణతపై ప్రభావం చూపుతున్నాయి.


ప్రభుత్వ బడుల పరిస్థితి దిగజార్చారు..

గత అక్టోబరులో సబ్జెక్టు టీచర్లను ఇతర మండలాల్లోని పాఠశాలలకు సర్దుబాటు చేశారు. చాలా మందికి దూర ప్రాంతాల్లోని పాఠశాలు రావడంతో అయోమయంలో పడ్డారు. సర్దుబాటు నిలిచిపోయినా.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనతో బోధన సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫార్మెటివ్‌-2 పరీక్షలకు ముద్రించిన పేపర్లు అందించకుండా బోర్డుపై ప్రశ్నాపత్రాలు రాసే పరిస్థితికి దిగజార్చారు. ఇలాంటి అసంబద్ధ విధానాలు ఫలితాల్లో ప్రభావం చూపాయి.


ఉత్తమ ప్రతిభ  కనబర్చిన విద్యార్థులు..

మండపేట మండలం తాపేశ్వరంలోని ఓ పాఠశాల విద్యార్థిని కర్రి విద్యామేఘన 597 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. రామచంద్రపురంలోని ఓ పాఠశాల విద్యార్థిని వల్లూరి నిహారిక దేవి 595, అల్లవరం మండలం ఓడలరేవు జడ్పీ ఉన్న ఉన్నత పాఠశాల విద్యార్థిని పినబోతు ఈషిత 595 ద్వితీయ స్థానంలో నిలిచారు. వివిధ పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు 594 మార్కులతో జిల్లా స్థాయిలో మూడో స్థానంలో నిలిచారు.


ప్రైవేటు పాఠశాలలే అధికం..

జిల్లాలోని 153 పాఠశాలల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించగా.. వీటిలో 106 ప్రైవేటు పాఠశాలలే ఉన్నాయి. 233 జడ్పీ ఉన్నత పాఠశాలకు గానూ కేవలం 40 పాఠశాలల్లో మాత్రమే శత శాతం ఉత్తీర్ణత నమోదైంది. గురుకులాలు, ఎయిడెడ్‌ పాఠశాలు మరో ఏడు ఉన్నాయి. 42 ఉన్నత పాఠశాలల్లో 60 శాతం లోపు ఉత్తీర్ణత నమోదు కావడం.. ప్రభుత్వ బడుల పరిస్థితికి అద్ధంపడుతోంది.


బాలికలదే పైచేయి..

జిల్లాలో 17,262 మంది ఉత్తీర్ణత సాధించగా.. అందులో 8711 మంది బాలికలు (93.1 శాతం), 8,551 మంది బాలురు (90.29 శాతం). గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది బాలికలదే పైచేయి. 98.72 శాతంతో ముమ్మిడివరం మండలం ప్రథమ స్థానంలో నిలవగా.. 83.8 శాతంతో కొత్తపేట మండలం చివరి స్థానంలో నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని