logo

నెరవేరని వస్త్రోత్పత్తి లక్ష్యం

ప్రభుత్వ పాఠశాలలు జూన్‌ 12న పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి ఏకరూప దుస్తులు విద్యార్థులకు సిద్ధం చేయడం అసాధ్యమనిపిస్తోంది.

Published : 30 Apr 2024 02:15 IST

మే 15 వరకు గడువు పొడిగింపు
ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

టెక్స్‌టైల్‌ పార్కులో షర్టింగ్‌ వస్త్రం సేకరిస్తున్న టెస్కో సిబ్బంది

ప్రభుత్వ పాఠశాలలు జూన్‌ 12న పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి ఏకరూప దుస్తులు విద్యార్థులకు సిద్ధం చేయడం అసాధ్యమనిపిస్తోంది. పాఠశాల విద్యాశాఖ వస్త్రం సరఫరాను ఫిబ్రవరిలోనే తెలంగాణ చేనేత, సహకార సంస్థ (టెస్కో)కు ఆర్డరు ఇచ్చింది. దీనిలో 36 లక్షల మీటర్లు తంగళ్లపల్లి మండలం మండెపల్లి టెక్స్‌టైల్‌ పార్కులోని యూనిట్లకు, మరో మూడు లక్షల మీటర్లు సిరిసిల్ల పట్టణంలోని మరమగ్గాలకు కేటాయించారు. ఈసారి వస్త్రం నాణ్యతను దృష్టిలో ఉంచుకుని టెస్కోనే నూలు సరఫరా చేస్తోంది. వాస్తవానికి ఈ నెలాఖరులోగా ఉత్పత్తి లక్ష్యం, సేకరణ పూర్తి కావాలి. కానీ నేటికీ 15 లక్షల మీటర్లు పూర్తయింది. యూనిట్లకు ఇచ్చిన ఆర్డర్ల లక్ష్యంలో నిత్యం 50 వేల మీటర్ల పైన వస్త్రోత్పత్తి చేయాలి. కానీ 25 వేల మీటర్లకు మించడం లేదు. లక్ష్యం పూర్తి కాకపోవడంతో తాజాగా మే 15కు గడువు పొడిగించారు.

ఏకరూప దుస్తుల ఉత్పత్తిలో 67 శాతం పాలిస్టర్‌, 33 శాతం కాటన్‌ కలిసిన నూలును వినియోగించేవారు. ఇలా ఉత్పత్తి చేసిన తెలుపు రకం వస్త్రానికి డైయింగ్‌, ప్రింటింగ్‌తో పాటు ప్రాసెసింగ్‌ చేసేవారు. దీంతో నాణ్యత పరంగా ఏడాదికి మించి ఉండటం లేదు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఈసారి వందశాతం కాటన్‌ నూలును రంగులతో సహా ఉత్పత్తి చేస్తుంది. దీని తర్వాత కేవలం ప్రాసెసింగ్‌ చేసి నేరుగా కుట్టించి ఇవ్వొచ్చు. ఈసారి నూలు కొనుగోలు కూడా పూర్తిగా టెస్కోనే చూసుకుంటుంది. డిజైన్లతో కూడిన బీములను నేరుగా వస్త్రోత్పత్తిదారులకు అందిస్తుంది. వీటిని పూర్తిగా ర్యాపియర్‌ మగ్గాలపైనే ఉత్పత్తి చేయడం వీలవుతుంది. అందుకే టెక్స్‌టైల్‌ పార్కులోని 48 యూనిట్లలోని మగ్గాలపై ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ కార్మికుల కొరత ఉంది. సిరిసిల్ల పట్టణంలో ఉన్నవి సాధారణ మగ్గాలు. వీటిపై పని చేసిన వారికి ర్యాపియర్‌ మగ్గాలు నడపడం తెలియదు. ఈ సమస్యను అధిగమించేందుకు చేనేత, జౌళిశాఖ ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఆసక్తితో ముందుకొచ్చిన కార్మికులకు ర్యాపియర్‌ మగ్గాలపై శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తుంది. అయినప్పటికీ కార్మికుల కొరత తీరడం లేదు.

కూలి నిర్ణయంతో...

సాధారణ ముతక రకం పాలిస్టర్‌ ఉత్పత్తుల్లో మీటరకు రెండు రూపాయలకు మించి కూలి గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. పాఠశాల వస్త్రోత్పత్తుల తయారీకి మీటరుకు రూ. 4.25లుగా నిర్ణయించారు. దీంతో పట్టణంలోని సుమారు 200 మంది కార్మికులకు ఇక్కడ ఉపాధి లభిస్తుంది. ఏకరూప దుస్తుల ఆర్డర్ల లక్ష్యంపై చేనేత, జౌళిశాఖ ఆర్డీడీ అశోక్‌ కుమార్‌ను ‘ఈనాడు’ సంప్రదించింది. టెస్కో వస్త్ప్రోత్తుల సేకరణ ప్రారంభించింది. సేకరించిన వస్త్రాన్ని ప్రాసెసింగ్‌ పూర్తి చేసుకుని పాఠశాలలకు సరఫరాకు సిద్ధం చేస్తున్నారు. మే 15లోపు లక్ష్యం పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని