logo

జగనన్న పాలనలో ‘సమగ్ర’ శిక్షా

విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం అంటూ గొప్పలు చెప్పే వైకాపా పాలనలో ఉద్యోగుల ఆశలు, హక్కులు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి.

Published : 03 May 2024 03:52 IST

అమలుకాని హామీలు
ఆవిరైన ఆశలు

సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల నిరసన (పాత చిత్రం)

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌ : విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం అంటూ గొప్పలు చెప్పే వైకాపా పాలనలో ఉద్యోగుల ఆశలు, హక్కులు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పని చేసే ఉద్యోగులకు ఈ అయిదేళ్ల కాలంలో ఒరిగిందేమీ లేదు. ఒప్పంద పద్ధతిలో పనిచేసే వారిని శాశ్వత ఉద్యోగులుగా చేస్తామని చెప్పిన జగన్‌మోహన్‌ రెడ్డి, అమలు చేసే సమయంలో ఆచరణ సాధ్యం కాని షరతులతో అరచేతిలో వైకుంఠం చూపారు.

సమ్మె చేసినా..

తమ డిమాండ్ల సాధనకు సమగ్ర శిక్షా విభాగంలో ఒప్పంద, పొరుగు సేవల విధానంలో విధులు నిర్వహించే ఉద్యోగులు గతేడాది డిసెంబరులో 22 రోజులపాటు సమ్మె చేశారు. ఆ సంఘాల నాయకులతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు జరిపారు. శాశ్వత ఉద్యోగుల గుర్తింపు కన్నా ముందు ఎంటీఎస్‌(మినిమం టైం స్కేల్‌) పద్ధతిలో జీతాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికలు వచ్చేశాయి. ఫలితంగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆ ఉద్యోగుల ఆశలు ఆవిరి అయ్యాయి.

అభద్రతలో 523 మంది..

సమగ్ర శిక్షా విభాగంలో జిల్లాలో 523 మంది ఉద్యోగులు పొరుగు సేవలు, ఒప్పంద పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా దశాబ్దాల తరబడి పని చేస్తున్నా అభద్రతకు లోనుకావాల్సిందే. ఏటా ఏప్రిల్‌ చివరిలో లేదా మే మొదటి వారంలోగాని వారిని ఇంటికి పంపుతారు. వారం తర్వాత మళ్లీ విధుల్లో చేరినట్లు రికార్డుల్లో నమోదు చేస్తారు. అయితే ఆ వారం రోజులు ఉద్యోగులు విధులు నిర్వహించినా వేతనం మాత్రం రాదు. వారి సేవలు వినియోగించుకుంటున్నారే తప్ప తమ బాధలు వినే నాధుడే కరవయ్యాడని వారు వాపోతున్నారు.

నమ్మించి నట్టేట ముంచి..

తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలనే డిమాండ్‌తో సమ్మెకు దిగినప్పుడు చర్చలు జరిపిన అమాత్యులు, అధికారులు ఎన్నో హామీలు ఇచ్చారని వారు తెలిపారు. సమ్మెకాలానికి వేతనం, ఎంటీఎస్‌ వర్తింప చేస్తామని, ఉద్యోగ క్రమబద్ధీ
కరణకు కమిటీ నియమిస్తామని నమ్మించా రన్నారు. అమలు సమయానికి ఇదిగో.. అదిగో అంటూ సార్వత్రిక ఎన్నికలు సమీపించే వరకు గడిపేశారన్నారు. తర్వాత కోడ్‌ అమల్లోకి వచ్చిందంటూ చేతులెత్తేసి తమను నట్టేట ముంచారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


హామీలు గాలికి వదిలేశారు..

సమ్మె కాలంలో ప్రభుత్వం ఎంటీఎస్‌ అమలు చేస్తామని, శాశ్వత ఉద్యోగులుగా మార్పు చేసేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి మాచే సమ్మె విరమింపజేసి.. అనంతరం మాకు ఇచ్చిన హామీని గాలికి వదిలేసింది. ఇప్పటి వరకు అది ఆచరణలోకి రాలేదు. ఎన్నికల అనంతరం ఏర్పడే నూతన ప్రభుత్వం సమగ్ర శిక్షా ఉద్యోగులకు న్యాయం చేయాలి విన్నవించుకుంటున్నాం.

 సీహెచ్‌ వెంకన్నబాబు, సమగ్ర శిక్షా ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్‌


మా తలరాత మారలేదు

గడిచిన అయిదేళ్ల కాలంగా సమగ్ర శిక్షా విభాగంలో విధులు నిర్వహిస్తున్న పొరుగు, ఒప్పంద సేవల ఉద్యోగుల తలరాతలు మారలేదు. మా సమస్యలు ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగానే మిగిలిపోయాయి. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. సమ్మె సమయంలో కమిటీ వేస్తామన్నారు. అది ఏమైందో ఇప్పటికీ తెలియ లేదు.

 రమణ, సీఆర్పీ, యూనియన్‌ విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని