logo

హత్యోన్మాదంపై నిరసన వెల్లువ

హుబ్బళ్లి- ధార్వాడ విద్యార్థిని నేహా హీరేమఠ్‌ హత్యను ఖండిస్తూ వివిధ సంఘాలు ఇచ్చిన పిలుపునకు ధార్వాడలోని వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులు స్పందించారు

Published : 23 Apr 2024 02:24 IST

మైసూరు ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడుతున్న బీవై విజయేంద్ర

హుబ్బళ్లి, న్యూస్‌టుడే : హుబ్బళ్లి- ధార్వాడ విద్యార్థిని నేహా హీరేమఠ్‌ హత్యను ఖండిస్తూ వివిధ సంఘాలు ఇచ్చిన పిలుపునకు ధార్వాడలోని వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులు స్పందించారు. శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించారు. మైసూరులో భాజపా అధ్యక్షుడు విజయేంద్ర నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ కార్యకర్తలు, హిందూ సంఘాల సభ్యులు, విద్యార్థులు నేహాకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ధార్వాడ, తుమకూరు, దావణగెరె, హావేరి, శివమొగ్గ, చిత్రదుర్గ, బళ్లారి, కలబురగి, మండ్య, బాగలకోటె, విజయనగర, విజయపుర, రామనగర, మండ్య, తదితర జిల్లాల్లోనూ వివిధ సంఘాల సభ్యులు ధర్నా చేశారు. హుబ్బళ్లిలో భాజపా కార్యకర్తలు టైర్లు, ముఖ్యమంత్రి చిత్రపటాలను కాల్చి నిరసన వ్యక్తం చేశారు. తుమకూరులో విపక్ష నాయకుడు ఆర్‌.అశోక్‌, బళ్లారిలో మాజీ ఎమ్మెల్యే సోమశేఖరరెడ్డి నేతృత్వంలో ధర్నా, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నేహా తండ్రికి కాంగ్రెస్‌ పార్టీపై నమ్మకం పోయిందని విజయపురలో లోక్‌సభ సభ్యుడు రమేశ్‌ జిగజిణగి ఆరోపించారు. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.

విద్యార్థిని నేహా హత్య కేసు దర్యాప్తును సీవోడీకి అప్పగించామని హోం మంత్రి డాక్టర్‌ పరమేశ్వర్‌ తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి పది రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరామని చెప్పారు. ఆయన సోమవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ హుబ్బళ్లి పోలీసుల నుంచి సీవోడీ అధికారులు ఇప్పటికే దర్యాప్తు బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. హత్య వెనుక కుట్ర కోణం ఉంటే దర్యాప్తు అనంతరం అన్నీ వెలుగులోకి వస్తాయన్నారు. హత్యకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలు నేహా తల్లిదండ్రులను బాధించి ఉంటే, బేషరతుగా క్షమాపణలు చెబుతానని పేర్కొన్నారు. భాజపా నాయకులు విద్యార్థిని హత్య కేసును తమ రాజకీయాలకు వినియోగించుకుంటున్నట్లు దుయ్యబట్టారు. వారి సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుందని అన్నారు.

 రాజకీయ రంగు..

 నేహా హత్య ఘటన రాజకీయ మలుపు తీసుకుంది. ఎన్నికల సమయం కావడంతో విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌, నమో బ్రిగేడ్‌ సంస్థ వ్యవస్థాపకుడు చక్రవర్తి సూలిబెలె తదితరులు హుబ్బళ్లిలో నిరంజన్‌ హీరేమఠను కలసి సాంత్వన పలికారు. హత్యను ముస్లిం సంఘాలు అన్నీ ఖండించినా.. దానికి రాజకీయ రంగు పులిమేందుకు భాజపా, హిందూ సంఘాలు ప్రయత్నిస్తున్నాయని సీనియరు సాహితీవేత్త డాక్టర్‌ కె.షరీఫా ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా హుబ్బళ్లికి రావడం, ఇది లవ్‌ జిహాద్‌ అంటూ శ్రీరామసేన వ్యవస్థాపకుడు ప్రమోద్‌ ముతాలిక్‌ వ్యాఖ్యలు చేయడాన్ని ఆమె ఖండించారు. కొద్ది నెలల కిందట ఎయిర్‌ ఇండియా ఉద్యోగి ప్రవీణ్‌ చౌగులె తన ప్రేమను నిరాకరించిన అయనా, ఆమె తల్లి, అక్క, సోదరుడ్ని హత్య చేసినా, ఎవరూ మాట్లాడలేదని, రుక్సానా అనే యువతిని వివాహం చేసుకుని, ఒక బిడ్డ కలిగిన తర్వాత ఆమెను హత్య చేసిన ప్రదీప్‌ అనే యువకుడి వ్యవహారాన్ని  ఎవరూ ఖండించలేదని వాపోయారు. రాజకీయాల కోసమే దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆక్రోశించారు.

14 సార్లు పొడిచాడు..

నేహాను తొమ్మిదిసార్లు పొడిచిన ఫయాజ్‌.. ఆమెను హత్య చేశాడని మొదట భావించారు. మరణోత్తర పరీక్షల్లో ఆమెను మొత్తం 14 సార్లు పొడిచాడని గుర్తించారు. మరణోత్తర పరీక్షల నివేదికను కిమ్స్‌ వైద్యులు పోలీసులకు సోమవారం అందజేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని