logo

కాంగ్రెస్‌ అభ్యర్థిగా రఘురాంరెడ్డి

ఖమ్మం లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్‌ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది.

Published : 25 Apr 2024 03:04 IST

  • పుట్టిన తేదీ: 1961 డిసెంబర్‌ 19
  • జన్మస్థలం: చేగొమ్మ, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా
  • తల్లిదండ్రులు: రామసహాయం జయమాల, సురేందర్‌రెడ్డి
  • విద్యాభ్యాసం: హైదరాబాద్‌ నిజాం కళాశాలలో బీకామ్‌, ప్రస్తుతం వ్యాపారరీత్యా హైదరాబాద్‌లో నివాసముంటున్నారు.
  • రఘురాంరెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వినాయక్‌రెడ్డి సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్‌ పెద్ద కుమార్తె ఆశ్రితను వివాహమాడారు. చిన్న కుమారుడు అర్జున్‌రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డిని పెళ్లి చేసుకున్నారు.

ఈటీవీ- ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్‌ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. రాజకీయ దిగ్గజం రామసహాయం సురేందర్‌రెడ్డి కుమారుడు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడైన రఘురాంరెడ్డిని అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్‌ టికెట్‌ వరించింది.
హేమాహేమీలు పోటీపడ్డా.. అనేక మలుపులు, చర్చోపచర్చల అనంతరం కాంగ్రెస్‌ అధిష్ఠానం చివరకు రఘురాంరెడ్డి వైపే మొగ్గుచూపింది. స్క్రీనింగ్‌ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీ పలుమార్లు సమావేశమైనప్పటికీ ఖమ్మం అభ్యర్థి ఎంపికపై పీటముడి తప్పలేదు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్‌, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి టికెట్‌ ఆశించటం, పలువురు సీనియర్లు సైతం రేసులోకి రావటంతో అభ్యర్థి ఎంపిక పార్టీకి క్లిష్టంగా మారింది. అయినా ఏకాభిప్రాయ సాధనే ధ్యేయంగా ముఖ్యనేతలతో అధిష్ఠానం సంప్రదింపులు జరిపింది. ఓవైపు నామినేషన్ల గడువుకు సమయం సమీపిస్తున్నప్పటికీ అభ్యర్థి తేలకపోవడంతో చివరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగారు. బెంగళూరులో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో అభ్యర్థి ఎంపికపై సమాలోచనలు జరిపారు. మంత్రి తుమ్మలతో ఫోన్‌లో సంప్రదించి ఆయన అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత రఘురాంరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ  ఏఐసీసీ ప్రకటన వెలువరించింది.
నేడు నామినేషన్‌ దాఖలు.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా రఘురాంరెడ్డి గురువారం నామినేషన్‌ వేయనున్నారు. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌  ఎన్నికల ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న పొంగులేటి వియ్యంకుడికే టికెట్‌ దక్కటంతో అట్టహాసంగా నామపత్రాలు దాఖలు చేసేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని