logo

పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి

‘నిజామాబాద్‌ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో నిజామాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated : 19 Apr 2024 08:23 IST

మంత్రి శ్రీధర్‌బాబుతో నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి

మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి, చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు, విప్‌ లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యే విజయరమణారావు, పెద్దపల్లి అభ్యర్థి వంశీకృష్ణ

ధర్మారం, ధర్మపురి, న్యూస్‌టుడే : ‘నిజామాబాద్‌ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో నిజామాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ధర్మపురిలో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సభలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. ‘పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో ఏడుగురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్‌ వాళ్లే ఉన్నారు. పెద్దపల్లిలో వంశీకృష్ణ గెలుపు నల్లేరుమీద నడకే. నేను వయసు పైబడిన వాడిని. కేవలం పెద్దపల్లి మాత్రమే కాకుండా పక్కనున్న నా వైపూ చూడండి. నిజామాబాద్‌ నుంచి నన్ను గెలిపిస్తేనే మిమ్మల్ని జగిత్యాలకు రానిస్తా’ అని నవ్వుతూ అనడంతో సమావేశంలో నవ్వులు విరిశాయి. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. నిజామాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న బంధువులు, మిత్రులకు చెప్పి జీవన్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ విజయానికి పని చేసిన కార్యకర్తలకే.. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలిస్తామని స్పష్టం చేశారు. రాజకీయంగా అనుభవజ్ఞుడైన జీవన్‌రెడ్డి, పెద్దపల్లి నుంచి వంశీకృష్ణలను ఎంపీలుగా గెలిపిస్తే ఈ ప్రాంతాభివృద్ధికి రాష్ట్రం, కేంద్రం నుంచి విరివిగా నిధులు వస్తాయన్నారు. బూత్‌ల వారీగా వచ్చిన ఓట్లనే పనితీరుకు కొలమానంగా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు, మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, విజయరమణారావు, కోరుట్ల ఇన్‌ఛార్జి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని