logo

మగువలే నిర్ణేతలు

పాలమూరులోని రెండు లోక్‌సభా స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటముల్ని మహిళా ఓటర్లే ప్రభావితం చేయనున్నారు.

Updated : 23 Apr 2024 06:03 IST

రెండు లోక్‌సభ స్థానాల్లో మహిళా ఓటర్లే అధికం
ప్రత్యేక దృష్టి సారిస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

ఈనాడు, మహబూబ్‌నగర్‌, దేవరకద్ర గ్రామీణం, న్యూస్‌టుడే :  పాలమూరులోని రెండు లోక్‌సభా స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటముల్ని మహిళా ఓటర్లే ప్రభావితం చేయనున్నారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లోని మొత్తం ఓటర్లలో సగానికిపైగా మగువలే ఉండటమే దీనికి కారణం. ప్రధాన పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. మహిళా ఓటర్లను మెప్పించగలిగితే గెలుపు అవకాశాలు సులభమవుతాయని పార్టీలు భావిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ పరిధిలో 16,80,417 మంది ఓటర్లు ఉండగా వీరిలో 8,48,293 (50.48 శాతం) మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. నాగర్‌కర్నూల్‌ పరిధిలో మొత్తం 17,34,773 మంది ఓటర్లుండగా వీరిలో 8,70,694 (50.19 శాతం) మహిళలు ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో కల్వకుర్తి, కొల్లాపూర్‌ మినహా మిగతా ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో అతివలే అధిక సంఖ్యలో ఉన్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించడానికి పార్టీలు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.
గ్యారంటీ పథకాలు వివరిస్తూ.. : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈసారి మహిళా ఓటర్లపై ప్రధానంగా దృష్టి పెట్టింది. గతేడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రావడంతో వారికోసం ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తోంది. ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేసి మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చని కాంగ్రెస్‌ ముఖ్యులు భావిస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాబోయే రోజుల్లో నెలకు రూ.2,500 అందించే పథకాన్ని కూడా అమలు చేస్తామని వివరిస్తున్నారు. కేంద్రంలో మోదీ సిలిండర్‌ ధర పెంచితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాయితీపై రూ.500కే గ్యాస్‌ను అందిస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికి మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి తన మేనిఫెస్టోకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలకు సంబంధించిన పథకాలను చేర్చడానికి ప్రణాళికలు తయారు చేశారు. నాగర్‌కర్నూల్‌లోనూ మహిళా ఓటర్లపై మల్లు రవి ప్రత్యేకంగా దృష్టి సారించారు.


గత పథకాలను వివరిస్తూ..

భారాస సైతం మహిళా ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించింది. గత పదేళ్లలో అనేక పథకాల ద్వారా అతివలు లబ్ధి పొందారని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి, ఒంటరి మహిళలకు పింఛన్లు వంటివి అమలు చేసిందని తమ ప్రభుత్వమే అని భారాస అభ్యర్థులు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తమ ప్రచారంలో మహిళా సంక్షేమంపై వివరిస్తున్నారు.  


నారీ శక్తిపై భాజపా ప్రచారం..

మహిళా ఓటర్లను ఆకర్షించడానికి భాజపా ఆత్మనిర్భర్‌ నారీ శక్తిపై దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమంపై విసృత్తంగా ప్రచారం చేపడుతున్నారు. మహిళలకు భద్రత, సాధికారత కల్పించడానికి కేంద్రం మిషన్‌ శక్తి కార్యక్రమంపై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా అందిస్తున్న రుణాలు కేంద్రం నుంచి వస్తున్నట్లు చెబుతున్నారు. ముద్ర యోజన, లఖ్‌పతి దీదీ, సుకన్య సమృద్ధి యోజన, స్టాండ్‌ ఆఫ్‌ ఇండియా కార్యక్రమాలను భాజపా జనంలోకి తీసుకెళ్తున్నారు. వీటిని వివరించడానికి ప్రత్యేకంగా మహిళా మోర్చా కార్యకర్తలు రంగంలోకి దిగారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ, నాగర్‌కర్నూల్‌లో భరత్‌ ప్రసాద్‌ అతివలకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని