logo

నేడు జమ్మికుంటకు సీఎం.. 8న వేములవాడకు పీఎం

పెరుగుతున్న ఉష్ణోగ్రతల మాదిరిగానే పార్టీలు ప్రచార వేడిని క్రమంగా పెంచుతున్నాయి. ఉత్తర తెలంగాణలో కీలకమైన జిల్లాగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్‌పై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి.

Published : 30 Apr 2024 02:21 IST

ఈనాడు, కరీంనగర్‌

పెరుగుతున్న ఉష్ణోగ్రతల మాదిరిగానే పార్టీలు ప్రచార వేడిని క్రమంగా పెంచుతున్నాయి. ఉత్తర తెలంగాణలో కీలకమైన జిల్లాగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్‌పై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి. ఉద్యమాల గడ్డ తమకు అడ్డా అని ఓ పార్టీ భావిస్తుంటే.. గత వైభవాన్ని అందిపుచ్చుకుని అధికారంలోకి వచ్చామని మరో పార్టీ విశ్వసిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో తమ గెలుపునకు అనుకూలమైన ప్రాంతమని ఇంకో పార్టీ దూకుడును పెంచుతోంది. ఈ క్రమంలో ముఖ్య నేతల ప్రచారాలు ఖరారు అవుతున్నాయి.

నేడు సీఎం రేవంత్‌ రాక

శాసనసభ ఎన్నికల సమయంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో జమ్మికుంటలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రచార యాత్రను సాగించిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి మంగళవారం వస్తున్నారు. జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు తరఫున ప్రచారాన్ని సాగించబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడి సమావేశానికి సీఎం రానుండటంతో అవసరమైన ఏర్పాట్లను పార్టీ నాయకులు పూర్తి చేశారు. భారీ జన సమీకరణపై దృష్టి పెట్టారు. మరుసటి రోజు మే 1న కోరుట్ల సభలోనూ సీఎం పాల్గొంటారు. అక్కడ నిజామాబాద్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తారు. తరువాత పెద్దపల్లి జిల్లాలోనూ అభ్యర్థి గడ్డం వంశీకి మద్దతుగా ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కరీంనగర్‌ పట్టణంలో పోలింగ్‌ తేదీకి రెండు, మూడు రోజుల ముందు ప్రియాంక గాంధీ లేదా రాహుల్‌ గాంధీలను రప్పించి భారీ సభను ఏర్పాటు చేయాలని కరీంనగర్‌ కాంగ్రెస్‌ భావిస్తున్నారు.

రెండ్రోజుల్లో కేసీఆర్‌

భారాస అభ్యర్థుల తరపున మాజీ సీఎం కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాలో మే 2వ తేదీ నుంచి బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. 2న జమ్మికుంటలో, 3న రామగుండంలో, 5వ తేదీన జగిత్యాలలో రోడ్‌షోలు నిర్వహిస్తారు.

మోదీ పర్యటన ఖరారు

భాజపా కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా మే 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడకు రానున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్‌తోపాటు నిజామాబాద్‌ నియోజకవర్గానికి సమీపంలో ఉండటం, పుణ్యక్షేత్రం కావడంతో వేములవాడను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని