logo

బరిలో నిలవాలంటే.. పరిశీలన దశ దాటాల్సిందే!

గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్‌ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ)కి అఫిడవిట్లు సమర్పించారు.

Updated : 23 Apr 2024 05:29 IST

గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్‌ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ)కి అఫిడవిట్లు సమర్పించారు. అందుకే నామినేషన్‌       తిరస్కరణకు గురైంది. కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్‌ సైతం తిరస్కరణకు గురవటంతో భాజపా అభ్యర్థి ఏకగ్రీవంగా విజయం సాధించినట్టయ్యింది.

ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం 

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. ఈనెల 18 నుంచి నామినేషన్ల క్రతువు కొనసాగుతుండగా.. ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. గురువారం వరకు నామినేషన్లు సమర్పించటానికి గడువుంది. 26న నామపత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్లు అధికారుల పరిశీలనలో నిలిస్తేనే ఆయా అభ్యర్థులు బరిలో నిలవవచ్చు. ఏమాత్రం తేడా వచ్చినా నామపత్రాలు తిరస్కరణకు గురయ్యే ఆస్కారముంటుంది. అందుకే నామపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రాధాన్యం సంతరించుకుంది.

నిర్దేశిత సమయంలో..

ప్రజాప్రాతినిధ్య చట్టం- 1951లోని సెక్షన్‌ 30 ప్రకారం.. రిటర్నింగ్‌  అధికారి నోటిఫికేషన్‌లో పేర్కొన్న తేదీ, ప్రదేశం, సమయంలో మాత్రమే నామపత్రాల పరిశీలన జరుగుతుంది. అల్లర్లు, బహిరంగ హింస, ఆర్‌ఓ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడినప్పుడు మినహా నామినేషన్ల పరిశీలన ప్రక్రియను వాయిదా వేయటానికి వీల్లేదు. అభ్యర్థులు దాఖలు చేసిన ప్రతి నామినేషన్‌ను సంబంధిత ఆర్‌ఓ పరిశీలిస్తారు. నామపత్రాలను ఆమోదించటం, తిరస్కరించటం వంటివి ఆర్‌ఓ పరిధిలో ఉంటాయి. ఒకవేళ  నామినేషన్‌ తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలను రాతపూర్వకంగా తెలియజేస్తారు. అభ్యర్థుల నామపత్రాలను పరిశీలించటానికి   కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను రిటర్నింగ్‌ అధికారి కల్పిస్తారు.

నామినేషన్ల పరిశీలన కార్యక్రమానికి వీరికి మాత్రమే అనుమతి

  •  నామినేషన్‌ వేసిన అభ్యర్థి
  •  అభ్యర్థి ఎన్నికల ఏజెంట్‌
  •  అభ్యర్థి ప్రతిపాదకులు ఒకరు (స్వతంత్ర అభ్యర్థి.. నాలుగు సెట్ల నామపత్రాలు దాఖలు చేస్తే ప్రతిపాదకుల సంఖ్య 40 అవుతుంది. అయినప్పటికీ ఒక ప్రతిపాదకుడు మాత్రమే హాజరవటానికి అవకాశముంటుంది) 
  • అభ్యర్థి చేత రాతపూర్వకంగా అమోదం పొందిన మరోవ్యక్తి.

తిరస్కరణకు కారణాలు..

  •  పరిశీలన తేదీలోగా ఎన్నికల సంఘం నిర్దేశించిన అర్హతలను అభ్యర్థులు కలిగి ఉండకపోవటం.
  •  నామపత్రాల్లో అభ్యర్థి, ప్రతిపాదించిన వ్యక్తుల సంతకం నిజమైనది కాకపోవటం.
  •  నామినేషన్‌ వేసిన అభ్యర్థి తన ఓటుహక్కును సంబంధిత ఓటరు జాబితాలో చూపకపోవటం.
  •  నామపత్రంలోని అన్ని కాలమ్స్‌ను పూరించకపోవటం.
  •  ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థులు సంబంధిత కుల ధ్రువపత్రం చూపించకపోవటం.
  •  అభ్యర్థి తన వయస్సుకు సంబంధించిన సమాచారం నామపత్రాల్లో పొందుపరచకపోవటం.తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించటం. 

రిటర్నింగ్‌ అధికారిదే తుది నిర్ణయం

అభ్యర్థుల నామపత్రాలను పరిశీలించి అమోదించటం లేదా తిరస్కరించటం ఆర్‌ఓ ముఖ్య విధి. నామినేషన్ల పరిశీలన అనంతరం ఆర్‌ఓ తీసుకున్న నిర్ణయమే అంతిమం. ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం రిటర్నింగ్‌ అధికారికి సైతం ఉండదు. నామపత్రాల పరిశీలన కార్యక్రమం పూర్తైన తర్వాత చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితాను రూపొందిస్తారు. దానిని నోటీసు బోర్డులో ఉంచుతారు.  నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిశాక బరిలో నిలిచే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని