mr and mrs mahi review: రివ్యూ: మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి: జాన్వీకపూర్‌ స్పోర్ట్స్‌ డ్రామా మెప్పించిందా?

Mr And Mrs Mahi Review: రాజ్‌కుమార్‌ రావ్‌, జాన్వీ కపూర్‌ జంటగా శరణ్‌ శర్మ తెరకెక్కించిన స్పోర్ట్స్‌ డ్రామా ఎలా ఉంది?

Updated : 25 Jun 2024 16:26 IST

Mr And Mrs Mahi Review || చిత్రం: మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి; నటీనటులు: రాజ్‌కుమార్‌ రావ్‌, జాన్వీ కపూర్‌, రాజేశ్‌ శర్మ, కుముంద్‌ మిశ్రా తదితరులు; సినిమాటోగ్రఫీ: అనయ్‌ గోస్వామి; ఎడిటింగ్‌: నితిన్‌ బైది; రచన: నిఖిల్‌ మల్హోత్ర, శరణ్‌ శర్మ; నిర్మాత: కరణ్‌ జోహార్‌, జీ స్టూడియోస్‌; దర్శకత్వం: శరణ్‌ శర్మ

స్సోర్ట్స్ డ్రామాల‌కి పెట్టింది పేరు బాలీవుడ్. హాకీ మొద‌లుకుని కుస్తీ వ‌రకూ ప‌లు ర‌కాల క్రీడ‌ల్ని స్పృశిస్తూ సినిమాలు రూపొందుతుంటాయి. ఈ మ‌ధ్యే అజ‌య్ దేవ‌గ‌ణ్ ‘మైదాన్’ వ‌చ్చింది. ఇప్పుడు క్రికెట్ నేప‌థ్యంలో ‘మిస్ట‌ర్ అండ్ మిసెస్ మహి’. రాజ్ కుమార్ రావ్‌, జాన్వీ క‌పూర్ జంట‌గా న‌టించడం.. అగ్ర నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ నుంచి వ‌స్తుండ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు నెల‌కొన్నాయి. (Mr And Mrs Mahi Review) మ‌రి అందుకు త‌గ్గ‌ట్టుగా సినిమా ఉందా?

క‌థేంటంటే: మ‌హేంద్ర (రాజ్ కుమార్‌ రావ్‌) ఓ ఫెయిల్యూర్ క్రికెట‌ర్‌.  మ‌రో ఏడాది అవ‌కాశమిస్తే  తానేంటో నిరూపించుకుంటాన‌ని బ‌తిమాల‌తాడు. అయినా తండ్రి వినిపించుకోకుండా త‌న స్పోర్ట్స్ షాప్ నిర్వ‌హ‌ణ బాధ్యత‌ల్ని అప్ప‌గిస్తాడు. మ‌హిమ అగ‌ర్వాల్ (జాన్వీ క‌పూర్‌)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. త‌న ఫెయిల్యూర్ స్టోరీ చెప్పినప్ప‌టికీ మ‌హేంద్ర మ‌న‌సు న‌చ్చి పెళ్లి చేసుకోవడానికి అంగీకారం తెలుపుతుంది మ‌హిమ‌. వైద్యురాలైన ఆమెకీ క్రికెట్ అంటే పిచ్చి. (Mr And Mrs Mahi Review) అలా ఆ ఇద్ద‌రి క్రికెట్ ప్రేమ వాళ్ల‌ని ఎక్క‌డిదాకా తీసుకెళ్లింది?విజ‌య‌వంత‌మైన  క్రికెట‌ర్ కావాల‌నుకున్న మ‌హేంద్ర క‌లలు ఎలా నెర‌వేరాయనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: క్రీడా నేప‌థ్యంలో సాగే క‌థ‌ల‌న్నీ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఫెయిల్యూర్స్‌తో అప్ప‌టివ‌ర‌కూ అండ‌ర్‌డాగ్‌లా క‌నిపించిన హీరో... చివ‌రికొచ్చేస‌రికి విజేత‌గా నిలిచి త‌న క‌లని నెర‌వేర్చుకుంటాడు. ఆ మ‌ధ్య‌లో న‌డిచే డ్రామా ఎంత వైవిధ్యంగా, ఎంత ఆస‌క్తిక‌రంగా ఉంద‌న్న‌దే సినిమా ఫ‌లితాన్ని నిర్దేశిస్తుంది. హీరో గెలుస్తాడ‌ని తెలుసు. ఎలా గెలుస్తాడనే విష‌యంలోనే ఉంటుంది అస‌లు సిస‌లు ఉత్కంఠ. ‘జెర్సీ’ని గుర్తు చేసే హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌తో రూపొందిన ఈ సినిమా ఆరంభం, చివ‌ర‌లో కాదు... మ‌ధ్య‌లో డ్రామా కూడా ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగ‌డం మైన‌స్‌గా మారింది. హీరోకి కోచ్ కావాల‌నే కోరిక క‌ల‌గ‌డం, హీరోయిన్ బ్యాట్ ప‌ట్ట‌డంతోనే ఈ క‌థ ప్ర‌యాణమేమిటో ప్రేక్ష‌కుడికి అర్థ‌మైపోతుంది. మ‌ధ్య‌లో డ్రామా కోస‌మ‌ని మైదానం నుంచి బ‌య‌టికొచ్చి, భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ఐడెంటిటీ గొడ‌వ‌ని సృష్టించినా అదేమంత ర‌క్తిక‌ట్ట‌దు. మ‌హిమ ఇంకా పూర్తిస్థాయి క్రికెట‌ర్ కాక‌ముందే, హీరో మ‌హేంద్ర త‌న గుర్తింపు కోసం పాకులాట మొద‌లుపెట్టే స‌న్నివేశాలు క‌థ‌కి అత‌క‌లేదు. చెప్పాల్సిన క‌థేమీ లేక ఇలా మ‌రో దారిని ఎంచుకున్న‌ట్టు అనిపిస్తుంది. (Mr And Mrs Mahi Review) హీరో, హీరోయిన్ల నేప‌థ్యం, పెళ్లి ప్ర‌యాణం వ‌ర‌కూ సినిమా ఆక‌ట్టుకుంటుంది. ఆ త‌ర్వాత క‌థ  సాదాసీదాగా మారిపోయింది. ప్ర‌తీ స‌న్నివేశం ప్రేక్ష‌కుడికి ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగుతుంటుంది. ద్వితీయార్ధంలో అయితే హీరోకీ, ఆయ‌న త‌ల్లికీ మ‌ధ్య సాగే స‌న్నివేశాల్లో త‌ప్ప ఎక్కడా మెరుపులు క‌నిపించ‌వు. క‌థ‌, క‌థ‌నాల కంటే జాన్వీక‌పూర్‌, రాజ్‌కుమార్ రావ్‌ జోడీ న‌ట‌నే సినిమాని కొంతవరకు నిల‌బెట్టింది. సినిమాల్లో  క్రికెట్ మ్యాచ్‌ని చూపిస్తున్న‌ప్పుడు, ప్రేక్ష‌కుడు  నిజంగానే ఓ ఉత్కంఠ భ‌రిత‌మైన మ్యాచ్‌ని చూస్తున్న అనుభూతి క‌లిగేలా స‌న్నివేశాల్ని మ‌లుస్తుంటారు ద‌ర్శ‌కులు. కానీ, ఇందులో ఆ త‌ర‌హా జాగ్ర‌త్తలూ తీసుకోలేదు. హీరోయిన్ వెళ్లి వ‌రుస‌గా  సిక్స‌ర్లు కొట్టి మ్యాచ్‌ని గెలిపించేస్తుంది. ర‌చ‌న‌లోనే చాలా లోపాలు క‌నిపిస్తాయి.

150 రోజుల ట్రైనింగ్‌.. 30 రోజుల షూటింగ్‌.. రెండుసార్లు గాయాలు

ఎవ‌రెలా చేశారంటే: రాజ్‌కుమార్ రావ్‌, జాన్వీ క‌పూర్ జోడీ ఆక‌ట్టుకుంటుంది. వాళ్లిద్ద‌రూ పాత్ర‌ల్లో స‌హ‌జంగా ఒదిగిపోయారు. కోచ్ బెన్నీగా క‌నిపించిన రాజేశ్ శ‌ర్మ, మ‌హేంద్ర తండ్రిగా కుముద్ మిశ్రా, త‌ల్లిగా జ‌రీనా వ‌హాబ్‌ల న‌ట‌న గుర్తుండిపోతుంది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. అన‌య్ గోస్వామి  కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. పాట‌లు బాగున్నాయి. జాన్ స్టీవార్డ్ ఏడూరి నేప‌థ్య సంగీతం సినిమాపై ప్ర‌భావం చూపించింది. నిఖిల్ మల్హోత్ర, ద‌ర్శ‌కుడు శ‌ర‌ణ్ శ‌ర్మ క‌లిసి స్క్రిప్ట్ రాశారు. ర‌చ‌న ప‌రంగా మ‌రింత వైవిధ్యం చూపించాల్సింది. ఎగ్జిక్యూష‌న్ ప‌రంగానూ శ‌ర‌ణ్ శ‌ర్మ  ప్ర‌భావం చూపించ‌లేక‌పోయారు. నిర్మాణం సినిమా స్థాయి, ప‌రిమితుల‌కి త‌గ్గ‌ట్టే  ఉంది.

  • బ‌లాలు
  • + రాజ్‌కుమార్ రావ్‌, జాన్వీ  జోడీ
  • + ప్ర‌థ‌మార్ధం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా క‌థ‌, క‌థ‌నాలు
  • - కొర‌వ‌డిన భావోద్వేగాలు
  • - ద్వితీయార్ధం
  • చివ‌రిగా: మిస్ట‌ర్  అండ్ మిసెస్ మ‌హి... మ‌జా లేని ఓ క్రికెట్ మ్యాచ్ (Mr And Mrs Mahi Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు