logo
Published : 30/11/2021 03:21 IST

పంచాయతీలపై అదనపు భారం

ఉపాధిహామీలో అరకొరగానే నిర్వహణ నిధులు

ఉన్నతాధికారులకు ఫిర్యాదుల పరంపర

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

‘ఉపాధిహామీ పథకంలో కోరిన ప్రతి కూలీకి పని కల్పిస్తున్నారు.. వలసలకు తావు లేకుండా స్థానికంగానే ఉపాధి చూపెడుతున్నారు.. పేదలకు చేతినిండా పని దొరుకుతోంది.. కూలీలకు సకాలంలో వేతనాలు అందుతున్నాయి..’ ఇక్కడివరకు బాగానే ఉన్నా మండల స్థాయిలో కార్యాలయ నిర్వహణ ఖర్చులు పంచాయతీలకు భారంగా మారాయి.

గతంలో సామగ్రి, కంప్యూటర్ల మరమ్మతు, కాగితాల కొనుగోలు, ఇతర ఖర్చుల కోసం కూలీల నిష్పత్తి ఆధారంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసేది. ఎక్కువ మంది కూలీలు హాజరయ్యే మండలాలకు అధిక మొత్తంలో కేటాయించేవారు. ప్రస్తుతం అన్ని మండలాలకు ఒకే రకంగా నిధులు కేటాయిస్తున్నారు. ఫలితంగా నిర్వహణ ఖర్చుల కోసం పంచాయతీల వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కార్యాలయ నిర్వహణ భారం భరించలేమంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది.

పంచాయతీల వైపు చూపు..
జిల్లాలో 13 గ్రామీణ మండలాల పరిధిలో 1,15,975 జాబ్‌కార్డులుండగా 2,55,337 మంది కూలీలు నమోదయ్యారు. ఇప్పటివరకు 53,136 కుటుంబాల్లోని 81,851 మంది కూలీలకు పని కల్పించారు. రోజు కూలీకి సగటున రూ.171.86 వేతనం అందుతోంది.
పెద్దపల్లి మండలంలో 37,454 జాబ్‌కార్డులకు గాను 7,628 కుటుంబాల్లోని 12,638 మంది పనికి వెళ్తున్నారు. అదే ఎలిగేడు మండలంలో 1,584 కుటుంబాల్లోని 2058 మంది పని చేస్తున్నారు. కూలీల హాజరు శాతం ఎంత ఎక్కువగా ఉంటే కార్యాలయ నిర్వహణ ఖర్చు అంతమేర పెరుగుతోంది.
ఉపాధిహామీ సిబ్బంది ఎంపీడీవో కార్యాలయ ఆధీనంలో పని చేస్తుండగా, నిర్వహణ ఖర్చుల కోసం పంచాయతీల వైపు చూస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న రూ.4 వేలు కాగితాల ఖర్చులకే సరిపోవడం లేదని సిబ్బంది వాపోతున్నారు.
నిర్వహణ ఖర్చుల కోసం కార్యదర్శులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పటికే క్షేత్రసహాయకుల విధులు అదనపు భారంగా మారగా తాము ఖర్చుల కింద సొమ్ము ఇచ్చుకోలేమని చేతులెత్తేస్తున్నారు. కార్యాలయ నిర్వహణ ఖర్చులు సరిపోవడం లేదంటూ జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయానికి పెద్దపల్లి మండలం నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు అందింది.


ఖర్చులు తడిసిమోపెడు

గతంలో ఉపాధిహామీ పనులను క్షేత్రసహాయకులు పర్యవేక్షించేవారు. ప్రభుత్వం వారిని తొలగించడంతో ఆ బాధ్యతలను కార్యదర్శులు నిర్వర్తిస్తున్నారు. కూలీల పని సామర్థ్యాన్ని బట్టి వేతనాల కోసం సాంకేతిక సహాయకులు కొలతలు తీసుకుని ఎంబీ రికార్డులు రూపొందిస్తున్నారు. వాటి ఆధారంగా వేతనాల మంజూరు కోసం అంతర్జాలంలో నమోదు చేస్తున్నారు. అయితే కాగితాలు, కంప్యూటర్లు, ప్రింటర్లు తదితర ఖర్చులు తడిసిమోపడువుతున్నాయి. సామాజిక తనిఖీ నిర్వహణకు మరిన్ని నిధులు వెచ్చించాల్సి వస్తోంది. కూలీల హాజరు అధికంగా ఉన్న మండలాల్లో ప్రతి నెలా రూ.వేలల్లో ఖర్చు ఉంటోంది. ప్రభుత్వం మాత్రం రూ.4 వేల చొప్పున విడుదల చేస్తుండటంతో పంచాయతీలపై ఆర్థిక భారం పడుతోంది.


ఉన్నతాధికారులకు నివేదిస్తా
శ్రీధర్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

మండలాల్లో ఉపాధిహామీ పథకం నిర్వహణకు నిధులు మంజూరు చేయాలంటూ పంచాయతీల నుంచి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. అన్ని మండలాలకు ఒకే రకంగా విడుదలవుతున్నాయి. దీంతో ఎక్కువ మంది కూలీలు పని చేసే చోట ఆర్థిక సమస్య ఏర్పడుతోంది. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని