logo

ఆచితూచి హస్తం అడుగులు

కాంగ్రెస్‌ శ్రేణులు, ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆపార్టీ రెండో జాబితా విడుదలైనా.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మరో ఐదు స్థానాల అభ్యర్థిత్వాలు ఖరారు కాలేదు.

Published : 28 Oct 2023 05:01 IST

రెండో జాబితాలో ముగ్గురికి చోటు
ఈటీవీ, ఖమ్మం

కాంగ్రెస్‌ శ్రేణులు, ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆపార్టీ రెండో జాబితా విడుదలైనా.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మరో ఐదు స్థానాల అభ్యర్థిత్వాలు ఖరారు కాలేదు. రెండో జాబితాలో మరో మూడు స్థానాలకు అభ్యర్థుల్ని హస్తం పార్టీ ప్రకటించింది. ఖమ్మం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరులో పార్టీ ప్రచార కమిటీ కోఛైర్మన్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలవనున్నారు.

భయ జిల్లాల్లో పది శాసనసభ స్థానాలకు తొలి విడత జాబితాలో మధిర- మల్లు భట్టి విక్రమార్క, భద్రాచలం- పొదెం వీరయ్యను అభ్యర్థులుగా హస్తం పార్టీ ప్రకటించింది. సర్వే ఫలితాలు ఒకలా.. సీనియర్‌ నేతలు తమ అనుచరుల కోసం పట్టుబడుతుండటంతో పరిస్థితి ఇంకోలా మారటంతోనే మిగతా ఐదు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీకి అగ్నిపరీక్షగా మారిందన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్‌- వామపక్షాల పొత్తులు దాదాపు ఖాయమవటం, ఉభయ జిల్లాల నుంచి ఒకట్రెండు స్థానాలు కేటాయించాల్సి ఉండటంతో పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను హస్తం పార్టీ ప్రకటించలేదని సమాచారం.


రసవత్తర పోరే..

ఖమ్మం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, పాలేరులో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభ్యర్థిత్వాలు ఖరారవటంతో రెండుచోట్లా పోరు రసవత్తరంగా మారనుంది. ఖమ్మం నుంచి తుమ్మల మూడోసారి బరిలో నిలుస్తున్నారు. వాస్తవానికి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీచేయాలని ఆసక్తి కనబరిచారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం అనూహ్యంగా ఖమ్మం బరిలో నిలవాలని సూచించటంతో తుమ్మల అంగీకరించటం, ఆతర్వాత ఆయన అభ్యర్థిత్వం ఖరారవటం చకచకా జరిగిపోయాయి. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన తుమ్మల 2009లో తెదేపా తరఫున ఖమ్మం బరిలో తొలిసారి నిలిచి గెలుపొందారు. 2014లో మరోసారి తెదేపా నుంచి పోటీచేసి పువ్వాడ అజయ్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్‌ను రెండోసారి ఢీకొట్టేందుకు తుమ్మల సన్నద్ధమవుతున్నారు.


2014లో పువ్వాడ అజయ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా, తుమ్మల తెదేపా నుంచి పోటీచేశారు. ఈసారి పువ్వాడ అజయ్‌ భారాస అభ్యర్థిగా.. తుమ్మల కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తుండటం గమనార్హం.


  • కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కోఛైర్మన్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం వైకాపా ఎంపీగా గెలుపొందారు. తాజాగా పాలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఇక్కడ భారాస అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి బరిలోకి దిగుతున్నారు. వైతెపా అధినేత్రి వైఎస్‌ షర్మిల ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ఇదివరకే ప్రకటించినా  పొంగులేటికి కాంగ్రెస్‌ టికెట్‌ ఖరారవటంతో ఆమె బరిలో నిలుస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
  • పినపాక నియోజకవర్గంలో ఐదుగురు టికెట్‌ ఆశించినా కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వైపే మొగ్గుచూపింది. పినపాక నుంచి పాయం ఐదోసారి బరిలో నిలవనున్నారు. గతంలో నాలుగుసార్లు పోటీచేస్తే రెండుసార్లు గెలుపొందారు. 2018 ఎన్నికల్లో భారాస అభ్యర్థిగా బరిలోకి దిగి అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి రేగా కాంతారావు చేతిలో ఓటమిపాలయ్యారు. తాజా ఎన్నికల్లో ఈ ఇద్దరు పోటీపడుతున్నా.. వీరి పార్టీలు మారాయి. రేగా కాంతారావు భారాస తరఫున, పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీలో నిలుస్తుండటం విశేషం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని