logo

లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడి మృతి

ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన  ఘటన ఖమ్మం  ఎన్టీఆర్‌ కూడలిలో శుక్రవారం జరిగింది.  పోలీసుల కథనం ప్రకారం...

Published : 20 Apr 2024 01:55 IST

మెట్టు రాములు

ఖమ్మం నేరవిభాగం: ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన  ఘటన ఖమ్మం  ఎన్టీఆర్‌ కూడలిలో శుక్రవారం జరిగింది.  పోలీసుల కథనం ప్రకారం... ఖమ్మం గ్రామీణ మండలం ఎం.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన మెట్టు రాములు(51) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నారు. తన బంధువు సంపత్‌ ద్విచక్ర వాహనంపై టేకులపల్లి వద్ద పని ప్రదేశానికి వస్తున్నారు. కూడలిలో సిగ్నల్‌ పడటంతో వీరు ఆగారు. గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో బయలుదేరిన వీరిని వెనుక నుంచి లారీ ఢీకొంది. కిందపడిన రాములు పైనుంచి లారీ టైరు వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే అతడు మృతిచెందారు. సంపత్‌ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. అన్నం సేవా ఫౌండేషన్‌ నుంచి వచ్చిన అమరేశ్వరరావు బృందం రాములు మృతదేహాన్ని సర్వజనాసుపత్రి మార్చురీకి తరలించింది. రాములుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  దర్యాపు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ తెలిపారు.


తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు..

తిరుమలాయపాలెం, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు తాటిచెట్టుపైనుంచి కిందపడి కల్లుగీత కార్మికుడు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...   పాతర్లపాడుకు చెందిన గీత కార్మికుడు మల్లారపు వెంకన్న (52) శుక్రవారం ఉదయం చంద్రుతండా సమీపంలో ఓ తాటిచెట్టు ఎక్కారు. కల్లుగీసే క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడి నుంచి పక్కనే ఉన్న బావిలో పడిపోయాడు. ఈ ఘటనలో అతని తల వెనక బలమైన గాయం కావటంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఎస్సై గిరిధర్‌రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని వెలికి తీయించారు. శవపంచనామా కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకన్నకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


వడదెబ్బకు ఒకరు..

మణుగూరు పట్టణం, న్యూస్‌టుడే: మణుగూరు పట్టణంలోని శేషగిరినగర్‌కు చెందిన వేల్పుల వెంకటేశ్వర్లు(47) వడదెబ్బకు తాళలేక గురువారం అర్ధరాత్రి మృతి చెందారు. వెంకటేశ్వర్లు కూలీ పనులు చేస్తుంటారు. రోజులాగే కూలీ పని చేసి సురక్షా బస్టాండ్‌ వద్ద ఉన్న వెంకటేశ్వర్లు అక్కడే మృతి చెందారు. బీఏలో బంగారు పతకం సాధించిన ఆయన ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.


రైలు నుంచి జారిపడి యువకుడు..

స్టేషన్‌ఘన్‌పూర్‌, న్యూస్‌టుడే: రైలు నుంచి జారిపడి యువకుడు మృతిచెందిన ఘటన నష్కల్‌-స్టేషన్‌ఘన్‌పూర్‌ రైల్వేస్టేషన్ల మధ్య శుక్రవారం ఉదయం చోటుచేసుకొంది. రైల్వే అధికారుల కథనం ప్రకారం... ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గిద్దెవారిగూడెం తండాకు చెందిన బానోతు గాంధీలాల్‌(24) ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలై మరణించారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే ఎస్సై మొహినుద్దీన్‌ తెలిపారు.


రూ.1.78 కోట్లకు గ్రానైట్‌ వ్యాపారుల ఐపీ

ఖమ్మం న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ఖమ్మం బుర్హాన్‌పురానికి చెందిన భార్యాభర్తలు చెరుకూరి శ్రీధర్‌, ఉషారాణి మొత్తం 31 మంది రుణదాతలను ప్రతివాదులుగా చూపుతూ శుక్రవారం స్థానిక ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో రూ.1,78,000,00కు ఐపీ దాఖలు చేశారు. పిటిషనర్లు 2010 నుంచి గ్రానైట్‌ వ్యాపారం చేస్తూ 2015లో గుర్రాలపాడులోని శ్రీనిలయ గ్రానైట్స్‌ ఫ్యాక్టరీని కొనుగోలు చేశారు. వ్యాపార అభివృద్ధి కోసం రుణదాతల వద్ద అప్పులు తీసుకున్నారు. అనంతరం కొవిడ్‌ తదితర కారణాల వల్ల వ్యాపారంలో నష్టాలు రావడంతో బాకీలు చెల్లించే పరిస్థితి లేదని పేర్కొంటూ న్యాయవాది మచ్చా నగేశ్‌బాబు ద్వారా కోర్టులో ఐపీ దాఖలు చేశారు.


పోలీసుల అదుపులో హత్య కేసు నిందితుడు

వైరా, న్యూస్‌టుడే: ఏపీలోని కోనసీమ జిల్లాలో ఓ హత్యకు పాల్పడిన వ్యక్తిని వైరా పోలీసులు శుక్రవారం అదుపులో తీసుకున్నారు. రెబ్బవరానికి చెందిన సాదం రామకృష్ణ 2022 అక్టోబరు 24న అదే గ్రామంలో ఓ హత్యకు పాల్పడ్డాడు. తన భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడనే అక్కసు పెంచుకుని సొంత తమ్ముడు నరేశ్‌ను దారుణంగా హత్య చేశాడు. హత్య ఘటనతో అతడు జైలు పాలయ్యారు.

కక్ష పెట్టుకొని... రెబ్బవరంలో హత్య తరువాత రామకృష్ణ భార్య ఏపీలోని కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో అమ్మమ్మ గంటాలమ్మ వద్ద ఉంటున్నారు. జైలు జీవితం అనంతరం బెయిల్‌పై వచ్చిన రామకృష్ణ పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం చేసుకుని తన భార్యతో వేరే చోట   కొద్ది రోజులు ఉన్నప్పటికీ మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. భార్య మళ్లీ తమ అమ్మమ్మ వద్దకు వెళ్లారు. విచక్షణ కోల్పోయిన రామకృష్ణ భార్య  బంధువుల ఇళ్లపై దాడిచేసి నిప్పంటించడంతో పోలీసులు మరో కేసు నమోదు చేసి మళ్లీ జైలుకు పంపించారు. ఈ కేసులోనూ  బెయిల్‌పై వచ్చిన రామకృష్ణ ఈనెల 16న గంటిలోని తన భార్య ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లాడు. నిద్రిస్తున్న తన భార్య అమ్మమ్మ గంటాలమ్మపై విచక్షణరహితంగా దాడిచేసి చంపి పరారయ్యాడు. తన భార్యకు ఆశ్రయం ఇస్తుందన్న కోణంలో ఆమెను హత్య చేసినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రామకృష్ణ అదే రోజు స్వగ్రామం రెబ్బవరంలో ఉన్నాడన్న సమాచారం కొత్తపేట పోలీసులకు అందింది. కొత్తపేట పోలీసులు వైరా ఎస్సై వంశీకృష్ణ భాగ్యరాజుకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు రెబ్బవరం చేరుకుని నేరానికి పాల్పడిన రామకృష్ణను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుడిని కొత్తపేట పోలీసులకు అప్పగిస్తామని స్థానిక పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని