logo

హామీలు విస్మరించిన భాజపా

పేదలు, మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తుకు ఈ లోక్‌సభ ఎన్నికలు నిర్ణయాత్మకమైనవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు.

Published : 23 Apr 2024 02:27 IST

మోదీపై విరుచుకుపడిన సిద్ధు

 కడూరులో నిర్వహించిన సమావేశానికి  హాజరైన స్థానికులు

శివమొగ్గ, న్యూస్‌టుడే : పేదలు, మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తుకు ఈ లోక్‌సభ ఎన్నికలు నిర్ణయాత్మకమైనవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ‘ఇండియా షైనింగ్‌’ అంటూ గతంలో ప్రచారానికి వెళ్లి భాజపా ఓడినట్లే.. ఈసారి ‘విససిత భారత్‌’ పేరిట ప్రచారం చేసుకుంటున్న మోదీకి ఓటమి తప్పదన్నారు. హాసన, చిక్కమగళూరు-ఉడుపి, శివమొగ్గ అభ్యర్థులకు మద్దతుగా కడూరు, బాణావర తదితర ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో సిద్ధు సోమవారం మాట్లాడారు. ఖాళీ చెంబు ఇచ్చిన భాజపాకు మద్దతు ఇచ్చి మీ ఓటు ఘనతను పోగొట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలకు స్పందించే కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అబద్ధపు హామీలిస్తూ అందరినీ వంచించారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ఈసారి ఘోరంగా ఓడిపోతామని తెలుసుకునే కర్ణాటకలో అబద్ధపు ప్రచారం, మతం ఆధారంగా ఓట్లు వేయాలని ప్రచారం చేసుకుంటున్నారని భాజపా నేతలను దుయ్యబట్టారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని నమ్మించి, వారి ఖర్చులను మూడు రెట్లు పెంచేశారని ఆరోపించారు. ఇంధనం, గ్యాసు, ఎరువుల ధర పెంపు సామాన్యునిపై పిడుగుపాటేనన్నారు. ప్రధాని తన స్థాయిని తగ్గించుకుని మాట్లాడుతున్నారని నిందించారు. హిందూ మహిళల మంగళసూత్రాన్ని తెంపి, ముస్లిం మహిళలకు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆయన వ్యాఖ్యానించడం తగదన్నారు. ప్రధానిగా ఉన్న వ్యక్తి కుల, మతాలను ఉటంకించి ప్రచారం చేసుకోవడం గతంలో ఎక్కడా చూడలేదన్నారు. కర్ణాటకతో పాటు దేశానికి భాజపా చిప్ప, చెంబులను మాత్రమే ఇచ్చిందన్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ చెబుతున్న అబద్ధాలను విని సిగ్గుపడ్డానని చెప్పారు. మోదీని మించి ఆయన అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో రూ.76 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మోదీ మాత్రం శ్రీమంతులు, పారిశ్రామికవేత్తలు చేసిన రూ.15 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని నిప్పులు చెరిగారు. ఓటర్లకు రూ.1.25 లక్షలు కావాలా, ఖాళీ చెంబు కావాలా.. అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని