logo

జగన్‌ను ఇడుపులపాయ పంపడమే మా నినాదం

మోదీని ఇంటికి, జగన్‌ను ఇడుపులపాయకు పంపాలన్నదే తమ నినాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.

Published : 18 May 2024 02:57 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

శిక్షణ తరగతులకు హాజరైన ఎస్టీయూ నాయకులు 

రాజానగరం, న్యూస్‌టుడే: మోదీని ఇంటికి, జగన్‌ను ఇడుపులపాయకు పంపాలన్నదే తమ నినాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. రాజానగరం సమీపంలోని గైట్‌ కళాశాలలో రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) రాష్ట్రస్థాయి ఉద్యమ శిక్షణ తరగతులు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అపరిష్కృత సమస్యల పరిష్కారానికి పోరాటపటిమను చూపుతూ ఉపాధ్యాయులే ప్రభుత్వం కళ్లు తెరిపించాలన్నారు. ఓట్లకు డబ్బు, కులం, మతం ఆధారమైతే అది ప్రజాస్వామ్యం అవదని ధనస్వామ్యమవుతుందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో డబ్బు ప్రచారం విపరీతంగా పెరిగిందని, డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేయడానికి రారేమోనన్న పరిస్థితి ఏర్పడిందన్నారు. రాయలసీమలో అధికార పార్టీకి కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.సాయిశ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నాడు-నేడు ద్వారా ప్రధానోపాధ్యాయులను ఈవెంట్‌ మేనేజర్లుగా మార్చేసిందన్నారు. ఉపాధ్యాయుల దైనందిన కార్యక్రమం సెల్‌ఫోన్‌తోనే ప్రారంభమవుతోందన్నారు. విద్యా నిలయాల్లో విద్యకు ప్రాధాన్యం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడానికి రాబోయే విద్యాసంవత్సరంలో సరైన నిర్ణయాలు కొత్త ప్రభుత్వం తీసుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. 117 జీఓతో ప్రాథమిక విద్యారంగం నిర్వీర్యమైందన్నారు. డీఎస్సీ నిర్వహించకపోవడంతో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలల్లో ఇంటర్‌ తరగతుల ప్రవేశాలకు ముందే పీజీటీ పోస్టులను ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరారు. నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వం బకాయిల చెల్లింపునకు మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర ఆరిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, కమిటీ సభ్యుడు ఈశ్వరరెడ్డి, ఉపాధ్యాయ వాణి సంపాదకులు గాజుల నాగేశ్వరరావు, సంఘ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు శివప్రసాద్, ఉపాధ్యక్షుడు జాకబ్, తూర్పుగోదావరి, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డేనియల్‌బాబు, లక్ష్మణ్, దొరబాబు, పల్లంరాజు, మోర్త శ్రీను, కాశీవిశ్వనాధ్, సంఘ రాష్ట్ర నాయకులు ఎస్‌.జె.త్రినాథ్‌బాబు, వి.సుబ్బరాజు, 26 జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని