logo

ఫలితాలను ఏం మాయ చేశావ్‌

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతున్నామన్న వైకాపా సర్కారు మాటలు బూటకమని తేలిపోయింది. సోమవారం వెలువడిన పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అరకొర ఫలితాలే సాధించాయి.

Updated : 23 Apr 2024 05:55 IST

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతున్నామన్న వైకాపా సర్కారు మాటలు బూటకమని తేలిపోయింది. సోమవారం వెలువడిన పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అరకొర ఫలితాలే సాధించాయి. తరగతి గదులు చాలకపోవడం, ఉపాధ్యాయుల కొరత, ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలు దీనికి కారణంగా తల్లిదండ్రులు చెబుతున్నారు.

న్యూస్‌టుడే, శ్యామలాసెంటర్‌


ఈ ఏడాది రాజమహేంద్రవరం నగరం పదోతరగతి పరీక్షా ఫలితాల్లో 87 శాతం ఉత్తీర్ణతతో సరిపెట్టుకుంది. మొత్తం 4,978 మంది పరీక్ష రాయగా వీరిలో 4,331 మంది ఉత్తీర్ణులయ్యారు. 647 మంది అనుత్తీర్ణులయ్యారు. విద్యార్థులు ఎస్‌వీఏ సాయీష్‌ 589, చల్లా డింపు వీర శర్వాణి 585, షేక్‌ శామ్‌సున్నీసా 584 మార్కులు సాధించగా మిగిలిన వారెవరూ 590 మార్కులు దాటకపోవడం గమనార్హం. ప్రభుత్వ అనాలోచిత కారణాలే దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నాడు-నేడుతో పూర్తికాని పనులు, సబ్జెక్టు టీచర్లు లేకపోవడం. డిజిటల్‌ విద్యాబోధన పేరుతో విద్యార్థులను పూర్తిగా చరవాణితో మమేకం చేయడం, ఆంగ్లం, సైన్సు, గణితం వంటి కీలక సబ్జెక్టులు బోధించేవారు కొన్నిచోట్ల తక్కువగా ఉండటంతో అరకొర ఫలితాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. కొన్నిచోట్ల సర్దుబాటు చేస్తున్నప్పటికీ ఫలితం లేకపోతోందని, పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించాలని కోరుతున్నారు.


ఉపాధ్యాయులు సొంత నిధులు వెచ్చించారు..

నగరంలో సుమారు 21 ప్రభుత్వ ఉన్నత, 56 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 16 వేల మంది చదువుతున్నారు. వీరిలో పదోతరగతి విద్యార్థులు 2,140 మంది ఉన్నారు. వీరికి డిజిటల్‌ బోధనంటూ 112 పైగా ఐఎఫ్‌టీలు ఇచ్చారు. స్మార్ట్‌ టీవీలు 55 ఇచ్చారు. వీటికి విద్యుత్‌ కనెక్షన్లు, లాన్‌(ఇంటర్నెట్‌) సౌకర్యం చేసుకునేందుకు నాడు-నేడు నిధులు మళ్లించారు. నిధులు రాకపోవడంతో ఉపాధ్యాయులు సొంత నిధులు వెచ్చించారు. నగరంలోని ఓ పాఠశాలకు చెందన ఉపాధ్యాయుడు సుమారు రూ.80 వేలు ఖర్చుపెట్టి పనులు చేయించారు. కొందరు జీతాలు రాకపోవడంతో పనులు చేయలేక చేతులెత్తేశారు. ఇప్పటికీ కొన్నిచోట్ల సరైన ఇంటర్నెట్‌ సదుపాయం లేక పాఠాల బోధన సరిగా జరగకపోవటంతో యథావిధిగా గ్రీన్‌ చాక్‌బోర్డుల పైనే బోధిస్తున్నారు. టోఫెల్‌ పరీక్ష, రోజుకో ఆంగ్ల పదం, స్పెల్‌ -బి తదితర పరీక్షలు పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. నగరంలో 2,230 మందికి ట్యాబ్‌లు ఇచ్చారు. వాటికి ఎస్‌డీ కార్డులు ఇవ్వకపోవడంతో తల్లిదండ్రుల సిమ్‌కార్డులు వేసుకున్నారు.


అసంపూర్తి పనులతో అవస్థలు

నగరంలో నాడు-నేడుకు ఎంపికైన పాఠశాలలు 67 కాగా వాటికి రూ.16.85 కోట్లు నిధులు కేటాయించారు. వాటిలో కేవలం రూ.8.9 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఇప్పటికీ కొన్నిచోట్ల అదనపు తరగతుల నిర్మాణం పూర్తికాలేదు. ఫ్లోరింగ్‌ పనులు చేయాల్సి ఉండగా కేవలం సిమెంటుతోనే సరిపెట్టారు. వాటిపై టైల్స్‌ వేయలేదు. దీంతో ఆరుబయట కూర్చోవడం,  అసంపూర్తి భవనాల్లోనే పాఠాలు వినడం జరిగింది. ఈ కారణాలు   ఉత్తీర్ణతా శాతంపై ప్రభావం చూపాయని అంటున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కొన్ని పాఠశాలల్లో వంటషెడ్ల నిర్మాణం ఇప్పటికీ జరగలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని