logo

వెంటాడుతున్న అకాల వర్ష భయం

అన్నదాతలు వరి గింజలు పూర్తిగా ఎండకుండానే... కమతాలు తడారకుండానే వరి కోతలు చేపడుతున్నారు. అకాల వర్షాల భయంతో ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ముమ్మరం చేశారు. వరి కోత యంత్రాలకు భారీగా వ్యయం చేస్తున్నారు.

Published : 28 Apr 2024 05:22 IST

కమతాలు తడారకుండానే వరి కోతలు 

ఎల్లారెడ్డిపేటలో వరిని కోస్తున్న ట్రాక్‌ యంత్రం

న్యూస్‌టుడే, ఎల్లారెడ్డిపేట : అన్నదాతలు వరి గింజలు పూర్తిగా ఎండకుండానే... కమతాలు తడారకుండానే వరి కోతలు చేపడుతున్నారు. అకాల వర్షాల భయంతో ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ముమ్మరం చేశారు. వరి కోత యంత్రాలకు భారీగా వ్యయం చేస్తున్నారు. అదేవిధంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు, మిల్లులు, ఇళ్లకు తరలించేందుకు ట్రాక్టర్ల రవాణా ఛార్జీలు సైతం తడిసిమోపెడవుతున్నాయి. ఫలితంగా పంట పెట్టుబడి వ్యయం పెరుగుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు.

80 శాతం పూర్తి: జిల్లాలో యాసంగి సీజన్‌లో 1,74,750 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటి వరకు 75 నుంచి 80 శాతం వరి కోతలు అయ్యాయి. వచ్చే నెల 15 నుంచి 20 నాటికి మొత్తం పూర్తవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఎకరానికి సగటున 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ లెక్కన జిల్లాలో దాదాపు 4.36 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని పౌరసరఫరాలశాఖ అధికారులు లెక్క కట్టారు. 259 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అన్నదాతకు వాత: వరి కోతలకు యంత్రాలపైనే రైతులు ఆధారపడుతున్నారు. టూవీలర్‌ హార్వెస్టర్‌ యంత్రానికి గంటకు రూ. 1,800 ఉండగా, ఇప్పుడు దానిని రూ. 2 వేలకు పెంచారు. అలాగే ఫోర్‌ వీలర్‌ యంత్రానికి గంటకు రూ. 2,400 నుంచి రూ. 2,500 వరకు, ట్రాక్‌ (చైన్‌) యంత్రానికి గంటకు రూ. 2,800 నుంచి రూ. 3 వేల వరకు యజమానులు వసూలు చేస్తున్నారు. పెద్ద కమతాల్లో ఎకరం వరి పొలం కోసేందుకు గంట నుంచి 1.20 గంటల సమయం పడుతుంది. అకాల వర్షం, వడగళ్ల వానల భయానికి కమతాలు తడారకముందే పైరును కోయిస్తున్నారు. ఇందుకు ఫోర్‌వీలర్‌, ట్రాక్‌ యంత్రాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. తడి ఉన్న నేలల్లో యంత్రాలు వేగంగా ముందుకు కదలక వరి కోతకు సమయం ఎక్కువ పడుతుందని రైతులు చెబుతున్నారు. దీంతో అద్దె, ధాన్యాన్ని ట్రాక్టర్లతో తరలించేందుకు రవాణా ఛార్జీలు తడిసిమోపెడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశుగ్రాసం సేకరణలో భాగంగా ఎండుగడ్డిని కట్ట కట్టేందుకు బేలర్‌ యంత్రాలు, గడ్డి రవాణాకు ట్రాక్టర్‌ ఛార్జీలను యజమానులు పెంచుతున్నారని చెబుతున్నారు. అకాల వర్షాలు పొంచి ఉన్న నేపథ్యంలో వరి కోతలను త్వరగా ముగించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.

పెట్టుబడులే అధికం

మాకున్న ఎనిమిది ఎకరాల్లో వరి సాగు చేశాం. ట్రాక్‌ హార్వెస్టర్‌ మిషన్‌తో వరిని కోయిస్తే 12 గంటలైంది. సాధారణంగా ఎకరా విస్తీర్ణంలో సాగు మొదలుకొని పంట కోత వరకు సుమారు రూ. 23 వేల నుంచి రూ. 25 వేల వరకు పెట్టుబడి వ్యయం అవుతుంది. పురుగు మందుల పిచికారీ ఖర్చులు, ధాన్యం తరలింపు, రైతుల శ్రమ అదనం. వచ్చే ఆదాయంలో సగానికి పైగా పెట్టుబడికే పోతుంది.

 సురేందర్‌రెడ్డి, రైతు, రాచర్ల బొప్పాపూర్‌


ఏడు ఎకరాలకు 9.30 గంటలు పట్టింది

నా సొంత భూమి 1.30 ఎకరాలుండగా, మరో 11 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి పంట వేశాను. ఆకాశం మేఘావృతమవడంతో 7 ఎకరాలను ట్రాక్‌ యంత్రంతో కోయిస్తే 9.30 గంటల సమయం పట్టింది. మరో నాలుగు ఎకరాలను టూవీలర్‌తో కోయిస్తే 4.25 గంటలు తీసుకుంది. ఇంకా 2.2 ఎకరాల్లో కోయించాల్సి ఉంది. వరి కోతలకే ఎక్కువ ఖర్చు అవుతుంది.

 ల్యాగల వినోద్‌, రైతు, రాచర్ల బొప్పాపూర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని